Maharaja: కొడుకో మహారాజ తీశాడు.. ఇప్పుడు తండ్రి మరో మహారాజ చేస్తాడట!

మొన్నటికి మొన్న కొడుకు ఓ ‘మహారాజ’ సినిమాతో సినిమాల్లోకి అరంగేట్రం చేశాడు. ఇప్పుడు తండ్రి ఆ పేరున్న సినిమాతో తనలోని పర్‌ఫెక్ట్‌ నటుణ్ని తెర మీద చూపించే ప్రయత్నం చేయబోతున్నాడు. పెద్దగా అంచనాలు లేకుండా దక్షిణాదిన విడుదలై వంద కోట్లకు పైగా గ్రాస్ సాధించిన విజయ్‌ సేతుపతి ‘మహారాజా’ సినిమా ఇప్పుడు బాలీవుడ్‌కి వెళ్లడానికి రెడీ అవుతోంది. సోలో హీరోగా విజయ్ సేతుపతికి (Vijay Sethupathi) పెద్ద హిట్టు లేదని ఇన్నాళ్ల సన్నాయి నొక్కులు నొక్కిన వాళ్లకు ‘మహారాజ’తో నోళ్లు మూయించాడు.

ఆ సక్సెస్ ఇప్పుడు బాలీవుడ్ కంట పడింది అంటున్నారు. సీనియర్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ (Aamir Khan) .. ఈ సినిమా హక్కులను సొంతం చేసుకున్నట్టు సమాచారం. అదేదో నిర్మించడానికి కాదు.. తనే ‘మహారాజ’ అవుదాం అనుకుంటున్నాడట. ‘మహారాజ’ సినిమా చూసి ఆమిర్ ఖాన్ తెగ మెచ్చేసుకున్నాడట. వరుస పరాజయాల నుండి సక్సెస్‌ ట్రాక్‌ ఎక్కాలని ఆమిర్‌ చాలా రోజులుగా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ క్రమంలో ‘సితారే జమీన్‌ పర్‌’ అనే సినిమా చేశాడు.

త్వరలో ఆ సినిమా వస్తుంది. ఆ తర్వాతి సినిమా కూడా భారీ విజయం అందుకోవాలని ‘మహారాజ’ ఓకే చేశాడు అని అంటున్నారు. అయితే ఓటీటీలో ఇప్పటికే హిందీ వెర్షన్‌ అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో ఆమిర్‌ మళ్లీ చేస్తాడా? చేస్తే జనాలు చూస్తారా? అనేది ఓ ప్రశ్న. ఒకవేళ చేస్తే విజయ్‌ సేతుపతి రోల్‌లో ఆమిర్‌ ఎలా చేస్తాడు అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇద్దరినీ పోల్చకూడదు, పోల్చలేం కానీ.. రీమేక్ అనేసరికి ఇప్పుడు ఈ పోలిక పక్కాగా వచ్చేస్తోంది.

కాబట్టి పోలిక ఆవశ్యకం. మరి ఆమిర్‌ రీమేక్‌ నిర్ణయం తీసుకుంటాడా? లేక డ్రాప్‌ అవుతాడా అనేది చూడాలి. ఇక ఆమిర్‌ తనయుడు జునైద్‌ ఖాన్‌ ‘మహరాజ్‌’ అనే సినిమాతో ఇటీవల బాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చాడు. ఓటీటీలోకి వచ్చిన ఈ సినిమా మంచి ఇంట్రడక్షన్‌ మూవీ అని అనిపించుకుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus