Vivek Athreya: ఇబ్బందిపెడుతున్న గతం… మొన్న విజయ్‌.. ఇప్పుడు వివేక్‌ ఆత్రేయ.. నెక్స్ట్‌ ఎవరు?

అప్పుడెప్పుడో సోషల్‌ మీడియాలో రాసిన ఓ పోస్టు.. ఇప్పుడు ఇబ్బంది పెడితే.. ఈ బాధ ఎలా ఉంటుందో సోషల్‌ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికీ తెలుసు. ఈ ఇబ్బంది సినిమా సెలబ్రిటీలకు కూడా ఉంది. సినిమాల్లోకి రాక ముందు ఎవరి గురించో, ఏ విషయం గురించో రాసిన పోస్టును ఇప్పుడు బయటకు తీసి.. వైరల్‌ చేస్తుంటారు నెటిజన్లు. అలా ఇప్పుడు ఇబ్బంది పడుతున్నారు యువ దర్శకుడు వివేక్‌ ఆత్రేయ.

Vivek Athreya

‘మెంటల్ మదిలో’, ‘బ్రోచేవారెవరురా’, ‘అంటే సుందరానికి’, ‘సరిపోదా శనివారం’ అంటూ వరుసగా హిట్‌ సినిమాలు చేస్తూ వస్తన్న వివేక్‌.. సినిమా రంగంలోకి రావడానికి ముందు సగటు సినీ అభిమానిగా కొన్ని సినిమాలు, కొంతమంది దర్శకుల మీద పెట్టిన పోస్టులు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. అప్పట్లో దర్శకుడు మెహర్‌ రమేశ్‌ గురించి వివేక్‌ రాసిన ఓ ఎఫ్‌బీ పోస్టు ఇప్పుడు బయటకు వచ్చింది. అందులో కాస్త ఘాటుగానే (సగటు సినిమా అభిమానిగా) రాసుకొచ్చారు వివేక్‌.

ఇవే కాదు.. అప్పట్లో వచ్చిన ఎన్టీఆర్‌ ‘బృందావనం’ సినిమా గురించి, మహేష్‌ బాబు ‘ఖలేజా’ సినిమా గురించి వివేక్‌ రాసిన రాతలు ఇప్పుడు ఆశ్చర్యం కలిగించాయి. బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కొట్టి ‘బృందావనం’ ఆయనకు అప్పట్లో నచ్చలేదు. ఇబ్బందికర ఫలితం అందుకున్న ‘ఖలేజా’ సినిమా వివేక్‌కి నచ్చడం గమనార్హం. దీంతో తర్వాత సినిమాల్లోకి వద్దాం అనుకునేవారు ఇప్పుడు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడితే ఎంత జాగ్రత్తగా ఉండాలో అర్థమవుతోంది.

అన్నట్లు ఆ మధ్య దర్శకుడు విజయ్‌ కనకమేడల కూడా ఇలాంటి ఇబ్బందే పడ్డారు. ‘నాంది’, ‘ఉగ్రం’ సినిమాలు చేసిన ఆయన ‘భైరవం’ సినిమా ప్రచారంలో ఉన్నప్పుడు అప్పుడెప్పుడో ఏళ్ల క్రితం చేసిన కొన్ని రాజకీయ వ్యాఖ్యలు బయటకు వచ్చాయి. దాంతో ఆయన వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు వివేక్ ఆత్రేయ ఎలా రియాక్ట్‌ అవుతారు అనేది ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా ఈ సోషల్‌ మీడియా లొల్లి.. సిల్లీగా ఉన్నా పెద్ద ఇబ్బందే పెడుతోంది.

అనుకున్నదే జరుగుతోంది.. ఈసారి నెపం VFX టీమ్‌ మీద..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus