“బాబూ వినరా.. అన్నా తమ్ములా కథ ఒకటి” అంటూ ఎన్నో ఆశలతో పెంచుకున్న అనుబంధం ముక్కలైతే కంటనీరు ఒలికించే ఇంటిపెద్దగా, “వివాహ భోజనంబు, వింతైన వంటకంబు” అంటూ ఘటోత్కచుడిగా, “డోంగ్రే, గూట్లే.. మాట తప్పావ్, పచ్చి నెత్తురు తాగుతా” అంటూ కర్కశమైన రౌడీగా… నరకాసురుడు, కంసుడు, రావణుడు, కీచకుడు, హిరణ్యకశిపుడు… ఇలా అనేక రకాలుగా సమస్త దక్షిణ భారత ప్రేక్షకుల ముందు ఒక నటమాంత్రికుడు “ప్రతి నాయకుడి”గా ప్రత్యక్షమవుతాడు. ఆ మాంత్రికుడే ఎస్వీ. రంగారావు.
భయానకం, వీరం, రౌద్రం, కరుణం, శృంగారం, హాస్యం, శాంతం, బీభత్సం, అద్భుతం… అనే నవరసాలన్నింటినీ తన పాత్రల స్వభావంలో సునాయాసంగా ఒలికించి, అందరి మన్ననలు పొందిన మహానటుడు ఎస్వీ రంగారావు. ఏ పాత్ర అయినా దాంట్లో పరిపూర్ణ నటుడిని చూసిన అనుభూతిని కలిగించిన ఈ నటసార్వభౌముడి జన్మదినం.. చరిత్రలో జూలై 3వ తేదీకి ఒక ప్రత్యేకతను తీసుకొచ్చింది.
మూడు దశాబ్దాలపాటు మూడొందలకు పైగా చిత్రాలలో నటించి ఆయా పాత్రలలో మమేకమై జీవించిన సామార్ల వెంకట రంగారావు… కృష్ణ జిల్లా నూజివీడులో కోటేశ్వరనాయుడు, లక్ష్మీ నరసాయమ్మ దంపతులకు 1918 జులై 3న జన్మించారు. తండ్రి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ కావడం వల్ల అనేక ప్రాంతాలకు వెళ్ళాల్సి వచ్చేది. దీంతో రంగారావు మద్రాసులో ఉండే నాన్నమ్మ వద్దనే పెరిగారు.
ప్రాథమిక విద్యాభ్యాసం ఇక్కడే పూర్తి చేసిన రంగారావు తొలిసారిగా మద్రాసు హిందూ హైస్కూల్‌లో తన పదిహేనో ఏట ముఖానికి రంగేసుకున్నారు. ఆ తరువాత నటనమీద ఉండే ఇంట్రెస్టుతో ఎక్కడ ఏ నాటక ప్రదర్శన జరిగినా అక్కడ వాలిపోయేవారు. నాన్నమ్మ ఏలూరుకు మకాం మార్చటంతో ఆమెతో పాటు వెళ్ళిన ఎస్వీఆర్ విశాఖలో ఇంటర్, కాకినాడలలో బీఎస్సీ పూర్తి చేశారు. ఆ తరువాత ఫైర్ ఆఫీసర్‌గా బందరు, విజయనగరం తదితర ప్రాంతాల్లో పనిచేశారు.
ఉద్యోగం చేస్తున్నా ఎస్వీఆర్‌కి నటనలో మాత్రం ఆసక్తి తగ్గలేదు. అడపాదడపా నాటకాలు వేస్తూనే వచ్చారు. ఆ తరం నటీనటులు అధికులతో ఎస్.వి.ఆర్.కి కళాశాల స్థాయిలోనే సంబంధాలు ఏర్పర్చుకున్నారు కూడా..! ఈ క్రమంలో ఆయన బంధువొకరు తీస్తున్న “వరూధిని” చిత్రంలో నటించారు. ఆయన ఇందులో బాగానే నటించినా, చిత్రం విజయం సాధించకపోవటంతో అవకాశాలన్నీ వచ్చినట్లే వచ్చి వెళ్ళిపోయాయి. ఈలోపు మేనమామ కుమార్తె లీలావతితో ఆయనకు వివాహం అయ్యింది.
ఆ తరువాత “మనదేశం, తిరుగుబాటు” లాంటి చిత్రాలలో చిన్నా చితక వేషాలు వేసినా… విజయా సంస్థ తొలి చిత్రం “షావుకారు”లో సున్నపు రంగడు పాత్ర ఆయన సినీ జీవితాన్ని మలుపుతిప్పింది. వెంటనే “పాతాళ భైరవి”లో మహా మాంత్రికుడి పాత్ర వెతుక్కుంటూ వచ్చింది. ఆ పాత్ర అప్పుడే కాదు ఎప్పటికీ నిత్య ‘రాక్షసమే’. అదే ఎస్.వి.ఆర్.ని ఒక గాంభీర్యం, ఒక నిండుదనం, ఒక విలక్షణ పోషణ, ఒక అసమాన నటనా కౌశలం ఉన్న నటుడిగా పరిచయం చేసింది.