తెలుగు చిత్రసీమలో కామెడీ హీరోలు ఉన్నారు. హీరోలుగా మారిన కమెడియన్లు ఉన్నారు. కామెడీ హీరోల పరిస్థితి ఒకలా ఉన్నా.. హీరోలుగా మారిన హాస్య నటులు ఆ మెట్టుపై నిలబడలేకపోయారు. హీరో పాత్రపై ఉన్న మక్కువను తీర్చుకునే ప్రయత్నంలో ఒకటి రెండు సినిమాలు చేసి తర్వాత బ్యాక్ టు కామెడీ క్యారెక్టర్ అన్న నినాదం అందుకున్న వాళ్లే. ఈ విషయాన్నే నిన్నటికి నిన్న ఓ సీనియర్ కమెడియన్ చెప్పుకొచ్చాడు. హాస్యనటుడిగా మంచి పేరు తెచ్చుకున్న సప్తగిరి ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ సినిమాతో హీరోగా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పాటలు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా నిన్న విడుదలయ్యాయి. ఈ కార్యక్రమానికి అప్పట్లో హీరోగా చేసిన హాస్యనటుడు అలీ, ఇప్పుడు హీరోగా చేస్తున్న మాజీ హాస్య నటుడు సునీల్ కూడా విచ్చేశారు. సప్తగిరికి శుభాకాంక్షలు తెలుపుతూ సునీల్ “తనను మించి హీరోగా రాణించాలని” అన్నాడు.
కానీ అలీ వాస్తవానికి అద్దం పడుతూ “హాస్యనటులు హీరో పాత్ర లక్కీ లాటరీ లాంటిది. కానీ ఎప్పటికైనా హాస్య పాత్రలే శ్రీరామరక్ష అని” యదార్థం చెప్పేశాడు. అయితే ఇది మామూలుగా అన్న మాటేనా లేక సునీల్ కి కౌంటర్ వేశాడా అని చర్చలు మొదలయ్యాయి.ఆ సంగతి తేలా ఉన్నా.. హీరోలుగా మారిన హాస్య నటులలో విజయాల వాటా ఆలీకే ఎక్కువ. యమలీల నుండి హంగామా వరకు తనకు నప్పే పాత్రలను కథలను ఎంపిక చేసుకున్నాడు గనుకనే విజయాలు వరించాయి. హీరోగా విజయం వచ్చిందని తనకు అన్నం పెట్టిన హాస్య పాత్రలను వదులుకోలేదు. అదే తెలుగు ప్రేక్షకులకు మరింత వినోదాన్ని పెంచి వారి ఆశీస్సులు అలీ అందుకునేందుకు కారణమైంది. ఇదిలా ఉంటే హీరోగా సప్తగిరి ఎలాంటి ఫలితం పొందనున్నాడన్నది ఆసక్తికరం.