అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రివ్యూ & రేటింగ్!

  • May 7, 2022 / 10:20 AM IST

సినిమా కంటెంట్ వల్ల కంటే ఇటీవల జరిగిన రచ్చ వల్ల ఎక్కువ హైలైట్ అయిన సినిమా “అశోక వనంలో అర్జున కళ్యాణం’. విశ్వక్ సేన్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కు మంచి స్పందన లభించింది. విశ్వక్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చి పోషించిన పాత్ర ప్రేక్షకులకు ఏమేరకు నచ్చిందో చూద్దాం..!!

కథ:
మూడు పదుల వయసు దాటినా ఇంకా పెళ్లవ్వకుండా ఉండిపోయిన అర్జున్ (విశ్వక్ సేన్)కు ఎట్టకేలకు ఒక సంబంధం సెట్ అవుతుంది. అమ్మాయిని చూడడం కోసం సకుటుంబ సపరివార సమేతంగా తెలంగాణ నుండి ఆంధ్ర వస్తాడు.
కట్ చేస్తే లాక్ డౌన్ వల్ల నిశ్చితార్ధానికి వచ్చిన ఇంట్లోనే బస చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ క్రమంలో తలెత్తిన సమస్యలేమిటి? ఇంతకీ అర్జున్ పెళ్లి ఏమైంది? అనేది సినిమా కథాంశం.


నటీనటుల పనితీరు:
వరుస స్టూడెంట్ క్యారెక్టర్స్ తో కాస్త బోర్ కొట్టించిన విశ్వక్ ఈ చిత్రంలో మధ్య వయస్కుడిగా నటించి తన సత్తా చాటుకున్నాడు. నటుడిగా అతడ్ని మరో మెట్టు ఎక్కించిన సినిమా ఇది. ఇలాంటి విభిన్నమైన కథ, క్యారెక్టర్లు చేసుకుంటూ ముందుకు వెళితే.. విశ్వక్ హీరోగా మంచి స్థాయికి చేరుకోవడం ఖాయం.
ఈ సినిమాలో హీరోయిన్ రుక్సర్ కాదు అని సినిమా చూసిన తర్వాత అర్ధమవుతుంది. ఆమెది కేవలం క్యామియో మాత్రమే. చిన్న పాత్రలోనూ చక్కగా నటించింది ఆమె. అయితే.. మెయిన్ హీరోయిన్ అయిన రితికా నాయక్ మాత్రం అందంతో, అభినయంతో ఆకట్టుకుంది. ఆమె హావభావాల ప్రకటన, ముఖ కవళికలు చూడముచ్చటగా ఉన్నాయి.

సాంకేతికవర్గం పనితీరు:
స్వతహా కెమెరామెన్ అయిన విద్యాసాగర్ చింతా ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. మూల కథను హుందాగా రాసుకున్నప్పటికీ.. స్క్రీన్ ప్లే విషయంలో తడబడ్డాడు. ముఖ్యంగా సెకండాఫ్ లో హీరోయిన్ & హీరోయిన్ క్యారెక్టర్స్ కి జస్టిఫికేషన్ ఎలా ఇవ్వాలో, ఎక్కడ ముగించాలో తెలియక చాలా తికమకపడ్డాడు. ఆ కన్ఫ్యూజన్ ల్యాగ్ లా కనిపిస్తుంది స్క్రీన్ మీద. అలాగే లాక్ డౌన్ అంశం కామెడీగా వర్కవుటవ్వలేదు. లెక్కకుమిక్కిలి క్యారెక్టర్ ఆర్టిస్టులు కనిపించేసరికి సడన్ గా కృష్ణవంశీ సినిమాలు గుర్తొస్తాయి. సదరు సన్నివేశాల్ని ఇంకాస్త సెన్సిబుల్ గా డీల్ చేస్తే బాగుండేది. ఓవరాల్ గా బొటాబోటి మార్కులతో పర్వాలేదనిపించుకున్నాడు విద్యాసాగర్.
పవన్ సినిమాటోగ్రఫీ, జయ్ క్రిష్ సంగీతం కాస్త కొత్తగా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ కంటెంట్ కి తగ్గట్లుగా ఉంది.

విశ్లేషణ:
మరీ ఎక్కువ అంచనాలు లేకుండా ఒకసారి హ్యాపీగా చూడదగిన సినిమా “అశోక వనంలో అర్జున కళ్యాణం”. విశ్వక్ సేన్ నటన & క్యారెక్టరైజేషన్ హైలైట్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కామెడీ, ఎమోషన్స్ ఆడియన్స్ ను అలరిస్తాయి.

రేటింగ్: 2.5/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus