మెగాఫోన్ పట్టనున్న బ్రహ్మానందం

దాదాపు పదహారొందల పైచిలుకు చిత్రాల్లో నటించి గిన్నిస్ రికార్డ్ సైతం అందుకున్నారు బ్రహ్మానందం. దానికి మించి ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకున్నారు. బ్రహ్మీ తెరపై కనపడితే నవ్వే వాళ్ళున్నారంటే నమ్మి తీరాల్సిందే. ఇదివరకు ఈ టాప్ కమిడియన్ లేని సినిమాలు వేళ్ళ మీద లెక్కపెట్టేవారు. ఇప్పుడు అది కాస్త రివర్స్ అయ్యి ఆయన ఉన్న సినిమాలు లెక్కపెట్టే పరిస్థితి. అయితే త్వరలో కెప్టెన్ కుర్చీలో కూర్చోనున్నారంటూ బ్రహ్మానందం గురించి కొత్త కబురొకటి ఫిల్మ్ నగర్ లో హల్చల్ చేస్తోంది.

తెలుగు సినిమాలోకి రాకమునుపు తెలుగు అధ్యాపకుడిగా పనిచేసిన బ్రహ్మానందం సుమారు మూడు దశాబ్దాలపాటు చిత్రసీమలో ఉన్నారు. తనతోటి వారు అప్పుడో ఇప్పుడో పెన్, మెగాఫోన్ పట్టినా ఆయన మాత్రం ఇన్నాళ్లు వాటికి దూరంగానే ఉన్నారు. అవకాశాలు తగ్గటమో లేక ముందే నిశ్చయించుకున్నారో గానీ బ్రహ్మీ మెగాఫోన్ పట్టేందుకు సిద్ధమయ్యారట. ఆయన మితృలు నిర్మించనున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి చేరనుందని సమాచారం. కాగా ఈ సినిమాలో బ్రాహ్మితో హాట్ యాంకర్స్ కమ్ యాక్టర్స్ రేష్మి, అనసూయలు నటించనున్నారట. దీంతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus