మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘విశ్వంభర'(Vishwambhara) ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఇంకా రిలీజ్ కాలేదు. జూలైలో రిలీజ్ అంటున్నారు. కానీ అధికారికంగా ఇంకా ప్రకటించింది లేదు. ఇది పక్కన పెడితే.. ఈరోజు ‘వదలా’ అనే చిన్న సినిమా గ్లింప్స్ లాంచ్ కార్యక్రమం జరిగింది.
దీనికి కూడా ఛోటా కె నాయుడు సినిమాటోగ్రాఫర్. అందుకే ఆయన కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో సీజీ టీమ్, సినిమాటోగ్రాఫర్..ల పనితనం పెద్ద సినిమాలకి ఎంత ముఖ్యమో తెలుపుతూ.. ‘విశ్వంభర’ గురించి కూడా స్పందించారు.
ఛోటా కె నాయుడు మాట్లాడుతూ…”ఇప్పుడు వచ్చే సినిమాల్లో (గ్రాఫిక్స్) సి.జి పనులకు చాలా ప్రాధాన్యత పెరిగింది. సీజీ టీమ్ కి సినిమాటోగ్రాఫర్ వర్క్ కి సంబంధం ఉండదు. సీజీ వాళ్ళు బాగా చేస్తే సినిమాటోగ్రాఫర్ కి కూడా మంచి పేరు వస్తుంది. సినిమాటోగ్రాఫర్ కంటే సి.జి టీం ఇచ్చే అవుట్‌పుట్ చాలా కీలకం. అలా కాదని నేను ‘అంజి’ ‘ఢమరుఖం’ చేశాను.. నాకు నంది, ఫిల్మ్ ఫేర్ అవార్డులు వచ్చాయి అని వెళ్ళి సీజీ వాళ్ళ వర్క్ లో ఇగో చూపించడానికి సరిపోను.
సినిమాటోగ్రాఫర్ ఎంతటి అనుభవజ్ఞుడైనప్పటికీ… సి.జి టెక్నీషియన్లకు కావాల్సిన లైటింగ్ మరియు ఫ్రేమింగ్ అందించడం మా బాధ్యత. వారి సూచనల ప్రకారం పనిచేస్తేనే విజువల్ క్వాలిటీ బాగుంటుందని, అక్కడ ఇగోలకి చోటు ఉండకూడదు” అంటూ చెప్పుకొచ్చారు. అలాగే గతంలో ‘అంజి’ ఇప్పుడు ‘విశ్వంభర’ సినిమాలకి పనిచేయడం ఎలా అనిపిస్తుంది.? ‘విశ్వంభర’ ఎలా ఉండబోతుంది? అనే ప్రశ్నకి కూడా ఛోటా కె నాయుడు స్పందించారు.
‘ ‘అంజి’ కి తలెత్తుకుని పనిచేశాం. ‘విశ్వంభర’ కి తల వంచుకుని జాగ్రత్తగా పనిచేస్తున్నాం. ఇది రూ.400 కోట్ల బడ్జెట్ సినిమా! సి.జి పనులు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే ఇగోకి వెళ్లకుండా… ప్రతి విషయంలోనూ చాలా జాగ్రత్తగా, టెక్నీషియన్ల సూచనలని బట్టి పనిచేస్తున్నాం. అందుకే ఎక్కువ టైమ్ కూడా తీసుకుంటున్నాం’ అంటూ ఛోటా కె నాయుడు చెప్పుకొచ్చారు.