Bhola Shankar Review in Telugu: భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • చిరంజీవి (Hero)
  • తమన్నా, కీర్తిసురేష్ (Heroine)
  • తరుణ్ అరోరా, రవిశంకర్, వెన్నెల కిషోర్ తదితరులు.. (Cast)
  • మెహర్ రమేష్ (Director)
  • రామబ్రహ్మం సుంకర - కె.ఎస్.రామారావు (Producer)
  • మహతి స్వరసాగర్ (Music)
  • డూడ్లీ (Cinematography)
  • Release Date : ఆగస్ట్ 11, 2023

“వాల్తేరు వీరయ్య” లాంటి కమర్షియల్ బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవి నటించగా విడుదలైన సినిమా “భోళా శంకర్”. మెహర్ రమేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంపై కనీస స్థాయి అంచనాలు లేవు. ముఖ్యంగా విడుదలైన పాటలు, ట్రైలర్ సినిమాకి ఏమాత్రం హెల్ప్ అవ్వలేకపోయాయి. చిరంజీవి మరియు తెలుగు సినిమా అభిమానుల మీద పూర్తి భారం వేసి ఈరోజు విడుదల చేస్తున్న ఈ తమిళ రీమేక్ మనోళ్లని ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి !!

కథ: కలకత్తాకి తన చెల్లెలు మహాలక్ష్మి (కీర్తిసురేష్) చదువు కోసం షిఫ్ట్ అయ్యి.. ఉపాధి కోసం ట్యాక్సీ నడిపే ఓ మధ్య తరగతి వ్యక్తి శంకర్ (చిరంజీవి). చాలా సరదాగా ఆటపాటలతో సాగుతున్న వాళ్ళ జీవితాల్లోకి కొందరు విలన్లు ఎంటర్ అవుతారు. ఎవరు వాళ్ళు? శంకర్ ను ఎందుకు టార్గెట్ చేస్తారు? వాళ్ళ నుండి తనను, తన చెల్లెల్ని ఎలా కాపాడుకొన్నాడు? అనేది “భోళా శంకర్” కథాంశం.

నటీనటుల పనితీరు: చిరంజీవి కనిపించడానికి ఎంత యంగ్ గా ఉన్నా.. ఆయన వ్యవహారశైలిలో వయసు తెలిసిపోతుంది. ముఖ్యంగా విగ్ ఈ సినిమాలో అస్సలు సెట్ అవ్వలేదు. ఎమోషనల్ సీన్స్ లో తనకు పోటీ ఎవరు అనే స్థాయిలో చెలరేగిపోయాడు చిరు. అలాగే యాక్షన్ బ్లాక్స్ లో చిరు బాడీ లాంగ్వేజ్ & ఆయన కళ్ళల్లో కనిపించే క్రోధం తెరపై చూడడానికి భలే ఉంటుంది. ఇక ఆయన కామెడీ టైమింగ్ బాగున్నా.. ఆయన కాంబినేషన్ లో ఇతర కామెడియన్లకు రాసిన కామెడీ సీన్లు అస్సలు పేలలేదు.

చెల్లెలిగా కీర్తిసురేష్ నటిగా ఆకట్టుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. తమిళంలో నటించిన లక్ష్మీమీనన్ అమాయకత్వాన్ని మాత్రం బీట్ చేయలేకపోయింది. తమన్నా మాత్రం తనకు దొరికిన చిన్న పాత్రలో ఆకట్టుకోవడానికి కాస్త గట్టిగానే ప్రయత్నించింది. ఇక జబర్దస్త్ బ్యాచ్ అందరూ కలిసి చేసిన కామెడీ మాత్రం ఎక్కడా వర్కవుటవ్వలేదు. తరుణ అరోరా, షావర్ అలీ తదితరులు విలనిజాన్ని పండించిన చేసిన ఓవర్ యాక్షన్ కాస్తా కామెడీ అయిపోయింది.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడిగా మెహర్ రమేష్ స్టైలిష్ యాక్షన్ బ్లాక్స్ వరకూ పర్లేదు కానీ.. కామెడీ కానీ, ఎమోషన్ కానీ సరిగా హ్యాండిల్ చేయలేడు అనే విషయం మరోమారు స్పష్టమైంది. అద్భుతమైన అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్ సీన్స్ కి ఎంతో స్కోప్ ఉన్న కథను అటు ఎలివేషన్ కి వాడుకోలేక, ఇటు ఎమోషనల్ గా అలరించలేక చాలా ఇబ్బందిపడి.. ఆడియన్స్ ను కూడా ఇబ్బందిపెట్టాడు. సెకండాఫ్ లో వచ్చే యాక్షన్ బ్లాక్ తప్పితే సినిమా మొత్తంలో మెహర్ మార్క్ సీన్ కానీ ఎపిసోడ్ కానీ ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. అలాగే శ్రీముఖి కాంబినేషన్ లో తీసిన కుళ్ళు కామెడీ & చిరుతో మాట్లాడించిన తెలంగాణ యాస అస్సలు బాలేవు. ఓవరాల్ గా చెప్పాలంటే మరోమారు దర్శకుడిగా మెహర్ రమేష్ విఫలమయ్యాడనే చెప్పాలి.

ఒక సినిమాకి నేపధ్య సంగీతం ఎంత ముఖ్యం అనే విషయం నిన్న విడుదలైన “జైలర్”తో అందరికీ స్పష్టమైంది. సినిమాలో కంటెంట్ సోసోగా ఉన్నా.. అనిరుధ్ సదరు సన్నివేశాలను తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ఎలివేట్ చేసిన విధానం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ గా మారింది. కానీ.. ఇవాళ “భోళా శంకర్”లో పాటలు కానీ నేపధ్య సంగీతం కానీ సినిమాకి కనీస స్థాయి హై ఇవ్వలేకపోయింది. కనీసం చిరంజీవి సీన్స్ కి కూడా అసరైన ఎలివేషన్ బీజీయమ్ ఇవ్వలేకపోయిన మహతి.. ఈ సినిమాకి రాంగ్ ఛాయిస్ గా మిగిలిపోయాడు.

డూడ్లీ సినిమాటోగ్రఫీ వర్క్ సోసోగానే ఉంది. ఎక్కడా కూడా ఆహా అనిపించే ఫ్రేమ్స్ కానీ కెమెరా బ్లాక్స్ కానీ లేవు. ప్రొడక్షన్ డిజైన్ పరంగా మేకర్స్ కాస్ట్ కటింగ్ కోసం పడిన శ్రమ ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. చిరంజీవి స్థాయి సినిమాకి ఆర్ట్ వర్క్ కానీ సెట్ వర్క్ కానీ చాలా చీప్ గా ఉన్నాయి. అలాగే.. సీజీ వర్క్ కూడా ఎబ్బెట్టుగా ఉంది. ఇక కలకత్తా అని చెప్పి హైద్రాబాద్ లో చీట్ షూట్ చేసి ఆడియన్స్ ను చీట్ చేయాలనుకున్న తీరు శోచనీయం .

విశ్లేషణ: డైహార్డ్ చిరంజీవి వీరాభిమానులైతే తప్ప “భోళా శంకర్”ను రెండున్నర గంటలపాటు థియేటర్ లో ఆస్వాదించడం కష్టమే. మెహర్ రమేష్ తనకు లభించిన సువర్ణావకాశాన్ని సరిగా వినియోగించుకోలేకపోయాడు. తెలుగు సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే తప్ప నిన్న విడుదలైన జైలర్ మేనియా ముందు భోళా మేనియా నిలదొక్కుకోవడం కాస్త కష్టమే.

రేటింగ్: 2/5

Rating

2
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus