అంజలి సిబిఐ

  • February 22, 2019 / 12:35 PM IST

లేడీ సూపర్ స్టార్ నయనతార నటించగా తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన “ఇమాక్కై నోడిగల్” అనే చిత్రాన్ని “అంజలి సిబిఐ”గా అనువదించారు. క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రంలో బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీలకపాత్ర పోషించడం విశేషం. తమిళనాట మంచి రివ్యూస్ అందుకోవడంతోపాటు.. అమేజాన్ ప్రైమ్ లోనూ కొన్ని నెలలుగా ఎవైలబుల్ గా ఉన్న ఈ చిత్రాన్ని ఇప్పుడు డబ్బింగ్ రూపంలో విడుదల చేశారు.

కథ:  అంజలి విక్రమాదిత్య (నయనతార) మోస్ట్ సక్సెస్ ఫుల్ పోలీస్ ఆఫీసర్. ఆమెను చాలెంజ్ చేస్తాడు ఓ సీరియల్ కిల్లర్ రుద్ర (అనురాగ్ కశ్యప్). వరుసగా కొందరు డబ్బున్న వాళ్ళ పిల్లలను కిడ్నాప్ చేసి.. భారీ మొత్తం డబ్బు అడిగి.. ఆ డబ్బు తీసుకున్న తర్వాత కూడా ఆ పిల్లలను చంపేయడం అతడి పద్ధతి. అలాంటి సైకో కిల్లర్ ను ఎదుర్కోవడానికి అంజలి ఏం చేసింది, అతడ్ని ఎలా పట్టుకుంది? అసలు రుద్ర పర్టీక్యులర్ గా అంజలిని టార్గెట్ చేయడానికి కారణం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

నటీనటుల పనితీరు: సినిమాలో హీరో లేడు అనే విషయాన్ని ప్రేక్షకుడు మర్చిపోయేలా అద్భుతమైన పవర్ ఫుల్ పెర్ఫార్మెన్స్ తో అదరగొట్టింది నయనతార. ఆమె క్యారెక్టరైజేషన్, లుక్స్ ఆడియన్స్ ను విశేషంగా అలరిస్తాయి. ఆమెను లేడీ సూపర్ స్టార్ అని ఎందుకు అంటారో ఈ సినిమాతో అందరికీ తెలిసిపోతుంది.
సైకో విలన్ గా బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ అద్భుతమైన పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. అతడి తెలుగు వెర్షన్ డబ్బింగ్ కూడా బాగుంది.

తమిళ కథానాయకుడు అథర్వ మురళి సపోర్టింగ్ రోల్ లో ఆకట్టుకున్నాడు. అతడి ప్రేయసిగా తక్కువ స్క్రీన్ స్పేస్ ఉన్నప్పటికీ రాశీఖన్నా పర్వాలేదనిపించుకొంది. నయనతార కుమార్తెగా నటించిన మనస్వి అలరిస్తుంది.
ఇక స్పెషల్ అప్పీరియన్స్ ఇచ్చిన విజయ్ సేతుపతి ఉండేది ఒక పాట వరకే అయినా కూడా.. తన నటనతో పాత్రకి ప్రాణం పోసి సినిమాకి ఆయువు పట్టుగా నిలిచాడు.

సాంకేతికవర్గం పనితీరు: హిప్ హాప్ తమిళ మ్యూజిక్ సినిమాకి పెద్ద ఎస్సెట్. సాంగ్స్, బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కథనానికి ప్లస్ అయ్యాయి. ఆర్.డి.రాజశేఖర్ సినిమాటోగ్రఫీ సినిమాకి మంచి లుక్ తీసుకురావడంతోపాటు.. థ్రిల్లర్ ఫీల్ కూడా తీసుకొచ్చింది. కొన్ని డ్రోన్ షాట్స్, ఫ్రేమ్స్ చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఛేజింగ్ సీన్స్ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయి.

“డిమాంటే కాలనీ” లాంటి సూపర్ హిట్ హారర్ సినిమా తర్వాత దర్శకుడు జ్నానముత్తు తెరకెక్కించిన సినిమా కావడంతో ఈ చిత్రంపై మాములుగానే అంచనాలు పెరిగాయి. ఆ అంచనాలను అందుకోగలిగాడు దర్శకుడు. కాకపోతే.. కథను అర్ధవంతంగా నడిపించడం కోసం, లాజికల్ గా ఉండడం కోసం కథనాన్ని సాగాదీయడం ఒక్కటే సినిమా మొత్తానికి మైనస్. అదొక్కటి తప్పితే సినిమా మొత్తం చాలా బాగుంటుంది.

విశ్లేషణ: ఒక థ్రిల్లింగ్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ కోసం “అంజలి సిబిఐ” సినిమాను సంతోషంగా ఒకసారి చూడొచ్చు. కాకపోతే.. కాస్త సాగతీతను భరించగలగాలి అంతే. నయనతార, అనురాగ్ కశ్యప్ లు పోటీపడి మరీ చేసిన నట ప్రదర్శన సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్.

రేటింగ్: 2.5/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus