Acharya Review: ఆచార్య సినిమా రివ్యూ & రేటింగ్!

మెగాస్టార్ చిరంజీవి టైటిల్ పాత్రలో కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “ఆచార్య”. చిరుతో చరణ్ కూడా ఓ కీలక భూమిక పోషించిన ఈ చిత్రం ఎప్పుడో కరోనాకి ముందు షూటింగ్ మొదలెట్టినప్పటికీ.. కరోనా, లాక్ డౌన్ & పాన్ ఇండియన్ రిలీజుల కారణంగా వాయిదా పడుతూ ఎట్టకేలకు నేడు (ఏప్రిల్ 29) విడుదలైంది. మరి కొరటాల తన సక్సెస్ స్ట్రీక్ ను ఈ చిత్రంతో కంటిన్యూ చేశాడో లేదో చూద్దాం..!!

కథ: స్వయంగా అమ్మవారు వెలిసిన పుణ్యస్థలమైన ధర్మస్థలిలో ధర్మం మంట గలిసి అధర్మం పేట్రేగుతుండడంతో.. దాన్ని అడ్డుకోవడానికి ఊళ్ళోకి వస్తాడు ఆచార్య (చిరంజీవి). బసవ (సోనూ సూద్) అండ్ గ్యాంగ్ చేసే అరాచకాలను ఒక్కొక్కటిగా ఎండగడుతూ ఉంటాడు.

అసలు ఆచార్య ఎవరు? ధర్మస్థలిని వెతుక్కుంటూ ఎందుకొస్తాడు? అనేది “ఆచార్య” కథాంశం.

నటీనటుల పనితీరు: నటుడిగా చిరంజీవి కెరీర్లో ఓ మైనస్ “ఆచార్య”. ప్రతి పాత్రలోనూ తనదైన హుందాతనాన్ని నింపే చిరంజీవి సబ్టల్ పెర్ఫార్మెన్స్ పేరుతో ఈ చిత్రంలో చేసిన నటనను అభిమానులు జీర్ణించుకోవడం కష్టం. చిరంజీవిలో బిగ్గెస్ట్ ప్లస్ అయిన కామెడీ టైమింగ్, మాస్ బాడీ లాంగ్వేజ్ గట్రా సినిమాలో ఎక్కడా కనిపించదు. అసలు చూస్తున్నది చిరంజీవినేనా అనే ఆలోచన కూడా కలగకమానదు. కేవలం రెండు పాటల్లో తన డ్యాన్సులతో మాత్రమే చిరంజీవి తన అభిమానులను, ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగాడు.

చరణ్ పాత్ర టేకాఫ్ బాగున్నా.. సాగదీసిన విధానం, ముగించిన తీరు ఆ పాత్రకున్న ప్రత్యేకతను మంటగలిపాయి.

పూజా హెగ్డే సినిమాకి మైనస్ గా మారింది. కొండ ప్రాంతంలోని హీరోయిన్ పాత్రకు మోడ్రన్ డ్రెస్సుల్లో మాత్రమే ఆకట్టుకోగలిగే పూజాను ఎన్నుకోవడమే పెద్ద మైనస్.

వెన్నెల కిషోర్, సత్యదేవ్, జీషు సేన్ గుప్తా, సోనూ సూద్, తనికెళ్లభరణి తదితరులు సినిమాలో ఉన్నారు కానీ ఒక్కరి పాత్రకూ సరైన జస్టిఫికేషన్ ఉండదు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు-రచయిత కొరటాల నుండి వచ్చిన అత్యంత పేలవమైన చిత్రం “ఆచార్య”. “మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భారత్ అనే నేను” లాంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్స్ తీసిన డైరెక్టరేనా “ఆచార్య” తీసింది అనే అనుమానం సినిమా చూస్తున్న ప్రతి పది నిమిషాలకు తొలిచేస్తుంటుంది. కథ, కథనం, మాటలు ఇలా ప్రతి అంశంలోనూ కొరటాల తీవ్ర నిరాశకు గురి చేశాడు. దాదాపు మూడేళ్ళ పాటు టైమున్నప్పటికీ.. కనీస స్థాయి జాగ్రత్తలు లేకుండా సినిమాను ప్రేక్షకులకు అందించడం అనేది ఒక ఫిలిమ్ మేకర్ గా కొరటాలకు మాయని మచ్చ.

తనదైన శైలి మాస్ బీజీయమ్ & మెలోడీస్ తో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసే మణిశర్మ.. “ఆచార్య”కి మరో మైనస్ గా నిలిచాడు. అసలు సన్నివేశంతో సంబంధం లేని నేపధ్య సంగీతం, పస లేని పాటలతో అసలే సాగుతున్న సినిమాని నిద్రపుచ్చాడు.

ఇక రామ్ లక్ష్మణ్ మాస్టర్ల ఫైట్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

తిరు సినిమాటోగ్రఫీ మాత్రమే సినిమాలో చెప్పుకోదగ్గ ఏకైక అంశం, అలాగే ఆర్ట్ వర్క్ కూడా బాగుంది.

విశ్లేషణ: చిరంజీవి నుంచి కానీ ముఖ్యంగా కొరటాల నుంచి అసలు ఊహించని సినిమా “ఆచార్య”. ప్రస్తుత తరం ప్రేక్షకులను మాత్రమే కాదు చిరంజీవి వీరాభిమానులను సైతం ఆకట్టుకోలేని చిత్రం “ఆచార్య”.

రేటింగ్: 2/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus