భారత ప్రభుత్వం శుక్రవారం 65వ జాతీయ చలన చిత్ర అవార్డులను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇందులో తెలుగు సినిమాలు ఘాజి, బాహుబలి 2 కి అవార్డులు వరించాయి. అలాగే ఉత్తమ నటిగా శ్రీదేవికి అవార్డు వచ్చింది. టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా శ్రీదేవి 300 లకు పైగా సినిమాలు చేశారు. ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నారు. కానీ ఆమె మరణించిన తర్వాత కూడా ఆమెను అవార్డుతో ప్రభుత్వం గౌరవించింది. మామ్ సినిమాలో ఆమె నటనకుగాను ఈ అవార్డును ప్రకటించింది. శ్రీదేవి ఆఖరి సినిమా మామ్ కావడం విశేషం. శ్రీదేవికి అవార్డు రావడంపై కపూర్ ఫ్యామిలీ స్పందించింది.
బోనీ కపూర్, జాన్వి, ఖుషిలు సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. ”మామ్ సినిమాలో శ్రీదేవి నటనకు ఉత్తమ నటి అవార్డు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఇదొక ప్రత్యేకమైన సందర్భం. ఆమె 300లకు పైగా చిత్రాల్లో నటించడమే కాకుండా ప్రతి సినిమాలోనూ ఆమె అభినందనలు అందుకుంది. ఆమె సూపర్ నటి మాత్రమే కాదు.. సూపర్ వైఫ్, సూపర్ మామ్. ఆమె లైఫ్.. ఆమె సాధించిన అచీవ్‌మెంట్స్‌ను సెలబ్రేట్ చేసుకోవడానికి ఇదే మంచి సమయం. నేడు ఆమె మాతో లేదు. కానీ ఆమె వారసత్వం జీవించే ఉంది. ఈ గౌరవాన్ని మాకు ఇచ్చినందుకు భారత ప్రభుత్వానికి, గౌరవనీయులైన జ్యూరీ సభ్యులకు కృతజ్ఞతలు” అని బోనీ, ఖుషీ, జాన్వి ప్రకటనలో తెలిపారు. ఈ అవార్డు రావడంపై శ్రీదేవి అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేశారు.