సాధారణంగా హీరో, ఫ్యాన్ సినిమాలంటే మనకు గుర్తుకొచ్చేది భారీ కటౌట్లు, పాలాభిషేకాలు, టికెట్ల కోసం గొడవలు. కానీ రామ్ పోతినేని ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ వీటన్నింటికీ భిన్నంగా ఒక బలమైన ఎమోషనల్ పాయింట్‌తో రాబోతోందట. ఈ సినిమా కథ కేవలం దర్శకుడు మహేష్ బాబు ఊహల్లోంచి పుట్టింది కాదు, ఒకప్పుడు తమిళనాడులో జరిగిన ఒక సంచలన వాస్తవ సంఘటన దీనికి మూలం అని తెలియడం ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఆ మధ్య కోలీవుడ్‌లో ఒక స్టార్ హీరోకి, అతని కోసం ప్రాణమిచ్చే ఒక అభిమానికి మధ్య జరిగిన ఒక సంఘటన అందరినీ కంటతడి పెట్టించింది. సరిగ్గా ఆ పాయింట్‌నే దర్శకుడు ఈ సినిమాకు ఆత్మగా మార్చుకున్నాడట. తెరపై మనం చూడబోయేది సినిమాటిక్ డ్రామా కాదు, హృదయానికి హత్తుకునే ఒక రియల్ ఎమోషన్. ఆ తమిళ హీరో ఎవరు? ఆ ఇన్సిడెంట్ ఏంటి? అనే సస్పెన్స్ సినిమా చూస్తేనే రివీల్ అవుతుందట. ఆ కథలోని ఎమోషన్ మాత్రం ప్రేక్షకులను కట్టిపడేస్తుందట.
ఇందులో రామ్ ఒక వీరాభిమానిగా, ఉపేంద్ర సూపర్ స్టార్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు రొటీన్ మాస్ సినిమాల్లోలా కాకుండా, చాలా కొత్తగా ఉంటాయని ఇన్ సైడ్ టాక్. రామ్ ఈ ప్రాజెక్ట్ మీద ఇంత నమ్మకంగా ఉండటానికి కారణం కూడా ఆ క్లైమాక్స్ ఎమోషనే అని అంటున్నారు. హీరోని దేవుడిలా చూసే అభిమాని కథలు చాలా వచ్చాయి కానీ, అభిమాని త్యాగాన్ని గుర్తించే హీరో కథలు తక్కువ. ఈ సినిమా ఆ కోవలోకే వస్తుంది.
వివేక్ మెర్విన్ సంగీతం, భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ ఈ ఎమోషనల్ జర్నీకి అదనపు బలాలు. ముఖ్యంగా పాటల్లో వినిపిస్తున్న మెలోడీ ఆ సోల్‌ను ఎలివేట్ చేసేలా ఉంది. కేవలం మాస్ ఆడియన్సే కాకుండా, ఫ్యామిలీస్ కూడా కనెక్ట్ అయ్యే పాయింట్ ఇదే. ఎమోషన్ పండితే బాక్సాఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.