తెలుగు సినిమాకు తెలుగు రాష్ట్రాలు గౌరవం ఇవ్వాలి.. ఈ మాట చాలా ఏళ్లుగా వింటూనే ఉన్నాం. తెలుగు రాష్ట్రాలు రెండు కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్న రోజుల్లోనే ఈ మాట వినిపించింది. ఎందుకంటే అప్పుడెప్పుడో అనౌన్స్ చేసిన నంది అవార్డులు కూడా ఇవ్వలేదు. ఈ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలు చాలా ఏళ్లుగా ప్రయత్నాలు చేసినా.. తొలి అడుగు తెలంగాణ నుండి పడింది.. గద్దర్ అవార్డుల పేరిట పురస్కారాలు ఇచ్చేశారు. దీంతో ఇక చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే.
దీనికి సంబంధించి ఏపీ ప్రభుత్వం గత కొన్ని నెలలుగా పనులు చేస్తూనే ఉంది. అయితే ఎందుకో కానీ ప్రాసెస్ పూర్తి కావడం లేదు. అయితే ఎట్టకేలకు ఈ అవార్డుల విషయంలో కీలక ముందడుగు పడింది. ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న నంది అవార్డుల విషయంలో కదలిక వచ్చింది. తెలుగు చలనచిత్ర, టెలివిజన్, నాటక రంగాలకు సంబంధించి నంది అవార్డుల ప్రదానోత్సవాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది.
2017 – 2025 సంవత్సరాలకు సంబంధించిన అవార్డుల ఎంపికకు వేర్వేరు జ్యూరీ కమిటీలను ఏర్పాటు చేసింది. జాతీయ చలనచిత్ర అవార్డుల ఎంపిక కోసం కూడా ప్రత్యేక కమిటీని నియమించింది. డిసెంబరులో అమరావతి వేదికగా పురస్కారాలు అందించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నవంబరు 26న ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో గత కొన్ని నెలలుగా అదిగో, ఇదిగో అంటూ వస్తున్న వార్తలకు ఇక చెక్ పడినట్లే. ఎందుకంటే జీవో వచ్చేసింది కాబట్టి.
గతేడాదికి సంబంధించిన జాతీయ పురస్కారాల ఎంపికకు ఏర్పాటు చేసిన కమిటీకి ఛైర్మన్‌గా నందమూరి బాలకృష్ణను నియమించారు. అలాగే ఈ కమిటీలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్, ఎస్.గోపాల్ రెడ్డి, ప్రభ ఉండనున్నారు. వారితోపాటు ఏపీ స్టేట్ ఫిలిం, టెలివిజన్ & థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ కూడా సభ్యుడిగా ఉంటారు.