Sankranti: ‘రాజు’ గారి ప్లాన్ మారింది.. పండగ రేసులో వెనకడుగు?

టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి అంటే కేవలం పండగ మాత్రమే కాదు, అదొక బాక్సాఫీస్ వార్. స్టార్ హీరోలంతా తమ అస్త్రశస్త్రాలతో బాక్సాఫీస్‌పై దండయాత్రకు దిగే సమయం అది. ఈసారి 2026 సంక్రాంతి పోరు కూడా మామూలుగా ఉండబోవడం లేదు. చిరంజీవి, ప్రభాస్, రవితేజ, విజయ్ వంటి బడా స్టార్లు బరిలో ఉన్నారు. ఈ దిగ్గజాల మధ్య తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్న యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి ఇప్పుడు పునరాలోచనలో పడ్డట్లు తెలుస్తోంది.

Sankranti

గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ‘అనగనగా ఒక రాజు’ జనవరి 14న థియేటర్లలోకి రావాలి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ప్రమోషనల్ కంటెంట్ చూసి ఫ్యామిలీ ఆడియన్స్ ఈ సినిమా కోసం ఒక రేంజ్‌లో ఫిక్స్ అయ్యారు. పండగ పూట మంచి కామెడీ ఎంటర్టైనర్ దొరికితే అంతకంటే ఏం కావాలనుకున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న పోటీని దృష్టిలో పెట్టుకుని, సినిమాను పండగ రేసు నుంచి తప్పించాలని మేకర్స్ డిసైడ్ అయినట్లు ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఎందుకంటే సంక్రాంతికి థియేటర్ల దొరకడం గగనం. చిరంజీవి ‘విశ్వంభర’, ప్రభాస్ ‘రాజా సాబ్’ వంటి భారీ చిత్రాలు ఉన్నప్పుడు, చిన్న సినిమాలకు స్క్రీన్లు దొరకడం కత్తి మీద సాము లాంటిదే. అందుకే సేఫ్ గేమ్ ఆడేందుకు ‘అనగనగా ఒక రాజు’ను జనవరి 23కి లేదా రిపబ్లిక్ డే వీకెండ్‌కు వాయిదా వేసే యోచనలో ఉన్నారట. పెద్ద సినిమాల హడావిడి తగ్గాక నిమ్మలంగా వస్తే బెటర్ అనే ఆలోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం.

అయితే ఇక్కడా ఒక చిన్న చిక్కుముడి ఉంది. పండగకు రిలీజ్ అయిన పెద్ద సినిమాలకు గనక హిట్ టాక్ వస్తే, వాటి జోరు సంక్రాంతి వారంతో ఆగిపోదు. కనీసం రెండు, మూడు వారాల పాటు హౌస్ ఫుల్ బోర్డులతో నడుస్తాయి. అప్పుడు జనవరి 23న వచ్చినా థియేటర్ల సమస్య తప్పదు. అంటే కొత్త డేట్ కూడా పూర్తి సేఫ్ అని చెప్పలేం. అలాగని మరీ వాయిదా వేస్తే, ఇప్పటికే ఆలస్యమైన ప్రాజెక్ట్ కావడంతో బజ్ తగ్గిపోయే ప్రమాదం ఉంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus