ఉగాది సందర్భంగా నటసింహ నందమూరి బాలకృష్ణ హీరోగా క్రిష్ దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో 100 చిత్రం అనౌన్స్ మెంట్ చేశారు. ఈ సందర్భంగా…
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘’నా వందో సినిమా ఏదై ఉంటుందా అని ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు వందవ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా చేస్తున్నాను. నా 100వ సినిమా చెప్పుకోవడానికి ముందు, నా 99 సినిమాల కృషే నా 100వ సినిమా. అలాగే 99 మైలురాళ్ళు దాటిన 40 ఏళ్ల అనుభవమే ఈ చిత్రం. మన తెలుగు జాతి వారందరూ తెలుసుకోవాల్సిన వ్యక్తి గౌతమీ పుత్ర శాతకర్ణి. భారతదేశానంతటినీ ఏక చత్రాధిపత్యం క్రింద పాలించిన చక్రవర్తి. ఆయన పాత్రలో నేను నటించనుండటం అదృష్టం. నాన్నగారు కూడా ఆరు నెలలు పాటు ఈ స్క్రిప్ట్ పై కూర్చున్నారని నాకు కొత్తగా తెలిసింది. అయితే సినిమాను చేయలేకపోయారు. గౌతమీపుత్ర శాతకర్ణి శాంతి కోసమే యుద్ధం చేశారు. మరాఠి వీరుడు చత్రపతి శివాజీ సహా అందరికీ ఆదర్శవంతంగా నిలిచిచారు. బాలకృష్ణ సినిమాలో ప్రేక్షకులు ఏ ఎలిమెంట్స్ ఉండాలని కోరుకుంటారో ఆ ఎలిమెంట్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. ఇలాంటి చిత్రం చేయడం నా దైవం, మా నాన్నగారు ఆశీర్వాదమే కారణం. ఆయనే సంధాన కర్తగా ఉండటం వల్లే మంచి టీం కలిసి ఈ సినిమా చేస్తున్నాం. మన తెలుగు భాష కోసం ఎంతో కృషి చేశారు. మన దేశంలో 18 కోట్ల మంది తెలుగువారున్నారు. మన తెలుగు గొప్ప భాష, సంస్కృతి. ఈ భాష ఉన్నతికి కృషి చేసిన గౌతమీ పుత్ర శాతకర్ణికి సంబంధించిన సినిమా ఇది. దీనికి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతుంది. యావత్ భారతదేశమే కాదు, ప్రపంచమంతా గర్వపడే సినిమాగా నిలుస్తుంది. అందుకు మా వంతు కృషి చేస్తాం, సాధిస్తాం“ అన్నారు.
చిత్ర దర్శకుడు క్రిష్ మాట్లాడుతూ “బాలకృష్ణగారి 100వ సినిమాకు పనిచేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన నందమూరి బాలకృష్ణగారికి రుణపడి ఉంటాను. ఉగాది సందర్భంగా ఈ సినిమాను గురించి అందరితో పంచుకోవడం సంతోషంగా ఉంది. ఖండఖండాలుగా ఉన్న భారతాన్ని అఖండ భారతావనిగా చేసిన చక్రవర్తి కథతో, ఇప్పటి వరకు ఎవరూ టచ్ చేయని సబ్జెక్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నందుకు చాలా గొప్పగా, గర్వంగా భావిస్తున్నాను“ అని అన్నారు.