“ముని” సిరీస్ తరహాలో తమిళంలో పాపులర్ అయిన మరో హారర్ సిరీస్ “ఆరణ్మనై”. ఈ సిరీస్ లో ఇప్పటికే మూడు సినిమాలు రాగా.. అందులో రెండు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. మూడో పార్ట్ మాత్రం సరిగా ఆడలేదు. అయినాసరే.. నటుడు/దర్శకుడు సుందర్.సి (Sundar. C) ఈ సిరీస్ లో నాలుగో భాగాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. గ్లామర్ డాల్స్ తమన్నా (Tamannaah Bhatia) , రాశీఖన్నాల (Raashii Khanna) స్పెషల్ సాంగ్ & హాట్ స్టిల్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి. తమిళంలో “ఆరణ్మనై 4”, తెలుగులో “బాక్”గా ఏకకాలంలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరిస్తుందో చూద్దాం..!!
కథ: శివాని (తమన్నా) ఊహించని విధంగా ఆత్మహత్య చేసుకొని చనిపోతుంది. ఆమె చనిపోయిన కొద్దిరోజులకే ఆమె భర్త కూడా మరణిస్తాడు. తన చెల్లెలు అర్ధాంతరంగా మరణించడం వెనుక ఏదో అంతుబట్టని కారణం ఉందని, దాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికి రంగంలోకి దిగుతాడు లాయర్ శివ శంకర్ (సుందర్.సి). శివ శంకర్ ఇన్వెస్టిగేషన్ లో వెలుగుచూసిన నమ్మలేని నిజాలు ఏమిటి? శివాని ఎందుకని ఆత్మహత్య చేసుకుంది? వంటి ప్రశ్నలకు సమాధానమే “బాక్” చిత్రం.
నటీనటుల పనితీరు: రజనీకాంత్ “అరుణాచలం” దర్శకుడిగా ప్రేక్షకులకు సుపరిచితుడైన సుందర్.సి అడపాదడపా సినిమాల్లో నటిస్తూ కథానాయకుడిగానూ అలరించడానికి చేసే ప్రయత్నం ఇప్పటివరకూ ఫలించలేదు. “బాక్” సినిమాలోనూ అదే రిపీట్ అయ్యింది. శివ శంకర్ పాత్రను వేరే సీనియర్ హీరో లేదా యంగ్ హీరో ఎవరైనా చేసి ఉంటే బాగుండేది.
తమన్నా నటనతో అలరించగా.. రాశీఖన్నా సినిమాకి మంచి గ్లామర్ యాడ్ చేసింది. యోగిబాబు (Yogi Babu) , వెన్నెల కిషోర్ (Vennela Kishore) , శ్రీనివాస్ రెడ్డిల (Srinivasa Reddy) కామెడీ పెద్దగా వర్కవుటవ్వలేదు. ఇంకా చెప్పాలంటే.. వాళ్ళ కామెడీ ట్రాక్ లు సినిమాకి మైనస్ గా నిలిచాయి.
సాంకేతికవర్గం పనితీరు: సినిమాటోగ్రఫీ ఈ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. జంప్ స్కేర్ షాట్స్ & రోబోటిక్ షాట్ టెక్నాలజీని వినియోగించుకున్న తీరు ప్రశంసనీయం. మన సౌత్ ఇండస్ట్రీలో ఒక రెగ్యులర్ హారర్ సినిమాలో ఈస్థాయి టెక్నాలజీని ఎప్పుడూ చూసి ఉండం. అందుకు సినిమాటోగ్రాఫర్ కృష్ణసామి అభినందనీయుడు. హిప్ హాప్ (Hiphop Tamizha) తమిళ నేపధ్య సంగీతం బాగుంది. కొన్ని హారర్ ఎమోషన్స్ ను బాగా ఎలివేట్ చేశాడు. ప్రొడక్షన్ డిజైన్, కలరింగ్, డి.ఐ, సౌండ్ డిజైనింగ్ తదితర అంశాలన్నీట్లో బెస్ట్ అవుట్ పుట్ ఇచ్చారు టెక్నికల్ టీం.
రైటర్ కమ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ సుందర్.సి క్లైమాక్స్ & ఇంటర్వెల్ బ్లాక్స్ ను రాసుకున్న, కంపోజ్ చేసుకున్న విధానం బాగుంది. ఈ రెండు మినహా మిగతా సినిమా మొత్తం ఒక టెంప్లేట్లో చాలా సాదాసీదాగా సాగింది. అందువల్ల మాస్ ఆడియన్స్ ను కూడా పూర్తిస్థాయిలో అలరించలేకపోయిందీ చిత్రం. సో, ఒక దర్శకుడిగా, కథకుడిగా సుందర్.సి ఆకట్టుకోలేకపోయాడనే చెప్పాలి.
విశ్లేషణ: తమన్నా, రాశీఖన్నా గ్లామర్ & సుందర్.సి మార్క్ కామెడీ సీన్స్ ఉంటాయని థియేటర్లకు వచ్చే ప్రేక్షకులు కచ్చితంగా నిరాశచెందుతారు. గ్లామర్, టెక్నికాలిటీస్ తోపాటు కథ-కథనం, సన్నివేశాలను కంపోజ్ చేసే తీరుకు కూడా ప్రాధాన్యత ఇస్తే తప్పితే ఈమధ్యకాలంలో సినిమాను ప్రేక్షకులు ఆదరించడంలేదు. ఈ విషయాన్ని సుందర్.సి ఎంత త్వరగా గ్రహిస్తే అంత మంచిది!
ఫోకస్ పాయింట్: బెంబేలెత్తించిన “బాక్”.
రేటింగ్: 1.5/5