మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్న ఖైదీ నంబర్ 150 సినిమాపై విమర్శలు పరంపర కొన సాగుతోంది. చిత్రం ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకున్నా, టైటిల్ పాత తరహాలో ఉందని కొంతమంది నెటిజనులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీలో చిరు చెప్పే డైలాగ్ పై ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఆయన సినిమాలో ఫైట్లు, పాటలతో పాటు డైలాగులకు ఎంతో క్రేజ్ ఉంటుంది. మెగాస్టార్ చెప్పే డైలాగ్స్ కోసమే సినిమా చూసే వారు చాలామంది ఉన్నారు.
అందుకే ఆయన ప్రతి సినిమాలో కొత్త మ్యానరిజంతో పవర్ ఫుల్ గా డైలాగ్ వదులుతుంటారు. ఖైదీ నంబర్ 150 లో కూడా ఇటువంటి డైలాగులకు కొదవ ఉండదని భావిస్తున్న అభిమానులకు చిరు పుట్టినరోజు వేడుకల్లో డైరక్టర్ వి.వి. వినాయక్ చెప్పిన డైలాగ్ నిరాశ పరిచింది. ” ఒరేయ్ పొగరు నా ఒంట్లో ఉంటుంది.. హీరోయిజం నా ఇంట్లో ఉంటుంది” అనే డైలాగ్ చిరు విలన్ తో చెబుతాడని, ఇలాంటి పవర్ ఫుల్ డైలాగులు ఎన్నో ఉన్నాయని వివరించారు.
అయితే ఈ డైలాగ్ ఏమంత బాగో లేదని, ఇంట్లో.. ఒంట్లో అనే డైలాగ్స్ బాలకృష్ణ నోటా ఎన్నో సార్లు వినిపించాయని మెగా అభిమానులు చెబుతున్నారు. పరుచూరి బ్రదర్స్ ఇంకా ఆనాటి కాలం లోనే ఉన్నారని, నేటి కాలానికి అప్ గ్రేడ్ కాలేక బాలయ్య డైలాగులనే అటు ఇటు తిప్పి రాసారని విమర్శిస్తున్నారు. సినీ ప్రముఖులు సైతం ఈ డైలాగ్ పై పెదవి విరుస్తున్నారు.