Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • హ‌ర్ష్ రోష‌న్‌ (Hero)
  • శ్రీదేవి (Heroine)
  • సాయికుమార్‌, గోప‌రాజు విజ‌య్, త‌దిత‌రులు (Cast)
  • స‌తీష్ జ‌వ్వాజి (Director)
  • కోన వెంక‌ట్‌ (Producer)
  • విజ‌య్ బుల్గానిన్‌ (Music)
  • సతీష్ ముత్యాల (Cinematography)
  • శివ ముప్పరాజు (Editor)
  • Release Date : 26 మార్చి 2026
  • కోన ఫిల్మ్ కార్పొరేషన్ (Banner)

హీరో నాని నిర్మాత‌గా వ‌చ్చిన కోర్ట్ మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు యువ జంట హ‌ర్ష్ రోష‌న్‌ (Harsh Roshan), శ్రీదేవి (Sridevi). ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మ‌రోసారి వీరిద్ద‌రు హీరోహీరోయిన్లుగా న‌టించిన మూవీ బ్యాండ్ మేళం. స్టార్ రైట‌ర్ కోన వెంక‌ట్ నిర్మాత‌గా రూపొందిన ఈ సినిమాకు స‌తీష్ జ‌వ్వాజి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. బ్యాండుమేళం ప్ర‌మోష‌న్స్‌లో చిరంజీవితో పాటు ప‌లువురు టాలీవుడ్ హీరోలు పాల్గొన‌డం ఈ చిన్న సినిమాపై తెలుగు ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి ఏర్ప‌డింది. గురువారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన‌ బ్యాండుమేళం ఎలా ఉంది? కోర్ట్ త‌ర్వాత మ‌రోసారి హ‌ర్ష్ రోష‌న్‌, శ్రీదేవిల‌కు విజ‌యం ద‌క్కిందా? లేదా? అంటే?

Band Melam Movie Review

కథ: గిరి (హ‌ర్ష్ రోష‌న్‌), రాజీ (శ్రీదేవి) బావ‌మ‌ర‌ద‌ళ్లు. ఒకే రోజు పుడ‌తారు. క‌లిసే పెరుగుతారు. వీరిద్ద‌రికి పెళ్లిచేయాల‌ని చిన్న‌త‌నంలోనే పెద్ద‌లు నిశ్చ‌యిస్తారు. దాన‌ధ‌ర్మాల కార‌ణంగా గిరి తండ్రి సుంద‌ర‌య్య (గోప‌రాజు విజ‌య్‌) ఆస్తి మొత్తం క‌రిగిపోతుంది. అప్పులు తీర్చ‌డానికి ఇంటికి కూడా అమ్మేస్తాడు. రాజీ తండ్రి సాయ‌న్న (సాయికుమార్‌) కోటీశ్వ‌రుడిగా మార‌తాడు. సుంద‌ర‌య్య చేసిన సాయాన్ని మ‌ర్చిపోయి ఆ కుటుంబాన్ని దూరం పెడ‌తాడు సాయ‌న్న‌.

గిరిని క‌ల‌వ‌ద్ద‌ని రాజీకి కండీష‌న్లు పెడ‌తాడు. చ‌దువులో టాప‌ర్ అయిన రాజీ ఇంజినీరింగ్ పూర్తిచేస్తుంది. మ‌రోవైపు టెన్త్ ఫెయిలైన గిరి మాత్రం ఊళ్లో స్నేహితుల‌తో క‌లిసి బ్యాండ్ మేళం న‌డుపుతుంటాడు. చిన్న‌త‌నం నుంచి మ‌ర‌ద‌లిపై పిచ్చి ప్రేమ‌తో ఆమె వెంట తిరుగుతుంటాడు గిరి. కానీ రాజీ మాత్రం అత‌డిని ప‌ట్టించుకోదు. గిరిని కాద‌ని రాజీకి వేరే అబ్బాయితో ఆమె తండ్రి సాయ‌న్న పెళ్లి ఫిక్స్ చేస్తాడు. కానీ ఆ పెళ్లి కొడుకు కాద‌ని రాజీ త‌న క్లాస్‌మేట్‌తో లేచిపోతుంది. రాజీ చేసిన మోసంతో గిరి ఏమ‌య్యాడు? గిరిని కాద‌ని వెళ్లిపోయిన రాజీ తిరిగి అత‌డి ఇంటికే ఎందుకు వ‌చ్చింది? ఫోక్ సింగ‌ర్‌గా పేరు తెచ్చుకోవాల‌నే గిరి ప్ర‌య‌త్నాలు ఫ‌లించాయా? గిరి ప్రేమ‌ను రాజీ అంగీక‌రించిందా? ఆ బావ‌మ‌ర‌ద‌ళ్లు ఒక్క‌ట‌య్యారా? లేదా? అన్న‌దే బ్యాండ్ మేళం క‌థ‌.

నటీనటుల పనితీరు: బావ మ‌ర‌ద‌ళ్లుగా త‌మ కెమిస్ట్రీతో కోర్ట్ మూవీ ఫేమ్ హ‌ర్ష్ రోష‌న్‌, శ్రీదేవి ఆక‌ట్టుకున్నారు. హ‌ర్ష్ రోష‌న్ ఎన‌ర్జిటిక్ యాక్టింగ్‌, డ్యాన్సుల‌తో అద‌ర‌గొట్టాడు. సెటిల్డ్ యాక్టింగ్‌తో శ్రీదేవి మెప్పించింది. హీరోయిన్ తండ్రిగా సాయికుమార్‌, హీరో తండ్రిగా గోప‌రాజు విజ‌య్ త‌మ అనుభ‌వంతో పాత్ర‌ల్లో ఒదిగిపోయారు. హీరో ఫ్రెండ్స్ గ్యాంగ్స్ అంద‌రూ కొత్త‌వారే. కెమెరా ఫియ‌ర్ లేకుండా న‌టించారు.

సాంకేతికవర్గం పనితీరు: టెక్నిక‌ల్‌గా విజ‌య్ బుల్గానిక్ మ్యూజిక్‌, బీజీఎమ్ ఈ సినిమాకు కొంత వ‌ర‌కు హెల్ప‌య్యాయి. ఫోక్ స్టైల్‌లో అత‌డు కంపోజ్ చేసిన పాట‌లు ప‌ర్వాలేద‌నిపించాయి. చిన్న సినిమానే అయినా మేకింగ్ విష‌యంలో కోన వెంక‌ట్ రాజీప‌డ‌లేదు. ర‌చ‌యిత‌గానే కాకుండా ద‌ర్శ‌కుడిగా స‌తీష్ జ‌వ్వాజి టేకింగ్‌, మేకింగ్‌లో మెరుపులు లేవు.

విశ్లేష‌ణ‌: టీనేజ్ ప్రేమ‌క‌థ‌ల్లో ఓ మ్యాజిక్ ఉంటుంది. ప్రేమికుల మ‌ధ్య ఉండే అల‌క‌లు, అల్ల‌ర్లు, రొమాన్స్ మాత్ర‌మే కాకుండా స్నేహం, కెరీర్‌, త‌ల్లిదండ్రుల అనుబంధం లాంటి అంశాల‌తో ఈ సినిమాలు సాగుతుంటాయి.

ఈ ల‌వ్‌స్టోరీస్ మంచి ఎమోష‌న్స్‌తో బోర్ కొట్ట‌కుండా చెప్ప‌గ‌లిగే నేర్పు ద‌ర్శ‌కుడికి ఉండాలి. క‌థ‌తో కంటే క‌థ‌నంతోనే జిమ్మిక్కులు చేయాలి. రొటీన్ అనే భావ‌న ఆడియెన్స్ మ‌న‌సులో క‌ల‌గ‌కుండా చెప్ప‌గ‌లిగిన‌ప్పుడే ఈ యూత్‌ఫుల్ ల‌వ్‌స్టోరీస్‌ మెప్పిస్తుంటాయి. బ్యాండ్ మేళంతో రైట‌ర్ కోన వెంక‌ట్‌తో పాటు డైరెక్ట‌ర్ స‌తీష్ జ‌వ్వాజి అదే రూటును ఫాలో అవ్వాల‌ని అనుకున్నారు. కానీ వారి ప్ర‌య‌త్నం పూర్తిగా బెడిసికొట్టింది.

బ్లాక్ అండ్ వైట్ కాలం క‌థ‌…

బ్యాండ్ మేళం క‌థ‌లోనే కాదు… టేకింగ్‌లోనూ అన్ని పాత‌వాస‌న‌ల‌తోనే న‌డిపోయింది. కొత్త‌ద‌నం అన్న‌ది మ‌చ్చుకైనా సినిమాలో క‌నిపించ‌దు. జులాయిగా తిరిగే బావ‌…కోటీశ్వరురాలైన మ‌ర‌ద‌లు…వారి ప్రేమ‌కు ఆస్తిపాస్తులు అడ్డుగోడ‌లుగా నిల‌వ‌డం అనే పాయింట్‌తో బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఎన్నో సినిమాలు వ‌చ్చాయి. అరిగిపోయిన కాన్సెప్ట్‌ను ఎంచుకోవ‌డంలోనే మేక‌ర్స్ త‌ప్ప‌ట‌డుగులు వేశారు. పోనీ ఈ ల‌వ్‌స్టోరీని అయినా కొత్త‌గా తీశారా అంటే అదీ లేదు. హీరోహీరోయిన్లు ఎందుకు విడిపోయారో అర్థం కాదు. హీరో ప్రేమ‌లో డెప్త్ ఎమోష‌న్స్‌, సీరియ‌స్‌నెస్ క‌నిపించ‌వు. వారిద్ద‌రూ కల‌వ‌డానికి దారితీసిన ప‌రిస్థితులు సిల్లీగా ఉంటాయి. కామెడీ పేరుతో హీరో అండ్ బ్యాచ్ చేసే హంగామా న‌వ్వించ‌క‌పోగా చిరాకును తెప్పిస్తుంది.

హీరోహీరోయిన్ల చైల్డ్‌హుడ్ ఎపిసోడ్స్‌తోనే ఈ సినిమా మొద‌ల‌వుతుంది. ఆస్తి అంత‌రాల కార‌ణంగా ఇద్ద‌రూ దూర‌మ‌వ్వ‌డం, బ్యాండ్ మేళం బ్యాచ్‌తో హీరో చేసే అల్ల‌రి ప‌నుల‌తో ఫ‌స్ట్ హాఫ్ టైమ్‌పాస్‌గా సాగుతుంది. హీరోయిన్ పాత్ర‌కు సంబంధించి ఇంట‌ర్వెల్ టైమ్‌లో వ‌చ్చే ట్విస్ట్‌తో సెకండాఫ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు డైరెక్ట‌ర్‌. కానీ సెకండాఫ్‌లోనూ ప్రేమ‌క‌థ ఎంత‌కు ముందుక క‌ద‌ల‌దు. ఒకే పాయింట్ చుట్టూ క్లైమాక్స్ వ‌ర‌కు సాగ‌దీశారు. చివ‌ర‌లో ప్రెడిక్ట‌బుల్ ట్విస్ట్‌తో ఎండ్ చేయ‌డం క‌న్వీన్సింగ్‌గా అనిపించ‌దు. బ్యాండు మేళం టైటిల్‌కు ఈ సినిమా క‌థ‌కు ఏ మాత్రం సంబంధం లేన‌ట్లుగా అనిపిస్తుంది.

తెలంగాణ నేటివిటీ ఈ సినిమాకు కొంత వ‌ర‌కు ఫ్రెష్‌నెస్‌ను తీసుకొచ్చింది. తెలంగాణ యాస‌లో సాగిన డైలాగ్స్‌, ఫోక్ సాంగ్స్ రిలీఫ్‌గా నిలిచాయి. ఇంకాస్త రా అండ్ ర‌స్టిక్‌గా తీసుకుంటే బాగుండేది.

ఫోకస్ పాయింట్: బ్యాండ్ మేళం (Band Melam) ఔట్‌డేటెడ్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన టీనేజ్‌ ల‌వ్‌స్టోరీ. టైటిల్‌లో ఉన్న క్రియేటివిటీ సినిమాలో లేదు.

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus