118

కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా కెమెరామెన్ కె.వి.గుహన్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన సస్పెన్స్ థ్రిల్లర్ “118”. “అర్జున్ రెడ్డి’ ఫేమ్ షాలిని పాండే కథానాయికగా నటించిన ఈ చిత్రంలో నివేదా థామస్ కీలకపాత్ర పోషించింది. ట్రైలర్, పాటలు ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తి రేపాయి. మరి సినిమా అదే తరహాలో అలరిస్తుందో చూడాలి..!!

కథ: ఓ ప్రముఖ న్యూస్ ఛానల్లో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ గా వర్క్ చేస్తుంటాడు గౌతమ్ (కళ్యాణ్ రామ్). ఎలాంటి ఇష్యూ అయినా ధైర్యంగా జనాలకి తెలియజేయడం గౌతమ్ స్పెషాలిటీ. అలాంటి గౌతమ్ ఒకసారి ట్రెక్కింగ్ కి వెళ్లినప్పుడు అక్కడ ప్యారడైజ్ రిసార్ట్ లో 118 రూమ్ లో స్టే చేస్తాడు. ఆ రోజు రాత్రి సరిగ్గా 1.18 గంటలకి ఒకమ్మాయిని ఇద్దరు దుండగులు కొడుతున్నట్లు, వారి నుంచి తప్పించుకోవడం కోసం ఆమె ప్రయత్నిస్తునట్లు, ఒక కారును చెరువులోకి తోసేస్తున్నట్లు కలగంటాడు. మొదటిసారి అది సాధారణ కల అని లైట్ తీసుకున్నా.. అదే కల మళ్ళీ మళ్ళీ వస్తుండడంతో అసలు ఆ అమ్మాయి ఎవరు? నిజంగానే ఉందా? అనే సందేహంతో ఇన్విస్టిగేషన్ మొదలెట్టిన గౌతమ్ కి నమ్మలేని నిజాలు తెలుస్తాయి.ఇంతకీ ఆ కలలో కనిపించిన అమ్మాయి ఎవరు? గౌతమ్ కలలోకే ఎందుకు వస్తుంది? వంటి ప్రశ్నలకు సమాధానాల రూపమే “118” చిత్రం.

నటీనటుల పనితీరు: కళ్యాణ్ రామ్ తన పాత్రకి పూర్తిస్థాయిలో న్యాయం చేశాడు. ఏదో తెలుసుకోవాలి అనే జిజ్ణాస అతడి పాత్రలో మాత్రమే కాకుండా కళ్ళల్లోనూ కనిపిస్తుంది. ఈ సినిమాలో కొత్త లుక్ & బాడీ లాంగ్వేజ్ తో ఆకట్టుకున్నాడు కళ్యాణ్ రామ్. కెరీర్ బెస్ట్ అని చెప్పలేం కానీ.. ఒన్నాఫ్ ది బెస్ట్ అని మాత్రం అనొచ్చు.షాలిని పాండే రోల్ చిన్నదే అయినా.. ఉన్నంతలో క్యూట్ గా కనిపించి అలరించింది.సెకండాఫ్ లో ఎంట్రీ ఇచ్చినా.. ఉన్న 20 నిమిషాల్లోనే ప్రేక్షకులందర్నీ తనవైపుకు తిప్పేసుకుంది నివేదా థామస్. ఆమె కళ్ళు, నుదురు కూడా ఎన్నో భావాలను పలికించాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో నివేదా నటన సినిమాకి హైలైట్ గా నిలుస్తుంది. ఆమె స్క్రీన్ ప్రెజన్స్ మరియు సొంతంగా తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకోవడం అనేది ప్రశంసనీయం.
ప్రభాస్ శ్రీను, రాజీవ్ కనకాల, శ్రవణ్ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: శేఖర్ చంద్ర సమకూర్చిన బాణీలు బాగున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా సినిమాలోని కీలక సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసింది. కాకపోతే.. ఆ నేపధ్య సంగీతం హాలీవుడ్ సినిమాలను జ్ణప్తికి తీసుకురావడం గమనార్హం.నిర్మాణ విలువలు పర్వాలేదు అనిపించాయి.. కాకపోతే సీజీ వర్క్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడాల్సింది. చాలా సన్నివేశాల్లో బ్లూ మ్యాట్ లో షూట్ చేశారని తెలిసిపోతుంటుంది.

ఇక చిత్ర దర్శకుడు మరియు ఛాయాగ్రాహకుడు కె.వి.గుహన్ గురించి మాట్లాడుకోవాలి. తొలిభాగాన్ని చాలా ఆసక్తికరంగా రాసుకున్నాడు గుహన్, అలాగే స్క్రీన్ పై ప్రెజంట్ చేశాడు కూడా. కాకపోతే.. చిక్కుముడులు వేయడం సులభం.. ఆ ముడులను విప్పడమే కష్టం అన్నట్లుగా.. సెకండాఫ్ లో ఒక్కొక్క ట్విస్ట్ కి లాజికల్ గా సమాధానాలు చెప్పడంలో విఫలమయ్యాడు. అలాగే.. క్లైమాక్స్ కోసం రాసుకున్న మెడికల్ ట్రీట్ మెంట్ ఎపిసోడ్ లో లాజిక్ అనేది ఎంత వెతికినా కనిపించదు. ఆ కారణంగా అప్పటివరకూ కథను బాగానే లాక్కొచ్చిన గుహన్ క్లైమాక్స్ మాత్రం చేతులెత్తేశాడు అనిపిస్తుంది.

విశ్లేషణ:ఈ తరహా థ్రిల్లర్ సినిమాకు ఎండింగ్ & కంక్లూజన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రెండు ముఖ్యమైన విషయాలను దర్శకుడు పెద్దగా పట్టించుకోలేదు. అందువల్ల కళ్యాణ్ రామ్ కెరీర్ లో మరో సూపర్ హిట్ గా నిలిచే అవకాశం ఉన్న సినిమా కాస్తా.. ఎబౌ యావరేజ్ సినిమాగా మిగిలిపోయింది.

రేటింగ్: 2/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus