కధ అనేది సినిమాకు పెద్ద పెట్టుబడి అని నమ్మే నాణ్యమైన సంస్థ, కధలో బలం ఉంటే అద్భుతాలు సృష్టించవచ్చు అని నమ్మిన ధైర్యమైన సంస్థ, కధను నిర్ణయించే సమయంలో సగటు సామాన్య ప్రేక్షకుడిలా ఆలోచించే తత్వం, నమ్మిన కధను తెరకెక్కించే సమయంలో ఎక్కడా రాజీ పడని రాజసం, వెరసి గీతా ఆర్ట్స్ రూపంలో తెలుగు చలన చిత్ర పరిశ్రమకు అద్భుతాలను సృష్టించే అవకాశం కల్పించాయి. ఎన్నో, ఎన్నెన్నో విజయాలు, ఎన్నో ప్రయోగాత్మక చిత్రాలు, మరెన్నో సాహసాలు, టాలీవుడ్ లో తొలిసారి దాదాపుగా 40కోట్లకు పైగా పెట్టుబడిని పెట్టి సినిమాను నిర్మించిన ఘనత ఒక్క గీతా ఆర్ట్స్ కే దక్కుతుంది అంటే అతిశయోక్తి కాదు. ఒకరు కాదు, ఇద్దరు, ఎందరో టాప్ హీరోస్ ను టాలీవుడ్ కు పరిచయం చేసిన వినోదాత్మక హరివిల్లు గీత ఆర్ట్స్. తండ్రి పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారు నేర్పిన క్రమశిక్షణ అనే పదమే ఆయుధంగా, ఎల్లప్పుడూ తండ్రి ఆశీసులను అందుకుంటూ టాలీవుడ్ ప్రౌడ్ ప్రొడ్యూసర్ గా, ట్రెండ్ ని ముందే తెలుసుకుంటూ సరికొత్త ట్రెండ్ సెట్టర్స్ కు ఊపిరి పోశారు ప్రముఖ నిర్మాత, గీత ఆర్ట్స్ అధినేత అల్లు ఆరవింద్ గారు. ఒక పక్క సినిమాలు నిర్మిస్తూనే మరో పక్క ఎందరో యువ నిర్మాతలను టాలీవుడ్ కు ఆహ్వానించి, ఇన్‌స్పైరింగ్ ప్రొడ్యూసర్ గా, ఎంతో మందిని నిర్మాణ రంగంలో, తిరుగులేని నిర్మాతలుగా నిలిపారు. మెగాస్టార్ వెండి తెర వైభవానికి అపూర్వమైన ఆకృతి కల్పించినా…పవన్ కల్యాణ్ అనే యువ హీరోనూ పవర్ స్టార్ గా నిలిపినా, బన్నీ ను స్టైలిష్ స్టార్ గా, యూత్ ఐకాన్ గా తీర్చి దిద్దినా, యువ హీరో చర్రీని మెగా పవర్ స్టార్ గా నిలిపినా ఆ క్రెడిట్ అంతా గీతా ఆర్ట్స్ కే చెందుతుంది. బడా స్టర్స్ అయినటువంటి రజని కాంత్, అనిల్ కపూర్, అమీర్ ఖాన్ ఇలా ఎందరినో చిత్ర పరిశ్రమలో టాప్ హీరోలుగా మలచిన తీరు గీత ఆర్ట్స్ సంస్థ సినీ నిర్మాణ వైభవానికి ప్రతీకగా చెప్పవచ్చు.
‘మెగాస్టార్’తో అత్తకు యముడు అమ్మాయికి మొగుడు నిర్మించిన అదే సంస్థ, కొత్త వారితో సరికొత్త కదనంతో ‘పరదేశి’ అనే సినిమాను సగర్వంగా తెరకెక్కించింది. అంతేకాకుండా గజిని, జల్సా లాంటి బ్లాక్ బస్టర్స్ ని తెలుగు తెరకు అందించింది సైతం ఈ సంస్థనే. ఇక ‘మగధీర’తో టాలీవుడ్ చరిత్రని దశదిశలా వ్యాపింపజేయడమే కాకుండా అప్పటివరకూ ఉన్న రికార్డులను అన్నింటినీ తుడిచి పెట్టేసి, సరికొత్త రికార్డులను టాలీవుడ్ కు పరిచయం చేసింది. ఇలా ఎల్లవేళలా సరికొత్త సినిమాలతో దూసుకుపోతుంది ఈ సంస్థ. మరి అలాంటి సెన్సేషనల్ సినిమాలను తెరకెక్కించిన సంస్థలో గంగోత్రి సినిమాతో టాలీవుడ్ అరంగేట్రం చేసి, ఆర్యతో ‘లవర్ బాయ్’గా, బన్నీ, దేశముదురు లాంటి సినిమాలతో మాస్ హీరోగా, స్టైలిష్ స్టార్ గా మారిన అల్లు అర్జున్, హీరోగా ఒక పక్క, మరో పక్క మాస్ మ్యానియాను తన తలలోకి ఎక్కించుకుని, అభిమానుల అంచనాలకు ఎక్కడా తగ్గకుండా సినిమాలు తెరకెక్కిస్తూ, హీరోల అభిమానులు తమ అభిమాన హీరోలను ఎలా చూడాలి అనుకుంటారో దానికి వంద రెట్లు యాక్షన్ ను జోడించి, కేవలం హిట్స్ మాత్రమే కాకుండా బ్లాక్ బస్టర్స్ ను చిత్ర పరిశ్రమకు అందిస్తూ, ఓటమి ఎరుగని దర్శకుడిగా టాలీవుడ్ చలన చిత్ర రికార్డులకు తన చిత్రాలతో చెక్ పెడుతూ, పవర్ ప్యాక్డ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రెస్ గా మారిన దర్శకుడు ‘బోయపాటి’ శ్రీను దర్శకత్వంలో వస్తున్న ‘సరైనోడు’ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల ప్రభంజనంతో పాటు, కలక్షన్ల సునామీని సృష్టించి టాలీవుడ్ చరిత్రలోనే అటు అల్లు వారి వారసుడికి, ఇటు గీతా ఆర్ట్స్ కి, మరో పక్క డైనమిక్ డైరెక్టర్ బోయపాటికి సరికొత్త ట్రెండ్ ను సృష్టించాలి అని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం.