సినిమా నటులు నటించడమే కాదు.. ఒక్కోసారి యానిమేషన్ పాత్రలకు డబ్బింగ్ కూడా చెబుతుంటారు. అలా గతంలో చాలామంది డబ్బింగ్ చెప్పినా.. రీసెంట్ టైమ్‌లో అయితే ఇలా చేసిన హీరోయిన్ మాత్రం ప్రియాంక చోప్రానే (Priyanka Chopra) . ‘టైగర్’ సినిమాలోని అంబా అనే ఆడపులి పాత్రకు ప్రియాంక చోప్రా డబ్బింగ్ చెప్పిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఆమెలా మారి అనన్య పాండే కూడా గొంతు అరువు ఇస్తోంది. డిస్నీ వాళ్ల సినిమా ‘ఇన్‌సైడ్ అవుట్ 2’ హిందీ వెర్షన్ సినిమాలోని రిలే అనే పాత్రకు అనన్య పాండే (Ananya Panday) డబ్బింగ్ చెప్పనుందట.
ఈ విషయాన్ని అనన్య పాండేనే స్వయంగా ఇన్‌స్టాగ్రామ్‌లో తెలియజేసింది. రిలే మనసులో ఉండే ఆరు భావోద్వేగాల చుట్టూ తిరిగే కథనంతో ‘ఇన్‌సైడ్ అవుట్ 2’ సినిమాను రూపొందించారు. అలాంటి రిలే పాత్రకు గళాన్ని అందించడం చాలా ఆనందంగా ఉంది అని అనన్య చెబుతోంది. డిస్నీ, పిక్సర్ లాంటి సంస్థలు రూపొందించే యానిమేటెడ్ చిత్రాలకు తాను వీరాభిమానని చెప్పిన అనన్య.. ఆ కథలు ప్రేక్షకుల్ని వినోదాత్మక ప్రపంచంలోకి తీసుకెళ్తాయని పొగిడేసింది.
‘ఇన్‌సైడ్ అవుట్’ సినిమా చూసి బాల్యాన్ని గుర్తుచేసుకున్నాను అని చెప్పిన అనన్య పాండే.. ఇప్పుడు రెండో పార్టుతో కూడా అలాంటి అనుభూతి కలుగుతుందని ఆశిస్తున్నాను అని చెప్పింది. ‘ఇన్‌సైడ్ అవుట్ 2’ సినిమాను ఈ నెల 14న విడుదల చేస్తున్నారు. ఈ లోపే పనులు పూర్తి చేస్తారట. ఇక అనన్య పాండే సినిమాల సంగతి చూస్తే.. తెలుగులో ‘లైగర్’ (Liger) అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది.
అయితే ఆశించిన ఫలితం అందుకోలేకపోయింది. ఆ తర్వాత హిందీలో ‘రాకీ ఔర్ రాణీ కీ ప్రేమ్ కహానీ’ (Rocky Aur Rani Kii Prem Kahaani) సినిమాలో ప్రత్యేక గీతంలో నర్తించింది. ఆ వెంటనే ‘డ్రీమ్ గర్ల్ 2’ (Dream Girl 2) , ‘ఖో గయా హమ్ కహా ఆహ్నా సింగ్’ అనే సినిమాలు చేసింది. ఇంకా ఆమె చేతిలో ‘బ్యాడ్ న్యూజ్’, ‘కంట్రోల్’, ‘శంకర’ సినిమాలు ఉన్నాయి. తొలి సినిమాలో అయితే ఆమెది అతిథి పాత్రే. అయితే ఈ లిస్ట్‌లో తెలుగు సినిమాలేవీ లేకపోవడం గమనార్హం.