మేకప్ వేసి ప్యాకప్ చెప్పేవరకు సెట్లో ఉంటే ఓ నటుడి పని అయిపోయినట్టే. రచయిత రాసిన సంభాషణలు దర్శకుడికి నచ్చే రీతిలో చెప్పి బయటపడితే చాలు. పది నిమిషాలు తెరమీద కనపడినా ప్రేక్షకులు గుటుపడతారు. కాసులకు కొదువుండదు. అలాంటిది సినిమా మేకింగ్ చేయాలనుకుంటే మాత్రం పాత్రలు తీర్చి దిద్ది, సంభాషణలు సమకూర్చి, కాగితం మీదున్న దాన్ని తెరమీదికి అనువదించే వరకు దర్శకుడిదే పూర్తి భాద్యత. ఇట్టి క్లిష్టమైన భాధ్యతను చేపట్టి అందరి చేతా శెభాష్ అనిపించుకున్నారు శ్రీనివాస్ అవసరాల.’ఊహలు గుసగుసలాడే’ సినిమాతో సున్నితమైన హాస్యాన్ని పండించి, ‘జ్యో అచ్యుతానంద’ సినిమాలో భావోద్వేగాలను బాగా పలికించి పరిశ్రమకు, ప్రేక్షకులకు అవసరాల అవసరం ఎంతైనా ఉందనిపించారు.
నిశితంగా గమనిస్తే.. ఈ రెండు విజయాల మాటున శ్రీని లోని ప్రతిభావంతమైన రచయిత కనపడతాడు. తాజాగా జరిగిన ఓ పాత్రికేయ సమావేశంలో “మీరు ఇష్టపడేది మీలోని నటుడినా, దర్శకుడినా..?” అన్న ప్రశ్నకు బదులిస్తూ “పైవేవీ కాదన్నట్టు” నాలోని రచయితని అన్నారు. రాసిందీ.. తీసిందీ రెండు సినిమాలే అయినా వాటితోనే తన సమర్థతను తెలియజెప్పారు. సరైన గుర్తింపు ఇస్తే గనక ఇతర దర్శకులతో పని చేయడానికి సిద్ధమే అని ప్రకటించారు. రచయితల కొరత వుందటూ వినిపిస్తోన్న సమస్యకు అవసరాల ఓ పరిష్కారం అని అనిపిస్తోన్న అంతటి విశాల హృదయులైన దర్శకులు ఎంతమంది ఉన్నారన్నది ప్రశ్నార్థకం. మన దర్శకులు రచయితలకిచ్చే విలువేమిటన్న విషయంపై ఉదాహరణగా ఇటీవల ఓ దర్శకుడు తన మనోగతాన్ని బహిర్గతం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.