ఎంటర్ టైన్ చేస్తూనే.. ఆలోజింపజేస్తున్న ఆర్టికల్ 15

దళితుడు గుడిలోకి రావడంతో అతడి కాళ్ళు విరగ్గొట్టిన జనాలు, దళిత కుటుంబానికి చెందిన మైనర్ బాలికపై హత్యాచారం అనే వార్తలు మనం రోజు న్యూస్ పేపర్ లో చదువుతూనే ఉంటాం. మన దేశ లేదా రాష్ట్ర రాజధానుల్లో అలాంటి ఘటనలు చోటు చేసుకొంటే తప్పితే.. ఆ తరహా వార్తలు కనీసం మెయిన్ న్యూస్ పేపర్ లో కూడా రావు. మహా అయితే.. జిల్లా ఎడిషన్ లో ఏదో ఒక మూల మాత్రమే ప్రచురిస్తారు. ఒప్పుకొన్నా ఒప్పుకోకపోయినా ఇదీ మన సమాజంలో ఒక దళిత కులంలో పుట్టిన ప్రాణానికి ఇచ్చే విలువ. బాధాకరంగా ఉన్నా కూడా అది నిజం. ఇలాంటి జాత్యాహంకారం, క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్, కులాల గొడవలు, పరువు హత్యల నేపధ్యంలో ఇప్పటికీ చాలా సినిమాలోచ్చాయి. కానీ.. ఇప్పటివరకూ వచ్చిన ఏ ఒక్క సినిమాలోనూ ఒక కులాన్ని కానీ మతాన్ని లేదా రాజకీయ పార్టీని గురించిన ప్రస్తావన గానీ జరగలేదు.

కానీ.. నిన్న విడుదలైన “ఆర్టికల్ 15” అనే సినిమాలో ఎలాంటి బుజ్జగింపులు లేకుండా సూటిగా సుత్తి లేకుండా ఈ కులాంతర సమతుల్యతను ఎండగట్టాడు దర్శకుడు అనుభవ్ సిన్హా. ఆయుష్మాన్ ఖురానా హీరోగా నటించిన ఈ సినిమా నిన్న విడుదలై మంచి రివ్యూలతోపాటు ప్రేక్షకుల ప్రశంసలు కూడా అందుకొంది. ఈ సినిమాపై అప్పుడే బ్రాహ్మణ సంఘాలు కొన్ని గోల చేస్తున్నప్పటికీ.. సినిమాలో చూపించివని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ కావడంతో సినిమాలో ఆ సన్నివేశాలను కానీ సంభాషణలను కానీ మ్యూట్ చేయడం లేదా డిలీట్ చేసే ఛాన్స్ లేదని దర్శకుడు ఆల్రెడీ క్లారిటీగా చెప్పేశాడు. ఇలాంటి సినిమా తీయాలంటే కథ-కథనం కంటే ధైర్యంగా నిజాన్ని చూపించగల దమ్ము ఉండాలి. మన సమాజంలో ఇలాంటివి ఇంకా జరుగుతున్నాయా అని కొందరు లైట్ తీసుకొన్నా.. ఇప్పటికీ గుజరాత్, బీహార్, తెలంగాణ, ఆంధ్రా, తమిళనాడు, కేరళ ప్రాంతాల్లో ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. సో, “ఆర్టికల్ 15” అనేది మన సమాజానికి కావాల్సిన, అందరూ చూడాల్సిన సినిమా.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus