యుద్ధ భూమి

“మనమంతా, జనతా గ్యారేజ్” చిత్రాల ద్వారా తెలుగులోనూ మంచి గుర్తింపు, మార్కెట్ సంపాదించుకొన్న మలయాళ నటుడు మోహన్ లాల్ నటించిన మలయాళ చిత్రం “1971 బియోండ్ బోర్డర్స్”. అల్లు శిరీష్ కీలకపాత్ర పోషించిన ఈ చిత్రం మలయాళంలో యావరేజ్ గా నిలవగా తెలుగులో “యుద్ధ భూమి”గా డబ్బింగ్ రూపంలో విడుదల చేస్తున్నారు. బోర్డర్ వార్ నేపధ్యంలో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకొందో చూద్దాం..!!

కథ:
1971 ప్రాంతంలో ఇండియా-పాకిస్తాన్ బోర్డర్ లో మేజర్ గా విధులు నిర్వహిస్తున్న కల్నల్ సహదేవన్ (మోహన్ లాల్) పరాయిదేశపు సైనికులను కూడా స్నేహపూర్వకంగా చూసే మహోన్నతమైన వ్యక్తిత్వం కలిగిన మనిషి. బోర్డర్ లో వార్ జరుగుతున్న సమయంలో ఇండియన్ ఆర్మీకి సహాయంగా ఉండడం కోసం ట్యాంకర్ పైలట్ గా వస్తాడు చిన్మయ్ (అల్లు శిరీష్). నిజానికి ఇరు వర్గాల సాయినికులకి కూడా ఒకరితో ఒకరికి యుద్ధం చేయాలన్న ఆలోచన ఉండదు. కానీ.. దుర్మార్గపు ఆలోచన ఉన్న పాకిస్తాన్ మేజర్ ఒకడు అనవసర యుద్ధానికి తెర లేపుతాడు. ఆ యుద్ధంలో ఇండియన్ సోల్జర్ చిన్మయ్ తోపాటు.. పాకిస్తాన్ మేజర్ కూడా మరణిస్తారు. కానీ.. ఆ బోర్డర్ లో జరిగిన యుద్ధంలో సహదేవ్ తీసుకొన్న ఓ కీలకనిర్ణయం కారణంగా యుద్ధ వాతావరణం మొత్తం ఒక్కసారిగా మారిపోతుంది.సహదేవ్ తీసుకొన్న ఆ కీలక నిర్ణయం ఏమిటి? భారత్-పాకిస్తాన్ బోర్డర్ యుద్ధం ఎలా ముగిసింది? అనే ఆసక్తికరమైన విషయానికి చిత్రరూపమే “యుద్ధ భూమి”.

నటీనటుల పనితీరు:
మోహన్ లాల్ నటన గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏముంది. రెండు విభిన్న పాత్రల్లో అద్భుతంగా నటించాడు. ముఖ్యంగా ఆల్రెడీ ఆర్మీ మేజర్ గా నాలుగైదు సినిమాల్లో నటించిన అనుభవం ఉండడంతో ఈ చిత్రంలో మరింత పరిణితితో నటించాడు మోహన్ లాల్.
అల్లు శిరీష్ పాత్ర చాలా చిన్నది. ఉన్న కాసేపు కాస్త అలరించడానికి ప్రయత్నించాడు కానీ పెద్దగా ఫలితం లేదనే చెప్పాలి. ఒక ఆర్మీ సోల్జర్ మెయింటైన్ చేయాల్సిన బాడీ కానీ బాడీ లాంగ్వేజ్ కానీ స్క్రీన్ పై చూపించలేకపోయాడు.
శ్రుతి దంగే కనిపించిన ఒక్క పాటలోనూ అందంగా ఆకట్టుకొంది. ఇక మిగతా వారంతా మలయాళ ఆర్టిస్టులే కాబట్టి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు.

సాంకేతికవర్గం పనితీరు:
దర్శకుడు మేజర్ రవి ఆర్మీలో రెండు దశాబ్ధాలు పని చేసిన ఎక్స్ పీరియన్స్ ఉండడంతో యుద్ధ వాతావరణం, ట్యాంకర్స్, గన్స్ & యూనిఫార్మ్స్ విషయంలో చాలా కేర్ తీసుకొన్నారు. అయితే.. ఆర్ట్ వర్క్ మీద పెట్టినంత కాన్సన్ట్రేషన్ కథనం మీద పెట్టలేదు. దాంతో సినిమా మొత్తం చాలా సీరియస్ గా సాగుతుంది. ఎంటర్ టైన్మెంట్ అంటే ఏదో కామెడీ ఉండాలని రూల్ లేదు కానీ.. కనీసం టైట్ స్క్రీన్ ప్లే లేదా ఎంగేజింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుడ్ని కుర్చీలో కదలకుండా, ఫోన్ చూసుకోకుండా కూర్చోబెట్టాలి. అలాంటిది ఉన్న రెండు గంటల్లోనే బోర్ కొట్టించారు. చాలా సన్నివేశాలు “ఫ్యూరీ రోడ్, సేవింగ్ ప్రైవేట్ రయాన్” చిత్రాలను గుర్తు చేస్తాయి.

సంగీతం బాగున్నప్పటికీ.. తెలుగు సాహిత్యానికి సరిగా సింక్ అవ్వకపోవడంతో సరిగా అర్ధం కాలేదు. బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది.
సుజీత్ వాసుదేవన్ సినిమాటోగ్రాఫర్ ను మాత్రం మెచ్చుకొని తీరాలి. వార్ మూవీ అనే ఫీల్ ను టింట్ కలరింగ్ & కెమెరా యాంగిల్స్ తో ప్రేక్షకులకు కలిగించాడు. ముఖ్యంగా.. ట్యాంకర్స్ ఫైట్ ను చిత్రీకరించిన విధానం బాగుంది. సినిమాకి ఒన్నాఫ్ ది హైలైట్ సీన్ అదే.

విశ్లేషణ:
ముందుగా డబ్బింగ్ సినిమా, అందులోనూ దేశభక్తి చిత్రం కావడంతో మాస్ ఆడియన్స్ ఈ సినిమా చూడ్డానికి పెద్దగా ఆసక్తి చూపరు. ఇక సినిమా అటు ఎంటర్ టైనింగ్ గా, ఇటు ఎంగేజింగ్ గా లేకపోవడంతో సాధారణ ప్రేక్షకులు కూడా చిత్రాన్ని ఎంజాయ్ చేయలేరు. ఆ విధంగా “యుద్ధ భూమి” చాలా తక్కువ మందిని మాత్రమే అలరించే చిత్రంగా మిగిలిపోతుంది.

రేటింగ్: 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus