పాన్ ఇండియా స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టికి ఇద్దరు సోదరులు ఉన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసుండదు. వాళ్ళే గుణరంజన్ శెట్టి, సాయి రమేష్ శెట్టి. వీళ్ళలో ప్రస్తుతం మనం గుణరంజన్ శెట్టి గురించి చర్చించుకోబోతున్నాం. ఇతని ప్రాణానికి ప్రమాదం ఉందనే వార్త ఇప్పుడు తెగ హల్ చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. ఒకప్పుడు ముత్తప్పరై అనే మాఫియా నేరగాడు ఉండేవాడు. అతను ఇప్పుడు ప్రాణాలతో లేడు లెండి.
అయితే అతను బ్రతికున్నప్పుడు మన్విత్ రై, గుణరంజన్శెట్టిలు .. ఇతనికి లెఫ్ట్ అండ్ రైట్ లా ఉండేవారు. అయితే ముత్తప్ప రై మరణించిన తర్వాత మన్విత్ రై, గుణరంజన్శెట్టిల మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇద్దరూ ప్రత్యర్థులుగా మారడం జరిగింది. ముత్తప్పరై బ్రతికున్నపుడు జయ కర్ణాటక సంఘం ని స్థాపించారు. అయితే గుణరంజన్ దాని నుండీ బయటకి వచ్చేసి జయకర్ణాటక జనపర వేదికను స్థాపించడం జరిగింది.
అప్పటి నుండీ గుణరంజన్ మంగళూరు, బెంగళూరు ప్రాంతాల్లో చురుగ్గా పనిచేస్తూ వస్తున్నారు. దీంతో మన్విత్ రై గుణరంజన్ పట్ల అసూయ పెంచుకున్నారు. తమ నాయకుడు హత్యకు కుట్ర పన్నాడని గుణరంజన్ అనుచరులు అతని పై ఆరోపణలు వ్యక్తం చేయడం కూడా ఇందుకు ఓ కారణంగా చెప్పుకోవాలి.అలాగే ఆదివారం నాడు రాష్ట్ర హోం మంత్రి అరగ జ్ఞానేంద్రను కలిసిన గుణరంజన్ అనుచరులు అతనికి భద్రత కల్పించాలని కోరారు. ఈ ఆరోపణల పై మన్విత్ రై ఖండించారు.
అతనికి ఎలాంటి సంబంధం లేదని.. గుణరంజన్ ను తాను చంపాలనుకోవడం లేదు అని.. అతను తెలియజేశాడు. అయినప్పటికీ అనుష్క సోదరుడికి ప్రాణాపాయం ఉందని.. అతన్ని హత్య చేసేందుకు కుట్ర పన్నుతున్నారనే ప్రచారం గట్టిగానే జరుగుతుంది.