టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) 50 ఏళ్ల సినీ కెరీర్‌లో ఎన్నో బ్లాక్‌బస్టర్‌లు అందుకున్నాడు. తనదైన నటనతో అభిమానుల మనసుల్లో ‘బాలయ్య బాబు’గా చిరస్థాయిగా నిలిచాడు. 60 ఏళ్ల వయసులోనూ రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, సినిమాల్లో వరుసగా నటిస్తూ యువ హీరోలకు సైతం పోటీ ఇస్తున్నాడు. ఇటీవల ‘డాకు మహారాజ్’తో (Daaku Maharaaj) ప్రేక్షకులను అలరించిన బాలయ్య, ప్రస్తుతం ‘అఖండ-2’ (Akhanda 2) షూటింగ్‌లో నిమగ్నమై ఉన్నాడు. బాలయ్య రెమ్యునరేషన్ విషయంలో ఎప్పటి నుంచో ఒకే టాక్ వినిపిస్తుంది.
టాలీవుడ్ సీనియర్ హీరోలతో పోలిస్తే తక్కువ పారితోషికం తీసుకుంటాడని, నిర్మాతలకు అనుకూలంగా ఉంటాడని అంటారు. ‘వీరసింహారెడ్డి’ (Veera Simha Reddy) , ‘భగవంత్ కేసరి’ (Bhagavanth Kesari) సినిమాలకు రూ.15-18 కోట్ల మధ్య తీసుకున్నాడని అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే, ఇటీవల వరుస విజయాలతో బాలయ్య తన రెమ్యునరేషన్‌ను భారీగా పెంచినట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అది కూడా మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi) మార్క్ ను టచ్ చేసేలా ఉన్నట్లు తెలుస్తోంది.
‘డాకు మహారాజ్’ కోసం బాలయ్య గత సినిమాలతో పోలిస్తే ఎక్కువ పారితోషికం తీసుకున్నాడని, ‘అఖండ-2’ కోసం రూ.35 కోట్లు అందుకుంటున్నాడని టాక్ వినిపిస్తోంది. అయితే అనిల్ రావిపూడి (Anil Ravipudi) సినిమాకు చిరంజీవి 55 నుంచి 60 కోట్ల మధ్యలో తీసుకుంటున్నట్లు టాక్ వస్తోంది. ఇక నెంబర్ కు దగ్గరగానే బాలయ్య వస్తున్నాడు. ఎందుకంటే గోపీచంద్ మలినేనితో (Gopichand Malineni) చేయబోయే తదుపరి సినిమా కోసం రూ.45 కోట్లు తీసుకుంటున్నాడనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సమాచారం నిజమా కాదా అనేది స్పష్టత రావాల్సి ఉన్నప్పటికీ, బాలయ్య రెమ్యునరేషన్ విషయం హాట్ టాపిక్‌గా మారింది. అఖండ 2 హిట్ అయితే బాలయ్య రెమ్యునరేషన్ మరో పది కోట్లు పెరిగినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఈ వార్తలపై అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. వరుస విజయాలు, బాక్సాఫీస్ వద్ద బాలయ్య సినిమాలు సృష్టిస్తున్న ఊపును దృష్టిలో ఉంచుకుంటే రెమ్యునరేషన్ పెంచడంలో తప్పు లేదని చాలా మంది మద్దతు తెలుపుతున్నారు.