ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డులకు సంబంధించిన వార్తల జోరు పెరిగింది. వచ్చే ఏడాది మార్చి 14న కార్యక్రమం జరగనుంది. అయితే వచ్చే నెల 7 నుండి ఓటింగ్ తదితర కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి. దీంతో అవార్డుల బరిలో నిలుస్తున్న సినిమాల గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. అలా మన దేశం నుండి ఆస్కార్ పురస్కారాల బరిలో ‘గోంధల్’, ‘అంగ్’ అంతర్జాతీయ చిత్రం విభాగంలో పరిశీలనకు ఎంపికయ్యాయి.
అయితే మరో లఘు చిత్రం ఆస్కార్ పరిశీలనకు అర్హత సాధించింది. అదే కన్నడ – తెలుగు షార్ట్ ఫిల్మ్ ‘పంకజ’. ఈ సినిమా దర్శకురాలు అనూయ స్వామితో పాటు ప్రధాన పాత్రలో నటించిన హర్షిణి బోయళ్ల తెలుగు కుటుంబానికి చెందినవారే. అయితే వారిద్దరూ బెంగళూరులో పుట్టి పెరిగారు. దీంతో ఈ సినిమా గురించి చర్చలు జరుగుతున్నాయి. ఏంటా చిన్న సినిమా కథ అంటూ వెతికేస్తున్నారు నెటిజన్లు.
షార్ట్ ఫిల్మ్ కథ సంగతి చూస్తే.. బెంగళూరులోని ఓ మురికివాడలో నివసించే కుటుంబాల నేపథ్యంలో ‘పంకజ’ను తెరకెక్కించారు. కనిపించకుండా పోయిన తన భర్తను కుమార్తెతో కలసి పంకజ అనే మహిళ వెతికే క్రమంలో ఎదురైన అనుభవాలే కథాంశం. అధికారంలో ఉన్న వ్యక్తులు వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని సామాన్యులను ఎలా హింసిస్తున్నారన్న విషయాన్ని ఈ లఘు చిత్రంలో చర్చించారు.
ఇప్పటికే ఈ షార్ట్ ఫిల్మ్‌ను సన్‌డ్యాన్స్ ఫిలిం ఫెస్టివల్ సహా 40కిపైగా అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ప్రదర్శించారు. రెయిన్ డ్యాన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో విజేతగా నిలిచింది కూడా. దాంతోనే ఆస్కార్ పరిశీలనకు అర్హత సాధించింది. న్యూయార్క్ యూనివర్శిటీలో మీడియా ఆర్ట్స్ కోర్సు చేస్తున్నప్పుడు అనూయ.. రెండో ఏడాది స్టూడెంట్ ప్రాజెక్టుగా ‘పంకజ’ను తెరకెక్కించారు.
ఈ షార్ట్ ఫిల్మ్‌కు హాలీవుడ్ నటులు స్పైక్ లీ, విలియం డఫో, భారత్‌కు చెందిన ఆస్కార్ విజేత గునీత్ మోంగా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్లుగా వ్యవహరించడం గమనార్హం. మరి ‘పంకజ’ ఆస్కార్ బరిలో ముందడుగు వేస్తుందా? లేదా? అనేది తేలడానికి డిసెంబరు 15 వరకు ఆగాల్సిందే. ఆ రోజే అకాడెమీ షార్ట్ లిస్ట్ అనౌన్స్ చేస్తుంది. అందులో ఉంటేనే ముందు దశలకు వెళ్తుంది.