అమ్మ పాత్రల్లో మెప్పిస్తున్న అలనాటి స్టార్ హీరోయిన్లు

ఆకర్షించే అందం.. పాత్రలో ఒదిగిపోయే ప్రతిభ.. హీరో తో పోటీ పడి స్టెప్పులు వేయగల సత్తా.. ఈ క్వాలిటీస్ తో అందాల తారలు హీరోయిన్ గా విజయాలను, అభిమానులను సొంతం చేసుకున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో గ్లామర్ రోల్ పోషించిన నటీమణులు .. యువకులకు నిద్ర లేకుండా చేశారు. ఆనాడు హీరోయిన్స్ గా అలరించినవారే ఈనాడు తల్లి పాత్రలకు ప్రాణం పోస్తున్నారు. తమ అభిమానుల సంఖ్యను పెంచుకుంటున్నారు. సినిమా విజయాలకు దోహద పడుతున్నారు. అలా అమ్మ పాత్రల్లో మెప్పిస్తున్న అలనాటి స్టార్ హీరోయిన్లపై ఫోకస్..

రమ్యకృష్ణ అల్లుడు గారు.. అల్లరి ప్రియుడు, అల్లుడా మజాకా, ఘరానా బుల్లోడు, హలో బ్రదర్… రమ్యకృష్ణ హీరోయిన్ గా నటించిన హిట్ సినిమాల లిస్ట్ పెద్దదే. ఎన్నో సినిమాల్లో డ్యాన్సులతో అదరగొట్టిన రమ్యకృష్ణ ఇప్పుడు అమ్మగా ఆకట్టుకుంటోంది. తాజాగా బాహుబలికి అమ్మ శివగామిగా నట విశ్వరూపం చూపించింది.

మీనా చైల్డ్ ఆర్టిస్ట్ గా చిత్ర సీమలోకి అడుగుపెట్టిన మీనా హీరోయిన్ గా తెలుగు, తమిళం భాషలో అనేక సినిమాలు చేసింది. ఇప్పుడు పెళ్లి చేసుకొని తల్లి అయిన ఈమె.. అమ్మగా వెండితెరపై నటిస్తోంది. దృశ్యం మూవీలో ఇద్దరి పిల్లల తల్లిగా ఆకట్టుకుంది.

నదియా తమిళం, మలయాళంలో అనేక సినిమాలో హీరోయిన్ గా నదియా కనిపించి యువకుల హృదయాలను కొల్లగొట్టింది. తెలుగులో బజారు రౌడీలో హీరోయిన్ గా నటించిన ఈమె ప్రస్తుతం అమ్మగా అత్యధిక మార్కులు కొట్టేస్తోంది. మిర్చి, అత్తారింటికి దారేది, అ .. ఆ మూవీలో ఈమె పాత్ర కీలకం అయింది.

మధుబాల మధుబాల పేరు చెప్పగానే రోజా మూవీ గుర్తుకొస్తుంది. అందులో ఆమె నటన అద్భుతం. హీరోయిన్ గా హిందీ, తమిళం, తెలుగు భాషల్లో అనేక సినిమాలు చేసింది. పెళ్లి అయిన తర్వాత కొంతకాలం సినిమాలకు దూరంగా ఉన్న ఈమె ఇప్పుడు తల్లి పాత్రల్లో మెప్పిస్తోంది. సూర్య వెర్సస్ సూర్య, నాన్నకు ప్రేమతో సినిమాల్లో ఆమె చక్కగా నటించింది.

భానుప్రియ మంచి క్లాసికల్ డ్యాన్సర్ భానుప్రియ. రెండో తరం హీరోలందరితో నటించిన ఈమె ప్రస్తుతం తల్లి పాత్రలకు ఆయుష్షు పోస్తోంది. ఛత్రపతి, దమ్ము సినిమాల్లో భానుప్రియ అమ్మగా సినిమాకి బలం సమకూర్చింది.

రోజా తెలుగు అమ్మాయి రోజా.. చిరంజీవి, బాలకృష్ణ వంటి స్టార్ హీరోల పక్కన నటించి విజయాలు అందుకుంది. ఇప్పుడు శంభో శివ శంభో, వాంటెడ్ తదితర చిత్రాల్లో అమ్మగా నటించింది.

రాశిగోకులంలో సీత వంటి అనేక సినిమాల్లో అందాలతో అలరించిన రాశి.. అమ్మ పాత్రల్లో కనిపించడానికి సై అంటోంది. రీసెంట్ గా వచ్చిన కళ్యాణ్ వైభోగమే మూవీలో హీరోయిన్ కి తల్లిగా కనిపించింది.

సుకన్య 1992 లో ఇండస్ట్రీ హిట్ సాధించిన పెద్దరికం మూవీలో హీరోయిన్ గా నటించిన సుకన్య నాలుగు భాషల్లో హీరోయిన్ గా చేసింది. ఇప్పుడు అమ్మగా ఆకట్టుకుంటోంది. శ్రీమంతుడు మూవీలో మహేష్ బాబుకి తల్లిగా చక్కని నటనను ప్రదర్శించింది.

సుహాసిని 80 – 90 దశకంలో టాప్ హీరోయిన్లలో ఒకరిగా సుహాసిని వెలిగింది. ఆ తర్వాత చాలా కాలం గ్యాప్ తీసుకున్న ఆమె ఇప్పుడు తల్లిగా నటిస్తోంది. లీడర్, వరుడు, బాద్ షా లలో అమ్మగా మెప్పిస్తోంది.

జయసుధ “అమ్మ పాత్రల్లో మెప్పిస్తున్న అలనాటి స్టార్ హీరోయిన్లు” అనే వ్యాసం జయసుధ పేరు ప్రస్తావించకుండా ముగిస్తే .. ఈ వ్యాసానికి అర్ధమే ఉండదు. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి, బొమ్మరిల్లు, కొత్తబంగారులోకం.. ఇటువంటి సినిమా పేరుచెప్పగానే జయసుధ పోషించిన తల్లి క్యారక్టర్ గుర్తుకొస్తుంది. ఆనాడు సీనియర్ హీరోలతో పోటీ పడి నటించిన ఈమె.. ఈనాడు తన అనుభవాన్ని రంగరించి యువహీరోలకు విజయాలను అందిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus