ప్రముఖ బాలీవుడ్ నిర్మాత అలాగే అతిలోక సుందరి శ్రీదేవి భర్త అయిన బోనికపూర్ పై ఇటీవల చీటింగ్ కేసు నమోదయ్యింది. సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ నిర్వహణ విషయంలో ప్రవీణ్ శ్యామ్ అనే వ్యక్తి బోనికపూర్ తో పాటు మరికొందరి పై ఈ చీటింగ్ కేసు నమోదవ్వడం సంచలనంగా మారింది. ప్రవీణ్ శ్యామ్ కేసు నమోదు చేసిన వివరాల ప్రకారం ‘2018లో పవన్ జంగిద్ అనే వ్యక్తి కలిశాడట. త్వరలో సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ నిర్వహించబోతున్నామని… ఈ ఈవెంట్ లో బాలీవుడ్ సినీ తారలందరూ తరలివస్తారని చెప్పాడు. బాలీవుడ్ ప్రముఖ నిర్మాత బోనికపూర్ సహా మరికొంతమంది ఈ ఈవెంట్ కోసం భాగస్వాములవుతున్నారని చెప్పి… నువ్వు కూడా ఇందులో ఎంతోకొంత ఇన్వెస్ట్ చేస్తే నీ పెట్టుబడికి రెట్టింపు ఆదాయం వస్తుందని చెప్పాడట.’
ఇక పవన్ జంగిద్ తనకు ఈ విషయం చెప్పిన కొన్ని రోజుల తర్వాత బోనికపూర్ ప్రెస్ మీట్ పెట్టి జైపూర్ లో సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ నిర్వహించబోతున్నామని ప్రకటించారట. నిజమే అనుకుని తానో 67 లక్షలు, తన స్నేహితుడు 32 లక్షలు పెట్టుబడిగా పవన్ జంగిద్ కు ముట్టచెప్పినట్టు ప్రవీణ్ శ్యామ్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. అయితే ఇంతవరకు సెలెబ్రిటీ క్రికెట్ లీగ్ మాత్రం జరగలేదు కాబట్టి తన డబ్బుని తిరిగిచ్చేయాలని కోరితే పవన్ జంగిద్ కుదరదంటున్నాడని ప్రవీణ్ శ్యామ్ తెలిపాడు. పవన్ జంగిద్, బోణీకపూర్ మాటలు నమ్మే తాను వారికీ డబ్బు ఇచ్చానని.. తనతో పాటు 2.5 కోట్ల రూపాయల మొత్తంలో మరికొందరు మోసపోయినట్లు ప్రవీణ్ ఈ కేసు నమోదు చేసాడట. విచారణ ప్రారంభించిన పోలీసులు… అవసరమైతే బోనికపూర్ ని కూడా విచారిస్తామని పోలీసులు చెబుతున్నారట.