ఇప్పుడు సౌత్ ఇండియా సినిమాల్లో ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. మన స్టార్ హీరోలకు విలన్లుగా బాలీవుడ్ నటులనే దింపుతున్నారు. ఇప్పటికే ‘యానిమల్’తో బాబీ డియోల్, ‘దేవర’తో సైఫ్ అలీ ఖాన్ ఇక్కడ జెండా పాతేశారు. ఇప్పుడు ఇదే బాటలో మరో బాలీవుడ్ సీనియర్ నటుడు సౌత్ బాక్సాఫీస్ మీద దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారు. ఆయనే అక్షయ్ ఖన్నా. ఒకప్పుడు లవర్ బాయ్ గా అలరించిన ఈయన, ఇప్పుడు క్రూరమైన విలన్ గా సరికొత్త అవతారం ఎత్తారు.
గత పదేళ్లుగా అక్షయ్ ఖన్నా కెరీర్ కాస్త డల్ గా సాగింది. బట్టతల రావడం, హీరోగా అవకాశాలు తగ్గడంతో రేసులో వెనుకబడ్డారు. కానీ 2025లో ఆయన చేసిన రీఎంట్రీ మాత్రం అదిరిపోయింది. తన బలహీనతలే బలమని నిరూపిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా టర్న్ తీసుకున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో వచ్చిన ‘చావా’ సినిమాలో ఔరంగజేబు పాత్రలో ఆయన నటన చూసి జనం భయపడిపోయారు. ఆ క్రూరత్వం చూసి ఆడియన్స్ తిట్టుకున్నారంటే, ఆయన నటన ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అక్కడితో ఆగకుండా ఇయర్ ఎండింగ్ లో ‘ధురంధర్’ సినిమాతో మరో హిట్ కొట్టారు. రణ్ వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమాలో గూండా రెహ్మాన్ గా అక్షయ్ నటన పీక్స్ అనే చెప్పాలి. విలనిజంలోనే చిన్న కామెడీ టచ్ ఇస్తూ, క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర రూ. 300 కోట్ల క్లబ్ లో చేరడంలో అక్షయ్ పాత్ర కీలకం.
వరుసగా రెండు భారీ హిట్స్ పడటంతో అక్షయ్ ఖన్నా కాన్ఫిడెన్స్ పెరిగింది. అందుకే ఇప్పుడు తన ఫోకస్ మొత్తం సౌత్ ఇండస్ట్రీ మీద పెట్టారు. 2026 నాటికి తెలుగు, తమిళ సినిమాల్లో నటించాలని గట్టిగా ప్లాన్ చేసుకుంటున్నారట. ఇప్పటికే మన దర్శకులు కూడా అక్షయ్ కోసం పవర్ ఫుల్ స్క్రిప్ట్స్ రెడీ చేస్తున్నట్లు టాక్. బాబీ డియోల్ లాగే అక్షయ్ ను కూడా సౌత్ లో ఒక రేంజ్ లో చూపించాలని చూస్తున్నారు. టన పరంగా అక్షయ్ ఖన్నాకు తిరుగులేదు. ఎలాంటి పాత్రనైనా అలవోకగా పండించగలరు. అలాంటి నటుడు మన సౌత్ మాస్ సినిమాల్లో విలన్ గా చేస్తే ఆ కిక్కే వేరుగా ఉంటుంది. మరి 2026లో ఏ స్టార్ హీరో సినిమాతో అక్షయ్ సౌత్ ఎంట్రీ ఇస్తారో చూడాలి.