అల్లుడు అదుర్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

“రాక్షసుడు” చిత్రంతో హీరోగా మంచి హిట్ సొంతం చేసుకున్న బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “అల్లుడు అదుర్స్”. సోనూసూద్, ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదలైంది. ట్రైలర్ తోనే ప్రేక్షకుల్ని బెంబేలెత్తించిన “అల్లుడు అదుర్స్” సినిమాగా ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: అనుకోకుండా అక్కాచెల్లెలను ప్రేమించిన శ్రీను (బెల్లంకొండ), వాళ్ళిద్దరి తండ్రి జయపాల్ రెడ్డి (ప్రకాష్ రాజ్), లోకల్ డాన్ గజా (సోనూసూద్)ల నుండి తన ప్రేమను ఎలా కాపాడుకున్నాడు? అసలు వసుంధర (అను ఇమ్మాన్యూల్) & కౌముది (నభా నటేష్)లను ఎందుకు ప్రేమించాడు? వాళ్ళిద్దరిలో చివరికి ఎవరితో సెట్ అయ్యాడు? అనేది “అల్లుడు అదుర్స్” కథాంశం.

నటీనటుల పనితీరు: బెల్లంకొండ సాయిశ్రీనివాస్ హీరోగా ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీకి కూడా రెడీ అయిపోయాడు కానీ.. ఇప్పటివరకు నటుడిగా ఓనమాలు కూడా నేర్చుకోలేకపోయాడు. ఫైట్స్, డ్యాన్స్ బాగానే చేస్తున్నాడు కానీ.. ఆనందం, కోపం లాంటి సామాన్యమైన భావాలను సైతం వ్యక్తపరచలేకపోతున్నాడు. పక్కన ఆర్టిస్టుల రియాక్షన్ బట్టి బాబు పెర్ఫార్మెన్స్ ను ఎనలైజ్ చేసుకోవాల్సి వస్తుంది. ప్రీరిలీజ్ ఈవెంట్లో బ్యాగ్రౌండ్ ఉన్న నటులను మాత్రమే కాదు మమ్మల్ని కూడా ఎంకరేజ్ చేయాలనీ కోరిన బెల్లంకొండ, నటన పరంగా కాస్త శిక్షణ తీసుకొని ప్రేక్షకులను కూడా కాస్త ఆకట్టుకోవడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. ఎందుకంటే డ్యాన్సులు, ఫైట్లు ఇప్పుడు ఢీ షోలో కంటెస్టెంట్స్ కూడా చేస్తున్నారు. కానీ.. హీరోగా నిలబడాలంటే కావాల్సిన ముఖ్యమైన లక్షణం నటన. ఎక్స్ ప్రెషన్స్ పలకవు అని తోలి రెండుముడు సినిమాలతో నెగిటివిటీ ఎదుర్కొన్న రామ్ చరణ్ కూడా ఇప్పుడు నటుడిగా మంచి ఫామ్ లోకి వచ్చాడు. కానీ.. “అల్లుడు శీను”తో తెరంగేట్రం చేసిన శ్రీనివాస్ మాత్రం ఇప్పటికీ యాక్టింగ్ లో అ,ఆ దగ్గరే ఆగిపోయాడు. ఇప్పటికైనా నటుడిగా ప్రూవ్ చేసుకోకపోతే హీరోగా కాదు కదా కనీసం యాక్టర్ గా కూడా ప్రేక్షకులు అతడ్ని గుర్తించడం కష్టమవుతుంది.

నభా నటేష్ కెరీర్ ఇప్పుడిప్పుడే సెట్ అవుతుంది అనుకునేలోపు ఆమె కెరీర్ వరస్ట్ పెర్ఫార్మెన్స్ తో ఆడియన్స్ ను ఇరిటేట్ చేసింది. నటించడానికి పెద్దగా స్కోప్ లేనప్పటికీ.. కౌముది పాత్రలో చిన్నపాటి హావభావాలు కూడా పలకలేక చిరాకుపెట్టింది. ఇక అను ఇమ్మాన్యూల్ కాస్త సన్నబడి ఆమె అభిమానులను అలరించింది. పాపం ప్రకాష్ రాజ్, సోనూసూద్ లవి రోబో లాంటి పాత్రలు. వాళ్ళు ఆల్రెడీ కొన్ని వందల సినిమాల్లో చేసిన పాత్రలే కావడంతో అలా చేసుకుంటూపోయారు. ఇక జబర్దస్త్ బ్యాచ్ లాగ పొలోమని ఉన్న కమెడియన్స్ కూడా రోత కామెడీతో నవ్వించలేక విసిగించారు.

