సెలెబ్రిటీల భార్యలు.. తమ అత్తల గురించి ఏమన్నారంటే..?

  • October 29, 2019 / 04:55 PM IST

అత్త కోడళ్ళు అంటే… ఎప్పుడు చూసినా ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు.. గొడవలు పెట్టుకుంటూ ఉంటారు.. అని అంతా అనుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా ఒక్కప్పటి రోజుల్లో..! ఇపుడు అలా లేరు లెండి..! కోడళ్ళు తమ అత్తను కూడా అమ్మలా చూసుకుంటూ మెట్టినిల్లుని కూడా పుట్టిల్లుకులా చేసేసుకుంటుంటారు. అసలు ఇదంతా ఎందుకు చెబుతున్నాను అనేగా మీ డౌట్? ఏమీ లేదండీ… ఈరోజు ‘అత్తగార్ల దినోత్సవం’ కాబట్టి కొంత మంది సెలెబ్రిటీల ‘అత్త- కోడళ్ళ’ బంధం గురించి కోడళ్ళు ఏమన్నారో తెలుసుకుందాం రండి.

ఘట్టమనేని నమ్రత

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ భార్య నమ్రత తన అత్త ఇందిరా దేవి గురించి మాట్లాడుతూ.. “మహేష్ తో పెళ్ళై నప్పుడు నటిగా ఫామ్లోనే ఉన్నాను. సినిమాల్లో నటించాలా లేక ఇంటికే పరిమితం కావాలా అన్నది అత్తారింట్లో అడుగుపెట్టేదాకా డిసైడ్ చేసుకోలేదు. కుటుంబసభ్యులూ, బంధువులతో ఎప్పుడూ కళకళలాడుతూ ఉండే కృష్ణగారింటికి వెళ్ళాక.. ఇంటిని చక్కబెడుతూ ఇల్లాలిగానే ఉండిపోవాలనిపించింది. తెలుగు సరిగా రాక మొదట్లో చాలా ఇబ్బందిపడ్డా. అత్తయ్య ఇందిరా దేవితో సరిగా మాట్లాడలేకపోయేదాన్ని. మా అత్తగారి కోసమే తెలుగు త్వరగా నేర్చేసుకున్నాను. ఆ విషయంలో అత్తయ్య కూడా హెల్ప్ చేశారు. అలానే మహేష్ ని అర్థం చేసుకుని తనని బాగా చూసుకునే అమ్మాయి కోడలిగా రావాలని అత్తయ్య ఎప్పుడూ అనుకునేవారట. మా పెళ్లైన చాలా కొద్దిరోజులకే ‘నేను ఎలాంటి అమ్మాయి కోడలిగా రావాలనుకున్నానో నువ్వు అలానే ఉన్నావు’ అని అత్తయ్య అనడంతో చాలా సంతోషంగా అనిపించింది. నాకు తెలుగింటి సంప్రదాయాలూ, పండగలూ, పూజల గురించి పెళ్లైన కొత్తలో తెలియదు. మహేష్ కుటుంబంలో ప్రతి ఒక్కరూ సంప్రదాయాలకు ఎంతో విలువిస్తారు. పండగంటే వారంరోజులపాటు ఇంట్లో సందడి ఉంటుంది. అవన్నీ నాకు కొత్తగా అనిపించేవి. మహేష్ ని అడిగి తెలుసుకుందామంటే ఎప్పుడూ షూటింగులతో బిజీగా ఉండేవాడు. కుటుంబసభ్యులు కొత్తకావడంతో ఏదైనా అడగడానికి బెరుగ్గా ఉండేది. అప్పుడు అత్తయ్యే నన్ను అర్థం చేసుకుని నా భయాలన్నీ దూరం చేశారు.

