రివ్యూ రైటర్స్ కి బాహుబలి నిర్మాత సూచన

ప్రస్తుతం అన్ని రంగాల్లో వేగం పెరిగింది. ఇలా ఆర్డర్ ఇవ్వగానే అలా వచ్చేయాల్సిందే. లేకుంటే నచ్చదు. ఇదే వేగాన్ని తెలుగు సినీ రివ్యూ రైటర్స్ అందిపుచ్చుకున్నారు. థియేటర్లో సినిమా టైటిల్స్ మొదలవ్వగానే.. రివ్యూ రాయడం మొదలెట్టేస్తున్నారు. ప్రతి సీన్ ని అక్షరాల్లో చూపించేస్తున్నారు. అంతేకాదు సినిమా పూర్తి కాకముందే రివ్యూ పూర్తి చేసి ఔరా అనిపిస్తున్నారు. ఇటువంటి రివ్యూ రైటర్స్ కి బాహుబలి నిర్మాత శోభు యార్లగడ్డ ఓ సలహా ఇచ్చారు. నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ బ్యానర్ పై నిర్మించిన “అ!” మూవీ రేపు థియేటర్లోకి రానుంది. రెజీనా, నిత్యామీనన్, కాజల్ అగ‌ర్వాల్‌, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, ఈషా రెబ్బ, మురళీశర్మ, రోహిణి, దేవదర్శిని, సుకుమారన్ తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ మూవీ ఆది నుంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఈ కథ తెలిసిన చాలామంది సినిమా గొప్పగా ఉంటుందని చెబుతున్నారు. అందువల్లే రవితేజ కూడా వాయిస్ ఓవర్ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. ఇంత క్రేజ్ నెలకొని ఉన్న ఈ చిత్రం గురించి శోభు యార్లగడ్డ ట్వీట్ చేశారు. ”అ! ఒక యూనిక్ సినిమా. తెలుగు సినీ చరిత్రలోనే ఇది ఒక అరుదైన ప్రయత్నం. దయచేసి ఒకసారి ఈ సినిమాను పూర్తిగా చూసి, అర్థం చేసుకుని సరైన రివ్యూ రాయండి. అందరికీ ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్.” అని ట్వీట్ చేయడం ఫిలిం నగర్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దీంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది. మరి రివ్యూ రైటర్లలో ఎంతమంది శోభు కోరికని మన్నిస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus