Vels Production: థియేటర్ల విషయంలో ప్రముఖ నిర్మాణ సంస్థకు టోకరా.. నిందితులు అరెస్టు

ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ దగ్గర డబ్బులు తీసుకొని మోసానికి పాల్పడిన థియేటర్‌ కాంప్లెక్స్‌ ఓనర్లను తమిళనాడు పోలీసులు అరెస్టు చేశారు. ఈ వ్యవహారంలో రూ.21.75 కోట్లు మోసపోయామని ఆ నిర్మాణ సంస్థ పోలీసులను ఆశ్రయించింది. అయితే ఈ కేసులో ఇంకొక వ్యక్తి ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు. పోలీసుల కథనం ప్రకారం. ఈవీపీ గ్రూపునకు చెందిన సంతోష్‌ రెడ్డి, సంస్థ యాజమాన్యానికి చెమ్మంగళం గ్రామంలో 34 ఎకరాల భూమి, ఓ సినిమా థియేటర్ల కాంప్లెక్స్‌ ఉంది. ఆ ఆస్తులను సినిమా నిర్మాణ సంస్థ వేల్స్‌ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ లిమిటెడ్‌ లీజుకు తీసుకుంది.

Vels Production

ఈ మేరకు వేల్స్‌ యాజమాన్యం ఈవీపీ గ్రూప్‌కి రూ.15 కోట్లు చెల్లించింది. ఆ ఆస్తిపై ఈవీపీ గ్రూపు అప్పటికే రుణం తీసుకుంది. మరోవైపు వేల్స్‌ సంస్థ నుండి కూడా రూ.6 కోట్లు తీసుకుంది. అయితే సంతోష్‌ రెడ్డి దీనికి సంబంధించి పత్రాలు ఇవ్వకపోవడంతో వేల్స్‌ పనులు చేయలేకపోయింది. ఈలోపు వేల్స్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని వారికి తెలియకుండా సంతోష్‌ రెడ్డి రద్దు చేశారు. దీంతో ఒప్పందం మేరకు తీసుకున్న రూ.21.75 కోట్లను తిరిగివ్వాలని వేల్స్‌ అడిగింది.

దీంతో వేల్స్‌ సంస్థకు చెందిన వారిని సంతోష్‌ రెడ్డి, ఆయన మేనేజర్లు వినోద్‌ కుమార్‌, కిరణ్‌రాజ్‌ హత్య చేస్తామని బెదిరించారు. ఈ మేరకు వేల్స్‌ మేనేజర్‌ గుణశేఖరన్‌ తాంబరం పోలీస్‌ కమిషనర్‌ అమల్‌ రాజ్‌కు ఫిర్యాదు చేశారు. తాంబరం సెంట్రల్‌ క్రైం బ్రాంచ్‌ పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. ఈ క్రమంలో అజ్ఞాతంలోకి వెళ్లిన సంతోష్‌ రెడ్డి, మేనేజర్‌ వినోద్‌ కుమార్‌ కోసం గాలింపు చేపట్టారు. ఎట్టకేలకు సోమవారం చెన్నై వేళచ్చేరి సమీపంలో ఉన్నట్లు సమాచారం అందింది. ఆ ఇద్దరిని అరెస్టు చేసి తాంబరం కోర్టులో హాజరుపరచి 15 రోజుల రిమాండ్‌కు తరలించారు. పరారీలో ఉన్న మరో మేనేజర్‌ కిరణ్‌ రాజ్‌ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.

 ‘శ్రీమతి లలిత రెడ్డి’.. అనిల్ రావిపూడి ఇలాంటి టైటిల్ పెడతాడా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus