Ammayi Review: అమ్మాయి సినిమా రివ్యూ & రేటింగ్!

  • July 15, 2022 / 06:26 PM IST

రాంగోపాల్ వర్మ సినిమాలు ఈ మధ్య కాలంలో ఎప్పుడు వస్తున్నాయి? ఎప్పుడు వెళ్ళిపోతున్నాయి? అనే విషయాన్ని జనాలు పట్టించుకోవడం మానేశారు.కానీ ఆయన తెరకెక్కించిన ఇండియాస్ ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ ఫిలిం ‘లడ్కీ’ ని తెలుగులో ‘అమ్మాయి‘ పేరుతో రిలీజ్ చేస్తున్నాడు అని తెలిసి .. ఈ మూవీతో అతను హిట్టు కొట్టే ప్రయత్నం చేస్తాడేమో అని ఆశించారు. ఏకంగా 47,000 స్క్రీన్లలో విడుదల అవుతున్న మొదటి తెలుగు సినిమా ‘అమ్మాయి’ అంటూ కూడా ప్రచారం చేశారు. చెప్పాలంటే ఈ మధ్య కాలంలో ‘అమ్మాయి’ చిత్రానికి చేసిన ప్రమోషన్లు రాంగోపాల్ వర్మ మరో సినిమాకి చేయలేదు అనే చెప్పాలి. మరి అంత పబ్లిసిటీ చేసిన ఈ ‘అమ్మాయి’ ఎలా ఉందో తెలుసుకుందాం రండి :

కథ : తన అక్క జీవితం నాశనం అయిపోవడంతో.. సెల్ఫ్ డిఫెన్స్ కోసం మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంది పూజ ( పూజా భలేకర్). చిన్నప్పటి నుండి బ్రూస్ లీ ని అమితంగా అభిమానించే అమ్మాయి కావడంతో ఇంకా పిచ్చిగా మార్షల్ ఆర్ట్స్ లో ట్రైన్ అవుతుంది. అలాగే మోడలింగ్ కూడా చేస్తుంది. ఇదే క్రమంలో ఫోటోగ్రాఫర్ నీల్(పార్ధ సూరి) తో ప్రేమలో పడుతుంది. మరోపక్క డ్రాగన్ స్కూల్ లో పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ కూడా ఇస్తుంది. అయితే ఆ స్కూల్ ను కూల్చేసి ఆ స్థలాన్ని సొంతం చేసుకోవాలని చూస్తాడు అండర్ వరల్డ్ డాన్ అయిన వి.ఎం(అభిమన్యు సింగ్).

ఈ క్రమంలో ఆ స్థలానికి సంబంధించిన యజమాని(తియాంగ్లాంగ్ షి) ని హతమారుస్తాడు. ఆ డ్రాగన్ స్కూల్ యజమాని పూజకి గురువు కూడా. అతని చివరి కోరికగా విలన్ భారి నుండి…. ఆ స్కూల్ ని టచ్ చేయకుండా అడ్డుకుంటుంది. ఆ తర్వాత విలన్ క్రూరత్వం ఎక్కువయ్యి ఎన్నో వికృత చర్యలు చేపడతాడు. అతన్ని అడ్డుకుని ఈ అమ్మాయి నిలబడిందా? ఆ స్కూల్ ను కాపాడుకుందా? లేదా అనేది మిగిలిన కథ.

నటీనటుల పనితీరు : పూజా భలేకర్ కు ఈ రోల్ బాగా సెట్ అయ్యింది. ఆమె నటనతో కూడా ఆకట్టుకుంది.మహారాష్ట్రియన్ మిడిల్ క్లాస్ బ్రాహ్మిణ్ కుటుంబం నుంచి వచ్చిన పూజ ఈ రేంజ్లో ఫైట్లు వంటివి చేసిందా అని ఆశ్చర్యపరిచింది.నిజంగానే యాక్షన్ సన్నివేశాల్లో ఆమె చాలా బాగా చేసింది. గ్లామర్ షోకి కూడా హద్దులు పెట్టుకోలేదు అని ఈ చిత్రంతో ప్రూవ్ చేసింది. ఆమె లుక్స్ కూడా బాగున్నాయి. ఆమె బాయ్ ఫ్రెండ్ గా చేసిన పార్ధ సూరి పెద్దగా ఆకర్షించడు, ఆకట్టుకోడు. అభిమన్యు సింగ్ రెగ్యులర్ తెలుగు సినిమాల్లో విలన్ ఎలా ఉంటాడో అలాగే కనిపించాడు. కానీ అతని వంతు పెర్ఫార్మన్స్ అతను ఇచ్చాడు. మిగిలిన నటీనటులంతా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేవాళ్లే. సినిమా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు హీరోయిన్ పైనే జనాల ఫోకస్ ఉంటుంది అనడంలో అతిశయోక్తి లేదు.

సాంకేతిక నిపుణుల పనితీరు : ఈ మధ్య కాలంలో దర్శకుడి పేరు రాంగోపాల్ వర్మ అని పడినా, ఆయన శిష్యుల పేర్లు పడినా… ఆర్జీవీ బ్రాండ్ నుండి వచ్చే సినిమాలు ఒకేలా ఉంటున్నాయి. ఈ సినిమా విషయంలో ఆయన కొత్తగా చేసింది ఏమీ లేదు. ‘రంగీలా’ నే అటు తిప్పి.. ఇటు తిప్పి తీసాడేమో అనిపిస్తుంది. ప్రమోషన్స్ లో కూడా ఆయన ‘రంగీలా’ లానే ఉంటుంది అని డైరెక్ట్ గానే చెప్పాడు. కాబట్టి.. ఈ విషయంలో ఆయన్ని బ్లేమ్ చేయడానికి ఏమీ లేదు. అయితే బ్రూస్ లీ అంటే బోలెడంత అభిమానం ఉందని చెప్పిన వర్మ.. ఆయన పై రెస్పెక్ట్ తో అయినా హీరోయిన్ ని నిండుగా బట్టలు వేయించి ఫైట్లు చేయించి ఉంటే బాగుండేది.

అందులోనూ ఈ సినిమాలో కూడా హీరోయిన్ బ్రూస్ లీ అభిమానిగా కనిపించింది కాబట్టి. ఇక వర్మ కంటే ఎక్కువ ఈ చిత్రానికి ఎక్కువ పని ఫైట్ మాస్టర్ కి అలాగే సినిమాటోగ్రాఫర్ కి పడింది అని క్లియర్ గా తెలుస్తుంది. యాక్షన్ సన్నివేశాలు డిజైన్ చేసుకుంది హీరోయిన్ పూజా భలేకర్ అట. అయితే వాటిని ఎగ్జిక్యూట్ చేసింది చైనా టీం అని వర్మ తెలిపిన సంగతి తెలిసిందే. ఇక సినిమాటోగ్రాఫర్ గా రామి చేశాడు. వీళ్ళకే ఎక్కువ శాతం మార్కులు పడాలి. రన్ టైం 2 గంటల లోపు ఉండడం మాత్రం ఓ ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు.

విశ్లేషణ : హీరోయిన్ గ్లామర్, ఆమె చేసిన ఫైట్లు… వంటివి చూసి టైంపాస్ చెయ్యాలి అనుకుంటే ఈ ‘అమ్మాయి’ కి వెళ్లొచ్చు. కథ, కథనాలు బాగుండాలి లేదంటే వద్దు అనుకునేవాళ్లు.. యూట్యూబ్ లోకి వచ్చాక చూసుకోవచ్చు. ఎలాగు వర్మ సినిమాలు త్వరగానే ఓటీటీ లేదా యూట్యూబ్ కు వచ్చేస్తాయి అన్న సంగతి తెలిసిందే కదా..!

రేటింగ్ : 1/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus