Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్ హాసన్ డ్రీమ్ ప్రాజెక్ట్.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..
- October 7, 2026 / 10:48 PM ISTByFilmy Focus Desk
కమల్ హాసన్ తన కెరీర్‌లో చేసిన ప్రయోగాలు, భుజనాకెత్తుకున్న సినిమాలు ఇండియన్ సినిమాలో ఇంకొకరు చేయలేదు అంటే అతిశయోక్తి కాదు. ఆయన అలా ప్రారంభించిన, అనౌన్స్ చేసిన అన్ని సినిమాలూ విడుదల కాలేదు. ఇదిగో, అదిగో అంటూ ఆ తర్వాత కొన్నిసార్లు మాటలు వినిపించినా.. ప్రాజెక్ట్ అయితే రాలేదు. అలాంటి వాటిలో ‘మరుదనాయగం’ ఒకటి. ఈ సినిమా గురించి ఇప్పుడెందుకు చర్చ అనుకుంటున్నారా?
Atlee
ఈ సినిమా చర్చను ఇప్పుడు బయటకు తీసుకొచ్చింది మేం కాదు. అలా అని కమల్ హాసన్ కూడా కాదు. ప్రస్తుతం ‘రాకా’ అంటూ ప్రపంచం మెచ్చే సినిమా చేయబోతున్న అట్లీ.. ఇటీవల నిర్మాతగా ఓ సినిమా చేశారు. అదే ‘బత్తా’. విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో రూపొందిన ఆ సినిమా కోలీవుడ్‌లో రీసెంట్ బ్లాక్‌బస్టర్. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో అట్లీ మాట్లాడుతూ కమల్ హాసన్ – విజయ్ సేతుపతి ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు.
కమల్ హాసన్, విజయ్ సేతుపతితో సినిమా చేస్తాం అంటున్నారు కదా.. ఇద్దరిలో హీరో ఎవరు అని అడిగితే.. నేను ‘మరుదనాయగం’ సినిమాను తెరకెక్కించాలని అనుకుంటున్నారు. ఈ విషయంలో నాకు ఓ ఆలోచన కూడా ఉంది. విజయ్ సేతుపతి చేసిన సినిమాలు చూస్తే.. అందులో హీరోనా, ఇంకో పాత్రనా అని ఆయన ఎప్పుడూ చూడరు అని అర్థమవుతుంది. ఆయన విషయంలో కథే హీరో అని చెప్పారు అట్లీ.
‘మరుదనాయగం’ సినిమా విషయానికొస్తే.. కమల్ హాసన్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన సినిమా ఇది. 18వ శతాబ్దానికి చెందిన ప్రసిద్ధ యోధుడు, బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ మద్రాస్ ఆర్మీ కమాండెంట్ మహమ్మద్ యూసుఫ్ ఖాన్ అలియాస్ మరుదనాయగం పిళ్లై జీవిత చరిత్ర ఆధారంగా ఈ సినిమాను రూపొందించాలని కమల్ అనుకున్నారు. 1997లో దాదాపు ₹80 కోట్ల భారీ బడ్జెట్‌తో అనుకున్న ఈ సినిమాకు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.
ఈ సినిమా ప్రారంభోత్సవానికి బ్రిటన్ మహారాణి ఎలిజబెత్ II ముఖ్య అతిథిగా విచ్చేశారు. కొంత భాగం షూటింగ్ అయ్యాక 1999లో బడ్జెట్ సమస్యల కారణంగా ఈ ప్రాజెక్ట్ నిలిచిపోయింది. ఇప్పుడు ఈ కథనే ‘రాకా’ను మించిన సినిమాగా తెరకెక్కించాలని అట్లీ అనుకుంటున్నారు. మరి కమల్ హాసన్ ఏమంటారో చూడాలి.













