మెగాస్టార్ చిరంజీవి.. ఇంతింతై వటుడింతై అన్నట్లు అసాధారణ నటనతో అశేష తెలుగు ప్రేక్షకులను అలరించి మూడు దశాబ్దాలు తెలుగు చిత్రసీమను ఏకచత్రాధిపత్యంగా ఏలిన మగధీరుడు. అభిమానులను సినిమా చూసే ప్రేక్షకులుగా చిరంజీవి ఎప్పుడూ చూడలేదు. భగవంతుడు ఇచ్చిన కుటుంబ సభ్యులగానే చూశారు. అభిమానులకు ఏదైనా చేయాలనే ఉద్దేశ్యంతో సామాజిక సేవలోనూ ముందడుగు వేసి అందరివాడు అయ్యారు. ఆయనో మహావృక్షం. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, రామ్ చరణ్.. ఇంకా ఇంకా అందరూ మహావృక్షపు కొమ్మలే. విత్తు మంచిదైతే.. మొక్క మంచిది కాకుండా పోతుందా? చిరంజీవి కుటుంబ సభ్యులు కూడా అభిమానుల యోగక్షేమాలకు అత్యంత ప్రాముఖ్యత ఇస్తున్నారు.
మెగా మేనల్లుడు, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తనయుడు అల్లు అర్జున్(బన్ని) నటనలో ఎప్పుడో నిరూపించుకున్నాడు. స్టైలిష్ స్టార్ అనిపించుకున్నాడు. తాజాగా అభిమానుల సంరక్షణలోనూ.. సేవలోనూ ‘సరైనోడు’ అనే విషయం వెలుగులోకి వచ్చింది. ఇన్నాళ్లూ అల్లు అర్జున్ చేసిన గుప్తదానాలు అందరికీ తెలుస్తున్నాయి. మెగా అభిమానులు ఎవరు చనిపోయినా.. ఎవరైనా కష్టాల్లో ఉన్నా.. అల్లు అర్జున్ అభిమానుల ఇంటికి వెళ్తున్నారు. వాళ్లకు సహాయం చేస్తున్నారు.
ఇటీవల హైదరాబాదులో నూర్ అహ్మద్ అనే అబిమానికి అల్లు అర్జున్ లక్ష రూపాయలు సహాయం చేశారు. అతడి పిల్లల చదువుకు అవసరమైన డబ్బులనూ సమకూరుస్తున్నారు. ఈరోజు ‘సరైనోడు’ ఆడియో సెలబ్రేషన్స్ కోసం విశాఖ వెళ్ళిన అల్లు అర్జున్.. ఇటీవల చనిపోయిన చిరు అభిమానుల ఇంటికి వెళ్లడానికి ప్రయత్నించారు. పోలీస్ సెక్యూరిటీ అనుమతించని కారణంగా అభిమానుల కుటుంబ సభ్యులను పిలిపించుకుని సహాయం చేశారు.
వివరాల్లోకి వెళితే.. ఇటీవల అనాకపల్లిలో పైడిరాజు అనే చిరు అభిమాని అకాల మరణం చెందారు. గాజువాకలో అప్పలనాయుడు అనే అభిమాని కూడా మరణించారు. ఇరువురి కుటుంబ సభ్యులకు చెరో లక్ష రూపాయల చొప్పున సహాయం చేశారు. అప్పలనాయుడు గారి ముగ్గురి పిల్లలను దత్తత చేసుకున్నారు. జీవితాంతం వాళ్ల చదువులకు అవసరమయ్యే ఖర్చును భరిస్తానని బన్నీ చెప్పారు. మానవత్వంలోనూ అల్లు అర్జున్ ‘సరైనోడు’ అని అనిపించుకున్నాడు. మెగా అభిమానులకు అందరివాడు అయ్యాడు.