క్యాస్టింగ్ కౌచ్… ఇదేదో సినిమా ఇండస్ట్రీకి మాత్రమే సంబంధించిన విషయం అనుకుంటూ ఉంటారు కానీ… ఇది చాలా రంగాల్లోనూ ఉంది. అయితే సినిమా ఇండస్ట్రీలోని విషయాలే ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. మరోవైపు ఈ రంగంలోనే క్యాస్టింగ్ కౌచ్ గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు. తాజాగా మరో బాలీవుడ్ నాయిక ఈ విషయంలో గొంతువిప్పింది. మామూలుగా అయితే మనకు పెద్దగా సంబంధం లేకుండా ఉండేది. అయితే ఆమెను కాంప్రమైజ్ అడిగింది సౌత్ ప్రొడ్యూసర్ అని చెప్పింది. దీంతో ఈ విషయంలో ఇప్పుడు మరోసారి చర్చలోకి వచ్చింది.
మీటూ, క్యాస్టింగ్ కౌచ్ అంటూ ఇప్పటికే ఇండియన్ సినిమాలో సింగర్ చిన్మయి, నటి తను శ్రీ దత్తా లాంటి వారు ఈ విషయం గురించి చాలాసార్లు మాట్లాడారు. వాళ్ల పోరాటానికి సరైన ఫలితం వస్తోందా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇంకా ఆ మాటలు వినిపిస్తున్నాయి కాబట్టి. తాజాగా హిందీ నటి అంకితా లోఖండే ఓ దక్షిణాది నిర్మాత మీద చేసిన కామెంట్లు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. సినిమా హీరోయిన్ ఆఫర్ అంటూ పడుకుంటేనే ఇస్తామని, కాంప్రమైజ్ కావాలని ఆ నిర్మాతకు చెందిన మనుషులు చెప్పారట.
39 ఏళ్ల అంకిత 20 ఏళ్ల క్రితం జరిగిన విషయాన్ని ఇప్పుడు చెప్పింది. ఆమెకు 19 ఏళ్లు ఉన్నప్పుడు హీరోయిన్ అవ్వాలనే కోరిక ఉండేదట. ఈ క్రమంలోనే సౌత్ సినిమాలకు ఆడిషన్ ఇచ్చిందట. అల ప్రయత్నాల్లో ఉండగా సౌత్ సినిమాకు హీరోయిన్గా సెలెక్ట్ అయ్యావని ఆమెకు కాల్ వచ్చిందట. అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికి రమ్మని పిలిచారట. అయితే వచ్చాక ఆమెను గది లోపలకు పిలిచారట. సినిమాలో హీరోయిన్ అవ్వాలంటే కాంప్రమైజ్ అవ్వాలని అడిగారట.
దీంతో షాకైన (Ankita Lokhande) అంకిత… మీ నిర్మాతకు టాలెంట్ అవసరం లేదా అమ్మాయి అయితే చాలు కదా. నేను అలాంటి టైపు కాదు అని తిట్టేసి అక్కడి నుండి వెళ్లిపోయిందట. అయితే ఆమె ఎవరా నిర్మాత అనే విషయం చెప్పలేదు. దీంతో ఆ సౌత్ నిర్మాత ఎవరబ్బా అనే చర్చ మొదలైంది.