సాంకేతికవర్గం పనితీరు: దేవిశ్రీప్రసాద్ పాటలే ఈ సినిమాలో ఆడియన్స్ కు రిలీఫ్. వినడానికి కొత్తగా లేకపోయినా, లావిష్ గా తెరకెక్కించడంలో అప్పటివరకు రొట్ట సన్నివేశాలతో విసిగిపోయిన ప్రేక్షకులు కాస్త సాంత్వన పొందడానికి ఈ పాటలు ఉపయోగపడ్డాయి. చోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ, నిర్మాత గొర్రెల సుబ్రహ్మణ్యం నీళ్లలా ఖర్చుపెట్టిన డబ్బులు బూడిదలో పోసిన పన్నీరే.

అసలు ఈ అంశాలన్నీ పక్కన పెడితే.. కొన్ని హిట్ సినిమాల్లోని సన్నివేశాలన్నీ కలిపి ఒక సినిమాగా తీసి ఆడియన్స్ ముఖాన కొట్టిన సంతోష్ శ్రీనివాస్ గురించి మాట్లాడుకోవాలి. “అజ్ఞాతవాసి” చూసి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతగా హర్ట్ అయ్యారో.. ఈ సినిమా చుసిన ప్రేక్షకులు అంతకుమించి హర్ట్ అవుతారు. ట్రైలర్ తోనే ఉన్న కొద్దిపాటి అంచనాలను భూస్థాపితం చేసిన సంతోష్ శ్రీనివాస్ థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడి బుర్రతో ఫుట్ బాల్ ఆడేశాడు. ఆ రోత కామెడీ ఏమిటో, రొట్ట సన్నివేశాలు ఏమిటో? అసలు దర్శకుడిగా, కథకుడిగా ఏ జనరేషన్ దగ్గర ఆగిపోయాడో అనిపిస్తుంది. కొత్త కథ రాసుకోనక్కర్లేదు, కనీసం రాసుకున్న 80ల నాటి కథను కొత్తగా తీయొచ్చు కదా. అసలు ఇంకెన్నాళ్లు ఈ కన్ఫ్యూజన్ కామెడీతో నిర్మాతల్ని ఫూల్స్ చేసి, ప్రేక్షకుల్ని చీట్ చేస్తారు. సంతోష్ శ్రీనివాస్ మాత్రమే కాదు, నిర్మాతలను, ఆడియన్స్ ను గ్రాంటెడ్ గా తీసుకొనే ప్రతి ఒక్క దర్శకుడు ఈ విషయాన్ని బుర్రలోకి ఎక్కించుకొని.. సినిమాను కొత్తగా తీయకపోయినా పర్లేదు చెత్తగా తీసి ప్రేక్షకుల్ని చిరాకు పెట్టించకుండా ఉంటె చాలు.

విశ్లేషణ: నటీనటుల మరియు సాంకేతిక నిపుణుల పనితనం గురించి అంత రూడ్ గా చెప్పినందుకు కాస్త ఇబ్బందిగా ఉన్నా.. “ఏం తీసినా చూస్తారు, మేం రాసిందే కామెడీ, తీసిందే సినిమా” అనే మైండ్ సెట్ తో తీసిన “అల్లుడు అదుర్స్”లాంటి సినిమాలు మళ్ళీ తెలుగులో చూడాల్సిన కర్మ ప్రేక్షకులకు కలుగకూడదు అని కోరుకుంటూ.. క్రోసిన్ కొనుక్కోవడానికి మిడిల్ షాపుకి బయలుదేరుతున్నా. సెలవు!

రేటింగ్: 1.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus