నిన్న ‘K-RAMP’ సక్సెస్ మీట్లో బండ్ల గణేష్ స్పీచ్ సంచలనమైంది. అతను మాట్లాడుతూ.. ‘సినిమా ఇండస్ట్రీలో వార్నింగ్..లు ఇస్తే వర్కౌట్ కావు. రిక్వెస్ట్..లు ఇస్తేనే వర్కౌట్ అవుతాయి’ అంటూ నిర్మాత రాజేష్ దండకి సూచించారు. ఇటీవల ఆయన ఓ వెబ్ సైట్ పై మండిపడుతూ ట్వీట్లు వేసిన సంగతి తెలిసిందే. మరోపక్క హీరో కిరణ్ అబ్బవరం గురించి మాట్లాడుతూ.. ‘మీ మనసుకి నచ్చిన పని చేయండి. మా అమ్మ ఉద్యోగం చేయమంది.. మా నాన్న ఇంకోటి చేయమన్నాడు అది కాదు.
మీ మనసుకి నచ్చింది నిజాయితీగా చేయండి. హీరో కిరణ్ రెడ్డి అబ్బవరం అలాగే ఓ చిన్న కుటుంబం నుండి వచ్చాడు. హిట్లు మీద హిట్లు కొడుతున్నాడు.ఇతన్ని చూస్తుంటే కెరీర్ ప్రారంభంలో చిరంజీవి గారు గుర్తుకొస్తున్నారు. 150 సినిమాలు తీసి కూడా రేపో మాపో భారతరత్న అందుకుంటూ కూడా ఆయన ఎంత సౌమ్యంగా ఉంటారో.. అలాగే కిరణ్ అబ్బవరం కూడా మసులుకుంటున్నాడు.
ఒక హిట్టు పడంగానే ‘వాట్సాప్ వాట్సాప్’ అంటూ స్టేజిమీద రెచ్చిపోయి తిరగడం లేదు. ఒక్క సినిమా హిట్టు కొడితే లోకేష్ కనగరాజ్ ని తీసుకురా, రాజమౌళిని తీసుకురా, సుకుమార్ ని తీసుకురా, అనిల్ రావిపూడిని తీసుకురా అంటూ ఇతను తిరగడం లేదు. ఇతని చేసిన దర్శకులంతా కొత్తవాళ్లే. మీరు కొత్తవాళ్ళకి అవకాశం ఇవ్వండి. మీరు ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో మీరు కొత్తవాళ్లు అని చూడకుండా అవకాశాలు ఇచ్చినప్పుడు మీరు ఎందుకు కొత్తవాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు.
ఆస్తి వారసత్వంగా ఇవ్వొచ్చు, అంతస్తులు వారసత్వంగా ఇవ్వొచ్చు.. కానీ తెలివి ఎవ్వరూ వారసత్వంగా ఇవ్వలేరు.. ఈ ప్రపంచంలో ఎవ్వరూ సక్సెస్ వారసత్వంగా ఇవ్వలేరు. నేను వెయ్యి కోట్లు ఇస్తాను ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ ఇవ్వండి నాకు. మన కష్టం, దేవుడి దయ ఉంటే సక్సెస్ వస్తుంది. ‘వాట్సాప్ వాట్సాప్’ అంటే రాదు’ అంటూ బండ్ల గణేష్ చెప్పుకొచ్చారు.
బండ్ల గణేష్ కామెంట్స్ ను కరెక్ట్ గా గమనిస్తే.. ‘వాట్సాప్ వాట్సాప్ అంటూ స్టేజిపై సందడి చేసేది విజయ్ దేవరకొండనే. లూజ్ ఫాంట్లు వంటివి వేసుకుని అతను ‘లైగర్’ సినిమా ప్రమోషన్స్ టైంలో అతని హడావిడి చేశాడు.
అయితే గతంలో విజయ్ దేవరకొండ గురించి బండ్ల గణేష్ పాజిటివ్ కామెంట్స్ చేశారు. అతని తండ్రి గోవర్ధన్ అతనికి మంచి స్నేహితుడని, విజయ్ దేవరకొండ ఎదుగుదలని గర్వాంగా ఫీలవుతున్నాను అంటూ బండ్ల గణేష్ చెప్పడం జరిగింది. మరి ఇప్పుడెందుకు అతనికి చురకలు అంటించినట్టు. బహుశా తన నిర్మాణంలో సినిమా చేయమని విజయ్ దేవరకొండని బండ్ల గణేష్ అడిగాడేమో. అతను ఒప్పుకోలేదేమో. అందుకే బండ్ల గణేష్ ఇలా బయటపడి ఉండొచ్చు.