మహేష్ కి ఇష్టమైన వంటకాల్ని దగ్గరుండి నేర్పించారు. సంప్రదాయాల్నీ పండగల సమయాల్లో చేసుకునే పులిహోర, పరమాన్నం, పొంగలి తదితర వంటకాల్నీ పరిచయం చేశారు. అందుకే ఇప్పుడు నేను మా పిల్లలకి అవన్నీ చేసి పెట్టగలగుతున్నాను. అలానే నేను అత్తయ్యను చూసి నేర్చుకున్నవీ కొన్ని ఉన్నాయి. ఆమె చాలా సింపుల్ గా, నిరాడంబరంగా ఉంటారు. ఇంటికి అతిథులొస్తే భోజనం పెట్టకుండా పంపరు. మర్యాదల విషయంలో తన తరవాతే ఎవరైనా అనిపిస్తుంది. ఈ వయసులోనూ చురుగ్గా ఉంటారు. ఇంటి పనులన్నీ దగ్గరుండి చూసుకుంటారు. తక్కువ మాట్లాడే అత్తయ్యది చాలా పాజిటివ్ నేచర్ ..!ఎవర్నీ నొప్పించరు. ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఉంటారు. ఇలా చెప్పుకుంటూపోతే అత్తయ్యని చూసి ఎన్నో నేర్చుకోవాలి. అవన్నీ నేను అలవాటు చేసుకుంటున్నా. చాలా తక్కువ సమయంలోనే మా అమ్మ స్థానాన్ని భర్తీ చేశారామె. మా పెళ్ళైన కొద్దిరోజులకే.. మా అమ్మానాన్నలు ఓ ప్రమాదంలో చనిపోయారు. ఆ బాధతో డిప్రెషన్లోకి వెళితే, అత్తయ్య పక్కనే ఉండి నాక్కావల్సినవన్నీ తనే చూసుకున్నారు. ఆ సమయంలో అన్నం తినిపిస్తుంటే అమ్మే అత్తయ్యలో కనిపించేది. ఒక్కమాటలో చెప్పాలంటే- నన్ను కోడలిగా కాకుండా కూతురిలా చూసుకుంటారు. ఈ విషయంలో అందరూ ‘నువ్వెంతో లక్కీ… అంటుంటారు’. మా ఆడపడుచులు. ఇక, పాప సితార గురించి చెప్పాలి. అది అచ్చం మా అత్తయ్యలానే ఉంటుంది. ఒక్కోసారి దాని మాటలూ చేతలూ అత్తయ్యలానే అనిపిస్తాయి” అంటూ చెప్పుకొచ్చింది.

నారా బ్రాహ్మణి

నారా లోకేష్ భార్య మరియు నందమూరి బాలకృష్ణ కుమార్తె అయిన బ్రాహ్మణి తన అత్త భువనేశ్వరి గురించి మాట్లాడుతూ.. “చిన్నప్పుడు అత్తయ్య వాళ్ళింటికి ఎక్కువ వెళ్ళేదాన్ని. మేనత్త ఇల్లు కాబట్టి.. అక్కడే కొన్నిరోజులు ఉండటం అలవాటు. అందుకే పెళ్ళయ్యాక నేను వేరే ఇంటికి వెళ్ళాలనిపించలేదు. ఇది నా మెట్టినిల్లు అనేకంటే ఇంకో పుట్టిల్లు అనే ఫీలవుతుంటాను. చిన్నప్పుడు నేను భువనేశ్వరి అత్తయ్యకి భయపడేదాన్నట. అప్పుడప్పుడూ ఆ విషయం గుర్తు చేసి నన్ను ఆటపట్టిస్తుంటారు. తనకి ఆడపిల్లలు లేకపోవడంతో నన్నే కూతురు అనుకుంటారు. పెళ్ళయ్యాక కూడా చదువుకుంటానంటే అందరికంటే ముందు అత్తయ్యే ప్రోత్సహించారు. ఆమె చాలా తెలివైనవారు. మావయ్య హెరిటేజ్ ను స్థాపించి చంటిబిడ్డలా అత్తయ్య చేతుల్లో పెడితే దాన్ని రెండువేల కోట్ల వ్యాపార సామ్రాజ్యంగా తీర్చిదిద్దారు. నా దృష్టిలో ఇల్లాలిగా, వ్యాపారవేత్తగా ఆమె ‘ది బెస్ట్’. మావయ్యగారు రాజకీయాల్లో బిజీగా ఉన్నా.. ఇటు ఇంటినీ అటు ఆఫీసునీ చాలా చక్కగా మేనేజ్ చేస్తుంటారు. ఆడవాళ్లకు ఆర్థిక స్వేచ్ఛా, స్వాతంత్య్రం అవసరమంటారు. అందుకే ‘హెరిటేజ్’ ద్వారా మహిళల్ని ప్రోత్సహిస్తున్నారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా ఆడపిల్లల చదువుకి సాయం అందిస్తున్నారు. బయటే కాదు ఇంట్లో కూడా ఆడపిల్లల్ని ఎంకరేజ్ చేస్తుంటారు. అది నా విషయంలోనే రుజువైంది. నన్ను నమ్మి ‘హెరిటేజ్’ కీలక బాధ్యతలు నాకు అప్పగించాలన్న నిర్ణయం అత్తయ్యదే.

ఎప్పుడూ నన్ను ‘గైడ్’ చేస్తుంటారు. పెళ్ళయ్యాక ఆమె నుండీ నేను చాలా నేర్చుకున్నాను. సెలవురోజైనా తెల్లవారుజామున నాలుగ్గంటలకే నిద్రలేస్తారు. వ్యాయామం ఆ తరవాత పూజా చేశాకే దినచర్య ప్రారంభిస్తారు. ఆరోగ్యంపట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఇంట్లోకీ, మావయ్యగారికీ ఏం కావాలో స్వయంగా చూసుకుంటారు. తరచూ ‘హెరిటేజ్’ బ్రాంచిలన్నింటికీ వెళ్ళొస్తుంటారు. ఎంత దూరం ప్రయాణం చేసినా అత్తయ్య అస్సలు అలసిపోరు. ఆ విషయంలో నాకు భలే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఏ పనినీ వాయిదా వేయరు. ఏదైనా చేయాలీ అనుకుంటే వందశాతం కష్టపడి చేసి తీరతారు. ఆ పట్టుదల నాకు బాగా నచ్చుతుంది. మా అబ్బాయి దేవాన్ష్ పనులైతే ఎవర్నీ చేయనివ్వరు. తనే వాడిని రెడీ చేసి స్కూలుకు పంపుతారు. నానమ్మగా వాడితో క్వాలిటీ టైం గడపడానికే చూస్తారు. నాకేదన్నా పని ఉంటే వాడికోసం ఆమె ఇంట్లో ఉండిపోయి నన్ను పంపుతారు. అలాంటప్పుడే ఉమ్మడి కుటుంబం విలువ తెలుస్తుంది. నాక్కూడా అదే ఇష్టం. అందుకే పెళ్లైనప్పట్నుంచీ అత్తయ్య వాళ్ళతోనే కలిసి ఉంటున్నాం. నా విజయంలో అత్తయ్యదే కీలక పాత్ర అని గర్వంగా చెప్పుకుంటా. పండగలూ, ఇతర ఫంక్షన్లప్పుడు తను దగ్గరుండి ఏర్పాట్లు చూసుకుని మీరంతా సమయానికి వస్తే చాలని చెబుతారు. ఎప్పుడూ చురుగ్గా ఉండే అత్తయ్య పనితీరు చూస్తే నాకు ముచ్చటేస్తుంది. తనని దగ్గరగా చూస్తున్న నేను కూడా క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్నా. అత్తయ్యలా వ్యక్తిగతంగానూ.. వృత్తిగతంగానూ చక్కగా సమన్వయం చేసుకోవడం అలవాటు చేసుకుంటున్నా.” అంటూ చెప్పుకొచ్చింది బ్రాహ్మణి.

ఉపాసన కొణిదెల

మెగా పవర్ స్టార్ రాంచరణ్ భార్య అయిన ఉపాసన తన అత్త సురేఖ గురించి మాట్లాడుతూ.. “నేను పుట్టి పెరిగింది ఉమ్మడి కుటుంబంలో. మా ఇంట్లో వాళ్ళందరినీ కలిపితే యాభై మంది పైనే ఉంటారు. మేమంతా ఎప్పుడూ ఒకే మాటమీద ఉంటాం. అందరం కలిస్తే ఇంట్లో పండగలాగే ఉంటుంది. అందుకే మా అత్తగారిది కూడా ఉమ్మడి కుటుంబం అయితే బాగుంటుంది అనిపించింది. చరణ్ నేనూ ప్రేమలో ఉన్నప్పుడు ఒకసారి- మనం పెళ్ళయ్యాక ఎక్కడ ఉంటాం అని అడిగా. తను కొన్న స్థలం గురించి చెప్పి అక్కడే ఇల్లు కట్టేస్తా అన్నాడు. అంటే పెళ్ళయ్యాక ఇద్దరమే కలిసుండాలని తను అనుకుంటున్నాడేమోనని భయమేసింది. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. కాసేపయ్యాక పెళ్ళైన వెంటనే కుటుంబాన్ని వదిలేసి విడిగా ఎలా ఉండగలుగుతారు అని అడిగేశా. ‘కట్టబోయే ఇల్లు మనం వీకెండ్లో ఉండటానికే. నువ్వేమంటావో చూద్దామని అలా అన్నాను’ అని నవ్వేశాడు. ఆ మాటలకి హమ్మయ్యా అనుకున్నా. అత్తమ్మ సురేఖ అంటే చరణ్ కి ప్రాణం. ఇంట్లో ఒక్క క్షణం అత్తమ్మ లేకపోయినా విలవిలలాడిపోతాడు. నాకూ ఆమె అంటే చాలా గౌరవం. పెళ్ళికి ముందు నుంచే నాకు పెట్స్ అంటే ప్రాణం. ఓ పది వరకూ పప్పీలున్నాయి. వాటితో కాసేపు గడపనిదే నాకు రోజు గడవదు.

పెళ్ళయ్యాక నాతోపాటు వాటిని కూడా తెచ్చుకుంటానని అత్తమ్మని అడగడానికి కాస్త మొహమాట పడ్డా. ఇలాంటి విషయాల్లో చరణ్ రికమండేషన్ బాగోదు. పెళ్ళి ఖాయమయ్యాక ఎలా చెప్పాలా అని సతమతమవుతుంటే ఒకరోజు అత్తమ్మే నా దగ్గరకొచ్చి.. ‘నీతోపాటు ఎన్ని పెట్స్ తెచ్చుకున్నా నాకేం అభ్యంతరం లేదు. ఎందుకంటే అది ఇక నుంచీ నీ ఇల్లు కూడా’ అనడంతో చాలా సంతోషమనిపించింది. మా పెళ్ళయ్యాక బయట ఖాళీ స్థలంలో పెట్స్ కోసం ప్రత్యేకంగా ఓ ఇంటినే కట్టించారు. అడగకుండానే అందరి మనసులూ అవసరాలూ అర్థం చేసుకునే అత్తమ్మ వాళ్ళ అత్తగారినీ ఎంతో బాగా చూసుకుంటారు. ఆమె పనులన్నీ తనే దగ్గరుండి చేస్తారు. అంటే ఇప్పుడు మా ఇంట్లో రెండు తరాల కోడళ్ళం ఉన్నామన్నమాట. అప్పుడప్పుడూ చరణ్ వాళ్ళ నానమ్మగారు- సురేఖ అత్తమ్మ పెద్దకోడలిగా ఆ ఇంట్లో ఎలా ఉన్నారో చెబుతుంటారు. అప్పుడూ ఇప్పుడూ కుటుంబానికి పిల్లర్ గా నిల్చున్న అత్తమ్మ నన్ను కూడా ఎంతో ప్రోత్సహిస్తారు. తన ఇద్దరు కూతుర్లలానే నన్నూ చూస్తారు. అత్తమ్మది ముక్కుసూటి మనస్తత్వం ఏదైనా మొహం మీదే చెప్పేస్తారు. మావయ్యగారి సినిమాలు బాగుంటే బాగున్నాయనీ లేదంటే లేదనీ సూటిగా చెప్పేస్తారు. నేను కూడా ఆమె నుంచి అదే నేర్చుకున్నా. తను వంట బాగా చేస్తారు. కానీ నేను డైటింగ్ కోసం వేరే ఫుడ్ తీసుకోవడం వల్ల అది మిస్ అవుతున్నా. చరణ్ కూడా ఎప్పుడూ అదే అంటుంటాడు.

సమంత అక్కినేని

యువసామ్రాట్ నాగ చైతన్య భార్య మరియు స్టార్ హీరోయిన్ అయిన సమంత తన అత్త అమల గురించి మాట్లాడుతూ.. ” మా అత్తమ్మ లక్ష్మి( నాగార్జున మొదటి భార్య) గారితో కలవడం తక్కువ. అయినప్పటికీ మా మధ్య మంచి బంధం ఉంటుంది. ఇక చిన్న అత్తయ్య అమల గారు అయితే నాకు బాగా క్లోజ్. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఆమె నాకు సిస్టర్ లా అనిపిస్తుంది. చైతన్య, అఖిల్ పనులన్నీ ఇప్పటికీ ఆమె దగ్గరుండి చూసుకుంటుంది. సమాజం పట్ల కూడా అత్తయ్య చాలా బాధ్యతగా వ్యవహరిస్తుంటుంది. రెండు విధాలుగా కూడా అమల అత్తయ్య నాకు ఇన్స్పిరేషన్ అంటూ చెప్పుకొచ్చింది.

లక్ష్మీ ప్రణతి నందమూరి

యంగ్ టైగర్ ఎన్టీఆర్ భార్య లక్ష్మీ ప్రణతి తన అత్త షాలిని గురించి మాట్లాడుతూ.. ” పెళ్ళైన కొత్తలో నాకు.. నా భర్త ఎన్టీఆర్ తో మాట్లాడడానికి కొంచెం టెన్షన్ వచ్చేది. ఇక మావయ్యతో మాట్లాడడానికి అయితే చాలా భయం. అయితే అత్తయ్య గారు నన్ను ఎంతో ప్రేమతో దగ్గరికి తీసుకుని.. నా టెన్షన్ ను, భయాన్ని దూరం చేశారు. తరువాత మావయ్య గారితో కూడా చాలా ఫ్రీగా మాట్లాడేదాన్ని. ఇప్పటికీ అత్తయ్య.. నా భర్త కంటే ఎక్కువగా నా పైనే ప్రేమ చూపిస్తూ ఉంటారు” అంటూ చెప్పుకొచ్చింది.

 

30 ఏళ్ళు వచ్చినా పెళ్ళిచేసుకోని టాలీవుడ్ హీరోయిన్లు వీళ్ళే..!
బాలీవుడ్ లో మంచి కలెక్షన్లు రాబట్టిన సౌత్ సినిమాలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus