“24” మూవీ రివ్యూ

“మనం” లాంటి దృశ్యకావ్యం అనంతరం దర్శకుడు విక్రమ్ కుమార్ తెరకెక్కించిన చిత్రం “24”. విక్రమ్ కుమార్ విజన్ కు సూర్య లాంటి ప్రతిభ, తపన కలిగిన నటుడు తోడయ్యాడు. దాంతో.. టీజర్ విడుదలైనప్పట్నుంచి “24” సినిమాపై భారీ అంచనాలు నమోదయ్యాయి. ఈ ద్వాయానికి సమంత, నిత్యామీనన్ లాంటి క్రేజీ హీరోయిన్లు తొడవ్వడంతో.. సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా? అని ప్రేక్షకులందరూ ఎదురుచూడడం మొదలుపెట్టారు. మరి ఇన్నాళ్లుగా ప్రేక్షకులను ఉరిస్తున్న “24” సినిమా వారిని ఏమేరకు అలరించింది? సూర్య త్రిపాత్రాభినయం కోసం పడిన కష్టానికి ప్రతిఫలం లభించిందా? లేదా? అనేది చూడాలి..!!

కథ: శివకుమార్ (సూర్య) ఓ సైంటిస్ట్. కాలాన్ని అదుపుచేయగల ఓ “వాచ్”ను తయారు చేస్తాడు. ఆ వాచ్ ను దక్కించుకొని మరణాన్ని జయించాలనుకొంటాడు శివకుమార్ కు కవల తమ్ముడైన ఆత్రేయ (సూర్య). దుష్టుడైన తన తమ్ముడు నుంచి ఆ “వాచ్” మరియు తన కుమారుడ్ని కాపాడి.. ట్రైన్ లో వెళుతున్న ఒక యువతి (శరణ్య)కు అప్పజెబుతాడు. ఆ తరువాత తమ్ముడు ఆత్రేయ చేతిలో హతమవుతాడు. ట్రైన్ లో యువతి శివకుమార్ కొడుకుని తన సొంత బిడ్డలా పెంచుతుంది. 27 ఏళ్ళు వచ్చాక.. తన తండ్రి అపూరూప సృష్టి అయిన “వాచ్”ను వినియోగించడం మొదలుపెడతాడు మణి (సూర్య). ట్రైన్ నుంచి దూకడం కారణంగా కోమాలోకి వెళ్ళిన ఆత్రేయ ఉన్నట్టుండి మేల్కోంటాడు. లేచినప్పట్నుంచి.. తన తమ్ముడు తయారు చేసిన “వాచ్” కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. మరి ఆత్రేయ “వాచ్”ను సాధించాడా?
మణి తన తల్లిదండ్రులను తిరిగి పొందగలిగాడా? శివకుమార్, ఆత్రేయ, మణిల జీవితంలో “వాచ్” ఎటువంటి కీలకపాత్ర పోషించింది? అనేది సినిమా చూసి తెలుసుకోవాలి..!!

నటీనటుల పనితీరు: శివకుమార్, మణిల పాత్రల్లో సూర్య నటన బాలీవుడ్ సినిమా “క్రిష్”లోని హృతిక్ పాత్రను తలపిస్తుంది. కానీ.. నెగిటివ్ షేడ్ ఉన్న “ఆత్రేయ”గా మాత్రం సూర్య అద్భుతమైన నటన కనబరిచాడు. ముఖ్యంగా.. వీల్ చైర్ లో కూర్చోనే విధానం, పలికించిన హావభావాలు ఆడియన్స్ ను థ్రిల్ కు గురిచేస్తాయి. సత్యభామ పాత్రలో సమంత, ప్రియ పాత్రలో నిత్యామీనన్ లు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు. అజయ్ ఈ సినిమాలో కీలకపాత్రలో చక్కని నటన కనబరిచాడు. తల్లి పాత్రలో నటి శరణ్య ఎప్పట్లాగే ఒదిగిపోయింది.

సాంకేతికవర్గం పనితీరు: ఎ.ఆర్.రెహమాన్ స్వరపరిచిన బాణీల్లో “ప్రేమ పరిచయం, మనసుకే” పాటలు వినసోంపుగా ఉండగా.. “కాలం నా ప్రేయసి” ట్రెండీగా ఉంది. “ప్రేమ పరిచయం” పాటను పోలాండ్ లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించిన తీరు అద్భుతం. “మనసుకే..” పాట మాత్రం చూడడానికంటే.. వినడానికే బాగుంది. తిరు కెమెరా పనితనం సినిమాకి ప్రత్యేక ఆకర్షణ. ప్రత్యేకించి కాలం ఆగిపోయినట్లుగా చూపించే సమయంలో వినియోగించిన “బుల్లెట్ టైమ్ షాట్స్” ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తాయి. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ వర్క్ బాగుంది. నిడివి ఎక్కువయ్యిందని అనిపించినప్పటికీ.. సినిమాలో ఆడియన్ లీనమవ్వడానికి.. కథలో మూమెంట్ ఉండడానికి ఆ మాత్రం నిడివి అవసరం అనిపించక మానదు.

కథ-దర్శకత్వం: “13బి, ఇష్క్, మనం” ఇలా జోనర్ తో సంబంధం లేకుండా డిఫరెంట్ మూవీస్ ను ఆడియన్స్ కు అందించిన విక్రమ్ కుమార్ లాంటి దర్శకుడి నుంచి ప్రేక్షకులు “కొత్తదనం” కోరుకోవడమన్నది సహజం. విక్రమ్ కుమార్ కూడా అందుకు తగ్గట్లే “టైమ్ ట్రావెల్” అనే కాన్సెప్ట్ కు “బ్రదర్స్” రిలేషన్ మరియు దానికి రివెంజ్ డ్రామాను యాడ్ చేసి “24” కథను చాలా చక్కగా అల్లుకొన్నాడు. ఈ తరహా సినిమాలకు అత్యంత కీలకమైన “లాజిక్”ను కూడా ఎక్కడా వదిలిపెట్టకుండా.. చాలా పకడ్బందీగా కథను, ఆ కథను నడిపే కథనాన్ని సిద్ధం చేసుకొన్నాడు. అన్నీ సమపాళ్లలో ఉన్నప్పటికీ.. సినిమాలో “ల్యాగ్”లను మాత్రం కవర్ చేయలేకపోయాడు. సూర్య “వాచ్”ను టెస్ట్ చేసే సీన్స్ మరీ ఎక్కువయిపోయాయి. ఆడియన్స్ కు వాచ్ యొక్క ప్రాముఖ్యతను తెలియజెప్పడం కోసమే విక్రమ్ కుమార్ సదరు రిస్క్ తీసుకొన్నప్పటికీ.. రిపీటెడ్ సీన్స్ ఆడియన్స్ కు చిరాకు పుట్టిస్తాయి. రచయితగా సూపర్ సక్సెస్ అయిన విక్రమ్ కుమార్.. దర్శకుడిగా మాత్రం తడబడ్డాడు. కథ-స్క్రీన్ ప్లేలో ఎక్కడా లోపం లేనప్పటికీ.. సినిమాలో ఎంటర్ టైన్మెంట్ మిస్ అయ్యింది. ఆ కారణంగా “24” ఒక డిఫరెంట్ సినిమాగా మాత్రమే మిగిలిపోయింది.

విశ్లేషణ: ప్రేక్షకుడు చాలా తెలివైనవాడు. తెలివైన ప్రేక్షకుడికి కావాల్సింది ఒక సాధారణ సినిమా. కథలో ఏం జరగబోతుందో ముందే ఊహించేస్తాడు. తాను అనుకొన్నదే జరుగుతున్నందుకు సంతోషిస్తాడు. ఎంత డిఫరెంట్ సినిమా అయినా.. చివరికి గెలిచేది హీరోయే అన్న విషయం తెలిసిన ప్రేక్షకుడు, అసలు ఎలా గెలుస్తాడు? అన్న ఒకే ఒక్క అంశం కోసం థియేటర్ లో రెండున్నర గంటలు కూర్చుంటాడు. 150 రూపాయలు పెట్టి టికెట్టు కొనుక్కొన్న ప్రేక్షకుడి “ఈగో”ను సాటిస్ఫై చేయగలిగిన దర్శకుడినే విజయం వరిస్తుంది. అలా కాదని ఆడియన్ “ఈగో” గురించి పట్టించుకోకుండా.. డైరెక్టర్ తన క్రియేటివ్ “ఈగో”ను సాటిస్ఫై చేసుకోవాలని ప్రయత్నించినప్పుడు దుష్పరిణామాలు ఎదురౌతాయి. “24” సినిమా విషయంలో దొర్లిన తప్పు అదే. సినిమాలో ఈ ఒక్క సన్నివేశంలో “లాజిక్”కు మిస్సవ్వని దర్శకుడు.. ఆడియన్ “ఈగో”ను సాటిస్ఫై చేయలేకపోయాడు. దాంతో.. థియేటర్ నుంచి బయటకు వచ్చే ప్రేక్షకుడి మొఖంలో సాటిస్ ఫేక్షన్ ఉండదు.

ఫైనల్ గా చెప్పాలంటే.. “24” మేధావులకు మాత్రమే అర్ధమయ్యే సినిమా అని చెప్పలేం కానీ.. కామన్ ఆడియన్ మాత్రం కనెక్ట్ కాలేడు.

Rating: 3.25/5

Click here for English Review 

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus