బేతాళుడు

తమిళంలో మాస్ మ్యూజిక్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న విజయ్ అంటోనీ ఇటీవలే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ‘బిచ్చగాడు’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితుడయ్యాడు. చిన్న సినిమాగా విడుదలైన ‘బిచ్చగాడు’ సినిమా తెలుగులో స్టార్ హీరోల సినిమాలతో పోటీ పడి కలెక్షన్ల మోత మోగించింది. ఈ సినిమా తర్వాత విజయ్ అంటోనీ నటించిన తాజా చిత్రం ‘బేతాళుడు’. తెలుగు, తమిళం భాషలలో ఏకకాలంలో రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరి ఈ ‘బేతాళుడు’ ఎలా ఉన్నాడు? ప్రేక్షకులను ఎలా అలరించాడో చూద్దామా!

కథ : దినేష్(విజయ్ అంటోనీ) ఒక ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా పనిచేస్తుంటాడు. అతని భార్య ఐశ్వర్య(అరుంధతి నాయర్). దినేష్ కు తన అంతరాత్మ(బేతల) ఎప్పుడు కూడా ఆత్మహత్య చేసుకోమని ఆర్డర్స్ వేస్తూ ఉంటుంది. అలా కొన్నిసార్లు దినేష్ ఆత్మహత్య ప్రయత్నం చేస్తుంటే అతని స్నేహితుడు కాపాడుతాడు. దీంతో ఈ విషయం గురించి తెలుసుకోవడానికి సైకాలజిస్ట్(కిట్టి)ని కలుస్తాడు దినేష్. ఈ క్రమంలో అతనికి తన గతజన్మ గురించి కాస్త తెలుస్తుంది. కానీ గతజన్మకు సంబంధించిన స్టొరీలోని జయలక్ష్మి,
శర్మ మరియు అతని కొడుకు గురించి తెలుసుకోవడానికి బయలుదేరుతాడు. అక్కడి నుంచి అసలు కథ మొదలవుతుంది. అసలు ఈ ముగ్గురు ఎవరు? దినేష్ అంతరాత్మ(బేతల) ఎందుకు చంపాలని అనుకుంటుంది? ఆ ముగ్గురికి దినేష్ కు ఉన్న సంబంధం ఏంటి? ఈ విషయాలు తెలుసుకునే క్రమంలో దినేష్ కు ఎదురైన పరిస్థితులు ఏంటి? చివరకు ఏం జరిగింది అనేది మిగతా కథ.

నటీనటుల పనితీరు : విజయ్ అంటోనీ ‘బేతాళుడు’తో తనలోని కొత్త నటుడిని పరిచయం చేసాడు. ఇందులో విజయ్ అంటోనీ తన నటనతో అదరగొట్టాడు. రెండు విభిన్న పాత్రలలో నటించి ఆద్యంతం అలరించాడు. హీరోయిన్ గా నటించిన అరుంధతి నాయర్ తన పాత్రకు పూర్తి న్యాయం చేసింది. రెండు విభిన్న షేడ్స్ ను అధ్బుతంగా ప్రదర్శించింది. విజయ్-అరుంధతి నాయర్ ల మధ్య కెమిస్ట్రీ బాగుంది.
విజయ్ అంటోనీ బాస్ పాత్రలో వై.జి.మహేంద్ర, సైకాలజిస్ట్ పాత్రలో కిట్టి చక్కగా నటించారు. ఇక విజయ్ అంటోనీ స్నేహితుడుగా నటించిన వ్యక్తి నటన బాగుంది. అంతేకాకుండా ఈ సినిమాలో నటించిన దాదాపు అందరూ కూడా వారి వారి పాత్రలకు పూర్తి న్యాయం చేసారు.

సాంకేతికవర్గం పనితీరు : “భేతాళుడిగా” చక్కగా నటించడమే కాకుండా సినిమాకు మంచి సంగీతం కూడా అందించాడు విజయ్ అంటోనీ రీరికార్డింగ్ సినిమాకు ప్రాణం పోసిందని చెప్పుకోవచ్చు. మ్యూజిక్ ఒక్కో మూడ్ ను హైలెట్ అయ్యేలా చేసింది. ఇక ప్రదీప్ కలిపురయత్ సినిమాటోగ్రఫీ సూపర్బ్. రెండు పాత్రల వేరియేషన్స్ ను బాగా చూపించారు. అయితే.. గ్రాఫిక్ వర్క్ బాగోలేదు. లైటింగ్ ఎఫెక్ట్ కూడా సీన్ తో సింక్ అవ్వలేదు.

దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తి కథ విషయంలో మెయింటైన్ చేసిన క్లారిటీ కథనంలో చూపలేదు. చాలా ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వదిలేశాడు. కొన్ని ప్రశ్నలకు సమాధానాలు పూర్తిగా తెలుసుకొనే ఓపిక ప్రేక్షకులకు ఉన్నప్పటికీ.. ఉన్నట్లుండి 2.04 గంటలకే సినిమాను ముగించిన విధానం దర్శకుడిగా అతడి ప్రతిభను నిదర్శనం.

విశ్లేషణ : చిక్కుముడులు వేయడం చాలా సులభం, కానీ అవే చిక్కుముడులను ఓపిగ్గా విప్పడం అంతే కష్టం. “భేతాళుడు” విషయంలో జరిగిన తప్పు అదే.. అప్పటివరకూ “ఏదో ఉంది” అని ప్రేక్షకుడిలో లేనిపోని ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేసిన దర్శకుడు చివారికొచ్చేసరికి చేతులెత్తేశాడు. అందువల్ల ఏదో చెప్పాలనుకొని ఏదీ చెప్పలేని చిత్రంగా “భేతాళుడు” మిగిలిపోయింది.

రేటింగ్ : 1.5/5

Click Here For TELUGU Review

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus