టాలీవుడ్‌లో ఎన్నికల వేడి మొదలైంది. నిన్నమొన్నటివరకు అంతా ప్రశాంతంగా ఉందనుకున్న టాలీవుడ్‌లో ఎలక్షన్ ఫీవర్ షురూ చేశారు ప్రకాశ్ రాజ్. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు త్వరలో జరిగే ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నా అంటూ ఇటీవల ప్రకాశ్ రాజ్ ప్రకటించారు. ఆ వెంటనే నాగబాబు మద్దతిచ్చారు. దీంతో ఇక ప్రకాశ్‌రాజ్ అధ్యక్షుడు కావడం కన్ఫామ్ అనుకున్నారంతా. కానీ పరిస్థితి ఇప్పుడు త్రిముఖ పోరులా మారింది. ప్రకాశ్ రాజ్ ప్రకటించిన వెంటనే… మంచు విష్ణు రంగంలోకి దిగారు. ‘నేనూ బరిలో ఉన్నా’ అంటూ ప్రకటించేశారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.
తండ్రి మంచు మోహన్‌బాబుతో కలసి కృష్ణంరాజు, కృష్ణ లాంటి పెద్దల దగ్గరకు వెళ్లారు మంచు విష్ణు. దీంతో ఆయన పోటీ విషయంలో సీరియస్‌గా ఉన్నారని తేలిపోయింది. అయితే ప్రకాశ్‌రాజ్ వెనుక చిరంజీవి ఉన్నారనే విషయం తెలిసిందే. ఇండస్ట్రీలో, అందులోనూ ‘మా’ ఎన్నికల్లో చిరంజీవి టీమ్‌కి గట్టి పట్టే ఉంది. ఆయన వెనుక ఉంటే.. విజయం తథ్యం అంటుంటారు. ఓవైపు ప్రకాశ్‌రాజ్, మరోవైపు విష్ణు ఉండటంతో చిరంజీవి పరిస్థితి అడకత్తెరలో పోకచెక్కలా మారిపోయింది. మోహన్‌బాబుతో ఉన్న స్నేహం కారణంగా ఇప్పుడు ప్రకాశ్ రాజ్ నుండి విష్ణు వైపు మద్దతు వస్తుందా అనే ప్రశ్న మొదలైంది.
అయితే చిరంజీవి మనసు మారే పరిస్థితి లేదంటున్నారు. ఇదంతా ఇలా ఉంటే… హఠాత్తుగా అధ్యక్ష పదవి బరిలోకి నటి జీవిత రాజశేఖర్ వచ్చారు. ప్రస్తుతం ఆమె ‘మా’ కార్యదర్శిగా ఉన్నారు. దీంతో ఆమెకు కొంతమంది మద్దతు ఉంటుందంటున్నారు. ‘మా’ పోరులో ముక్కోణపు పోటీ నెలకొన్న నేపథ్యంలో నటీనటులు ఎటువైపు వెళ్తారు అనే విషయం అంతుచిక్కడం లేదు. ప్రకాశ్ రాజ్‌కు ఉన్న ప్లస్‌ల్లో ముఖ్యమైనది చిరంజీవి సపోర్టు కాగా, రెండోది ఆయనకు ఇక్కడివారిపై ఉన్న పట్టు. పోటీలో ఉంటున్నా అని చెప్పినప్పుడే… ఈ విషయాలు చెప్పేశారు. ‘మా’కు సొంత భవనం అనే నినాదంతో విష్ణు రంగంలో ఉన్నారు. మరోవైపు జీవితకు ఫైర్‌బ్రాండ్ అని టాలీవుడ్‌లో పేరు. ఈ నేపథ్యంలో ముగ్గురూ ముగ్గురే అనే పరిస్థితి ఉంది.
Most Recommended Video
బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?