సినిమా టీజర్, ట్రైలర్ చూసి కథను చెప్పేసే జనాలున్నారు మన దగ్గర. అందుకే మన దర్శకులు ఇటీవల కాలంలో ‘ప్రచారం చూసి కథలు చెప్పేసేలా’ ప్రచారం చేయడం మానేశారు. ప్రమోషనల్ వీడియోలు చూసి ఇదే సినిమా అంటూ వెళ్తుంటే అక్కడికి వెళ్లాక వేరే కథ కనిపిస్తోంది. అయితే హఠాత్ మార్పు సినిమాకు కొన్నిసార్లు పనికొస్తే కొన్నిసార్లు ఇబ్బంది పెడుతోంది. ఈ విషయం పక్కన పెడిత మరో సినిమా ఇలానే వస్తోంది. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న ‘భజే వాయువేగం’ (Bhaje Vaayu Vegam) గురించే ఇదంతా.
కార్తికేయ (Kartikeya) , ఐశ్వర్య మేనన్ (Iswarya Menon) జంటగా నటించిన చిత్రమే ‘భజే వాయు వేగం’. యు.వి కాన్సెప్ట్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 31న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు ప్రశాంత్ రెడ్డి ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ఆసక్తిర విషయాలు చెప్పుకొచ్చారు. ప్రేక్షకులు రీల్స్ ట్రెండ్‌లోకి వచ్చారు. ఒక్క క్షణం బోర్ కొట్టినా రీల్ మార్చేస్తారు. అందుకే సినిమా విషయంలోనూ గ్యాప్ ఇవ్వకుండా ఆద్యంతం ఇంట్రెస్టింగ్‌గా ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పారాయన.
‘భజే వాయువేగం’ సినిమాలో హీరో ఓ లక్ష్యంతో ఊరి నుండి సిటీకి వస్తాడు. దీని కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో ఇతర సమస్యలు చుట్టుముడతాయి. వాటిని అధిగమించి తన లక్ష్యాన్ని ఎలా నెరవేర్చుకున్నాడన్నది సినిమా కథ అని చెప్పారు. అలాగే ఈ సినిమా ట్రైలర్‌లో సినిమాలోని చూపించిన పాయింట్ల కంటే కొత్తవి ఇంకొన్ని ఉన్నాయి అన, వాటిని దాచాం అని అంటున్నారు దర్శకుడు.
ట్రైలర్‌లో ‘మీ నాన్న కాదు.. మా నాన్న’ అని కార్తికేయతో రాహుల్ చెప్పడం చూసి కథ ఇదేనా అని అంటున్నారని, అయితే థియేటర్లలో చూసే కథకు చాలా వేరియేషన్స్ ఉంటాయి అని చెప్పారు ప్రశాంత్. దీంతో సినిమాలో ఇంకేదో చెప్పబోతున్నారు అని తెలుస్తోంది. మరి ఆ కొత్త విషయాలు ఏంటి? సినిమా ఎలా ఉండబోతోంది? కార్తికేయ మోస్ట్ అవైటింగ్ విజయం దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది.