భారతీయ సినీ పరిశ్రమని ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సమస్య క్యాస్టింగ్ కౌచ్. రూమర్లకు, ఆరోపణలకు మాత్రమే పరిమితమైన ఈ సమస్య మహమ్మారిగా మారిపోయి సినిమారంగంపై చెడు అభిప్రాయాన్ని కలిగిస్తోంది. ఈ విషయంపై కొంతమంది పాజిటివ్ గా స్పందిస్తుంటే.. మరికొంతమంది నెగటివ్ గా మాట్లాడుతున్నారు. తాజాగా ఈ విషయంపై “విశ్వరూపం”, “ఉత్తమ విలన్”, “PSV గరుడ వేగ” లాంటి సినిమాల్లో నటించిన హీరోయిన్ పూజా కుమార్ మాట్లాడింది. తనకు ఇంతవరకూ క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు ఎదురుకాలేదని స్పష్టం చేసింది. అయినా ఈ విషయం పై బహిరంగంగా మాట్లాడడం చాలా ముఖ్యమని చెప్పింది.
క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడడమే కాకుండా భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బంది వేరే ఎవరూ పడకుండా ఉండేలా చేయాలని తెలిపింది. అంతేకాదు నటిగా ఎదగాలనే వారికీ సలహా కూడా ఇచ్చింది. ఎవరైనా ఛాన్స్ కోసం, సక్సెస్ కోసం అటువంటి పనులకు ఒప్పుకోవాల్సిన అవసరం లేదని చెప్పింది. కష్టపడితే నటిగా రాణించవచ్చని, లక్ష్యాన్ని చేరుకోవచ్చని ధైర్యాన్ని నూరిపోసింది. ఎవరైతే క్యాస్టింగ్ కౌచ్ వల్ల ఇబ్బందులు ఎదుర్కొన్నారో వాళ్ళు తమకెదురైన ఇబ్బందులను బయటకు చెప్పాలని, దీని వల్ల సొసైటీ కి అసలేం జరుగుతుందో తెలుస్తుందని పూజా వెల్లడించింది. అలాగే పరిశ్రమలోని పెద్దలు ఈ పరిస్థితిని చక్కదిద్దే అవకాశాన్ని ఇచ్చినవారవుతారని వివరించింది.