పుష్ప సినిమాతో భారీ స్థాయిలో క్రేజ్ అందుకున్న తరువాత అల్లు అర్జున్ ప్లాన్స్ ఊహలకు అందడం లేదు. ఇక ఫైనల్ గా టాక్ లో ఉన్న గాసిప్ నిజమైంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన తదుపరి భారీ ప్రాజెక్టును అనౌన్స్ చేశారు. సంక్రాంతి పండుగ సందర్భంగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఒక మెగా ప్రాజెక్టును ప్రకటిస్తూ అభిమానులకు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చారు. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతోంది.
ఈ అనౌన్స్‌మెంట్ కోసం విడుదల చేసిన స్పెషల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో సెన్సేషన్ సృష్టిస్తోంది. అడవిలో ఆధిపత్యం కోసం పరుగులు తీస్తున్న నక్కల సమూహం మధ్యలోకి, గంభీరమైన గర్జనతో ఒక సింహం ఎంట్రీ ఇచ్చినట్లు ఈ గ్లింప్స్‌లో చూపించారు. ‘AA23’ అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమా, లోకేష్ మార్క్ డార్క్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉండబోతోందని అర్థమవుతోంది. అల్లు అర్జున్‌ను మునుపెన్నడూ చూడని విధంగా ఒక పవర్‌ఫుల్ అవతార్‌లో లోకేష్ చూపించబోతున్నట్లు సమాచారం.
షూటింగ్ విషయానికి వస్తే, అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాతే ఈ సినిమా పట్టాలెక్కనుంది. 2026 ఆగస్టులో ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉందని మేకర్స్ స్పష్టం చేశారు. లోకేష్ కూడా తన LCU సినిమా పనుల నుంచి బయటకు వచ్చి, ఈ గ్యాప్ లో బన్నీ కోసం ఒక పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేయనున్నారు. ఈ భారీ చిత్రానికి రాక్‌స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించబోతున్నారు.
ఇక ఈ సినిమా కోసం లోకేష్ కనగరాజ్ తీసుకుంటున్న పారితోషికం ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. రజనీకాంత్ సినిమాకు భారీ రెమ్యూనరేషన్ అందుకున్న ఆయన, ఈ ప్రాజెక్ట్ కోసం సుమారు 75 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇది నిజమైతే, సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకునే దర్శకుల జాబితాలో ఆయన చేరిపోతారు. మాస్ అప్పీల్ ఉన్న బన్నీ, లోకేష్ రానెస్ కలిస్తే బాక్సాఫీస్ దగ్గర రికార్డుల వేట ఖాయమని ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు.