ఏప్రిల్ 8.. పవన్ కల్యాణ్ అభిమానులు గత ఏడాది ముందు వరకు చాలా స్పెషల్. పవన్ వారసుడు అకీరా నందన్ పుట్టిన రోజు ఈ రోజు. ఇంకా హీరో కాకపోయినా అకీరాని పవన్ ఫ్యాన్స్ హీరోగానే చూస్తున్నారు. అయితే గతేడాది ఏప్రిల్ 8 వారిని ఎంతో మానసిక వేదనకు గురి చేసింది. పవన్ రెండో తనయుడు మార్క్ శంకర్ పవనోవిచ్ అదే రోజున దాదాపు మృత్యు కోరల్లో చిక్కుకోబోయాడు. సింగపూర్‌లో సమ్మర్ కోర్సులో చేరిన మార్క్.. అక్కడ ప్రమాదంలో చిక్కుకున్నాడు. తీవ్రమైన కాలిన గాయాలు, శ్వాసకోస ఇబ్బందితో బయటపడ్డాడు.
ఆ ఘటన జరిగినప్పుడు కానీ, ఆ తర్వాత కానీ మార్క్ ఫొటో కానీ, నాటి పరిస్థితుల గురించి కానీ విషయం బయటకు రాలేదు. అయితే ఈ రోజు ఉదయాన్నే పవన్ భార్య అనా కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్‌లో సుదీర్ఘ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘ఈ రోజు మాకు చాలా ఎమోషనల్. ఈ రోజు అకీరా పుట్టిన రోజు. అకీరాని చూస్తే మాకు చాలా గర్వంగా ఉంటుంది. అలాగే మా అబ్బాయి మార్క్‌కి ప్రాణాపాయం తప్పిన రోజు కూడా ఈ రోజే. ఈ రోజు మా ఇద్దరు అబ్బాయిల కోసం సెలబ్రేషన్ చేసుకుంటున్నాం’’ అని రాసుకొచ్చారు అనా.
మార్క్‌కి ఇది రెండో జన్మ వచ్చిన రోజు. గతేడాది జరిగిన ప్రమాదం గురించి ఇంకా విచారణ జరుగుతోంది. ఆ ప్రమాదానికి కారణమైనవారు ఎవరు అనేది ఇంకా తేలలేదు. ఆ ఘటనలో చనిపోయిన చిన్నారి ఫ్రెయా విషయంలో ఎవరు బాధ్యత తీసుకుంటారు. అలాగే ఆ రోజు 18 మంది ఆసుపత్రి పాలయ్యారు. వారి బాధ్యత ఎవరిది? కొంతమంది చిన్నారులకు ఇంకా సర్జరీలు జరగాల్సి ఉంది. వారికి కాలిన గాయాలు తీవ్రంగా అయ్యాయి. దేవుడి దయ వల్ల మార్క్ ప్రాణాపాయం నుండి బయటపడ్డాడు. కానీ ఊపిరితిత్తులు బాగా డ్యామేజ్ అయ్యాయి. అయితే ఇప్పుడు బాగానే ఉన్నాడు అని చెప్పారు అనా కొణిదెల.
నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆ రోజున మార్క్ ఆసుపత్రి బెడ్ మీద ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాడు. వాడిని చూసి తట్టుకోవడం నా వల్ల కాలేదు. ఇలాంటి పరిస్థితి ఏ తల్లికీ వద్దు. ఆ రోజున ప్రమాదంలో పిల్లల్ని రక్షించిన భవన నిర్మాణ కార్మికులకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్లు హీరోలు. అందరూ జాగ్రత్తగా ఉండండి. ఇంట్లో అగ్నిమాపక పరికరాలు లేదంటే.. ఫైర్ బ్లాంకెట్‌లు ఉంచుకోండి. అయితే వాటిని వాడే అవకాశం రాకూడదని కోరుకుంటున్నాను అని అనా జాగ్రత్తలు కూడా చెప్పారు.