గడిచిన రెండేళ్లలో ఓటీటీలకు ప్రేక్షకాదరణ అంతకంతకూ పెరుగుతోంది. లాక్ డౌన్ సమయంలో థియేటర్లు మూతబడటంతో ప్రేక్షకులు ఓటీటీలలో రిలీజైన సినిమాలు, వెబ్ సిరీస్ ల వైపు ఆకర్షితులవుతున్నారు. సినిమా రిలీజైన కొన్ని వారాలకే ఓటీటీలలో అందుబాటులోకి వస్తుండటంతో హిట్ టాక్ వస్తే తప్ప ప్రేక్షకులు థియేటర్లలో సినిమాలు చూడటం లేదు. నిర్మాతలకు కూడా థియేట్రికల్ హక్కుల కంటే నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారానే ఎక్కువ మొత్తం ఆదాయం వస్తోంది. ప్రముఖ ఓటీటీలలో ఒకటైన ఆహా తాజాగా ప్రేక్షకుల్లో క్రేజ్ ఉన్న సినిమాల హక్కులను కొనుగోలు చేసింది.
లవ్ స్టోరీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, లక్ష్య సినిమా హక్కులు ఆహా ఓటీటీ సొంతం కావడం గమనార్హం. అయితే ఈ సినిమాలు థియేటర్లలో రిలీజైన కొన్ని వారాల తర్వాత మాత్రమే ఆహాలో రిలీజ్ కానున్నాయని తెలుస్తోంది. కొత్త సినిమాల హక్కులను కొనుగోలు చేస్తూ ఆహా ఇతర ఓటీటీలకు గట్టి పోటీని ఇస్తుండటం గమనార్హం. క్రాక్ సినిమా థియేట్రికల్ రిలీజ్ తర్వాత ఆహా ఓటీటీలో ప్రసారం కాగా అక్కడ కూడా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
రాబోయే రోజుల్లో ఆహా ఓటీటీ మరిన్ని సినిమాలతో సందడి చేసే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం. ఆహా ఓటీటీ మంచు లక్ష్మీతో ఒక టాక్ షోను కూడా ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. సినిమాలను కొనుగోలు చేస్తూ వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ టాక్ షోలను ప్లాన్ చేస్తూ ఆహా ఓటీటీ ఇతర ఓటీటీలకు భారీగా పోటీనిస్తోంది.