సినీ పరిశ్రమలో మరో విషాదం..ప్రముఖ రచయిత మృతి!

టాలీవుడ్ ను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఈ మధ్యనే దర్శకుడు సాగర్ మృతి చెందాడు. అటు తర్వాత రెండు రోజులకే ప్రముఖ దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ కూడా కన్నుమూశారు. ఈ ఇద్దరు దర్శకులు మరణించడంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ షాక్ నుండి టాలీవుడ్ ఇంకా కోలుకోకుండానే మరో రచయిత కన్నుమూయడం చర్చనీయాంశం అయ్యింది. వివరాల్లోకి వెళితే.. తెలుగు, కన్నడ చిత్రాలకు రచయితగా పని చేసిన యడవల్లి వెంకట లక్ష్మీ నరసింహ శాస్త్రి (వైవీఎల్ ఎన్ శాస్త్రి) అనారోగ్య కారణాల వల్ల విజయవాడలో శనివారం రాత్రి కన్నుమూశారు.

ఈ వార్త కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యడవల్లిగా ఈయన బాగా ఫేమస్. ఈయన నెల్లూరులో జన్మించారు. తండ్రి మున్సిపాలిటీ హెల్త్ ఆఫీసర్ కావడంతో ఫైనల్ గా విజయవాడలో స్థిరపడ్డారు. ఈయన విద్యాభ్యాసం అక్కడే జరిగింది. ఎస్ఆర్ఆర్ అండ్ సీవీఆర్ కాలేజీలో పీయూసీ, లయోలా కాలేజీలో డిగ్రీ, తిరుపతి వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఎంఏ చదివారు. చిన్నతనం నుండి ఈయనకు సాహిత్యం పై పట్టు ఉంటుంది. ఈ క్రమంలో ఆయన యువకుడిగా ఉన్నప్పుడే ‘నక్షత్రాలు’ పేరుతో ఓ పుస్తకాన్ని రచించారు. రాధాకృష్ణమూర్తి అనే సినీ నిర్మాత ద్వారా యడవల్లి సినిమాల్లోకి అడుగు పెట్టారు.

ప్రఖ్యాత దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుతో కూడా ఈయన కలిసి పనిచేశారు. యడవల్లి ప్రస్తుతం కేంద్ర సెన్సార్ బోర్డ్ (సీబీఎఫ్‌సీ) సభ్యునిగా, లాంగ్వేజ్ ఎక్స్ పర్ట్ గా చిత్ర పరిశ్రమకు సేవలు అందిస్తున్నారు. డిసెంబర్ నుండి ఈయన ఆరోగ్యం విషమించింది. 50 రోజుల నుండి చికిత్స తీసుకుంటున్నప్పటికీ లాభం లేకపోయింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus