15 ఏళ్ల క్రితం జరిగిన అవమానానికి సరైన సమాధానం చెప్పిన మెగాస్టార్ చిరంజీవి!

ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అనే మాట పెద్దవాళ్లు చెప్పారు. అయితే ఎక్కడ అవమానింపబడ్డామో అక్కడే గౌరవం పొందడం అనేది నిజంగా గొప్పవిషయం. దాదాపు 15 సంవత్సరాల క్రితం తెలుగు చలనచిత్ర పరిశ్రమ సాక్షిగా మన తెలుగు సినిమాకి, మన తెలుగు మహానటులకి గౌరవం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేసిన మెగాస్టార్ చిరంజీవి నేడు అవమానించిన వారి చేతే అభిమానింపబడడే కాక అరుదైన గౌరవాన్ని అందుకుని తెలుగు వారు తలెత్తుకునేలా చేశారు.

2007 వజ్రోత్సవాల్లో ‘‘గోవా, న్యూఢిల్లీ, బాంబే లాంటి చోట్ల ఫిల్మ్ ఫెస్టివల్స్ జరిగితే అక్కడ తెలుగు నటులకు గుర్తింపు లేదు. నేను గోవా ఫిల్మ్ ఫెస్టివల్‌కి వెళ్ళినప్పుడు అక్కడ మహానటుడు రామారావు బొమ్మ లేదు, అక్కినేని నాగేశ్వరరావు బొమ్మ లేదు. మా మాట సరేసరి. ఇదీ మన గుర్తింపు. మనం బాంబే, ఢిల్లీ, గోవా వరకే వెళ్లలేకపోయాం’’ అంటూ చిరు భావోద్వేగానికి గురయ్యారు. కట్ చేస్తే.. ఇప్పుడు 53వ గోవా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో తెలుగు సినిమాకి పెద్దపీట వేశారు.

ఇండియన్ పనోరమా విభాగంలో (మెయిన్ స్ట్రీమింగ్ కేటగిరీ) తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’.. బాలయ్య ‘అఖండ’ సినిమాలు ప్రదర్శించనున్నారు. వీటితో పాటు ఓటీటీలో ఆడిన ‘సినిమా బండి’, ‘ఖుదీరామ్ బోస్’ సినిమాలు ఇండియన్ పనోరమాలో ప్రదర్శనకు ఎంపికయ్యాయి. తెలుగులో అడివి శేష్ నటించిన ‘మేజర్’ సినిమా హిందీ వెర్షన్ కూడా ఇండియన్ పనోరమాలో ప్రదర్శనకు ఎంపికైంది. వీటితో పాటు తెలుగు నిర్మాత స్రవంతి రవి కిశోర్ నిర్మించిన తొలి తమిళ సినిమా ‘కీడా’..

మరో టాలీవుడ్ ప్రొడ్యూసర్ అభిషేక్ అగర్వాల్ నిర్మించిన హిందీ సినిమా ‘ది కశ్మీర్ ఫైల్స్’ కూడా ఇండియన్ పనోరమాకు ఎంపికయ్యాయి. ఇక ఇండియన్ రీస్టోర్డ్ క్లాసిక్స్ విభాగంలో ప్రదర్శితం కానున్న 5 సినిమాల్లో కళాతపస్వి కె. విశ్వనాథ్ రూపొందించిన అద్భుత కళాఖండం ‘శంకరాభరణం’ కూడా ఉండడం విశేషం. అలానే ఇటీవల కన్నుమూసిన కృష్ణంరాజు, కృష్ణ వంటి ప్రముఖులకు నివాళిగా వారు నటించిన సినిమాలను ప్రదర్శించనున్నారు. ఈసారి ఇండియన్ పనోరమా చిత్రాల ఎంపిక కమిటీలో..

వి.ఎన్.ఆదిత్య, ప్రేమ్ రాజ్ వంటి ఇద్దరు తెలుగు దర్శకులకు చోటు దక్కడం విశేషం. దీనికి ప్రధాన కారణం.. ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలతో తెలుగు సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చిన రాజమౌళి.. ఆ తర్వాత ప్రభాస్, రానా, అనుష్క, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి స్టార్స్.. చిరంజీవి ఆరోజు ఏ గుర్తింపు ఐతే మనకి లేదని బాధపడ్డారో.. ఈరోజు ఆ గుర్తింపు మన తెలుగు సినిమాకి గోవాలో దక్కింది. ఎవరి విగ్రహాలు లేవని బాధపడ్డారో..

ఆ హీరోల సినిమాలు ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించే పరిస్థితి వచ్చింది. ‘ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ గా మెగాస్టార్ చిరంజీవిని ఎంపిక చేయడం గర్వకారణం. నవంబర్ 20 నుండి 28 వరకు గోవాలో జరుగుతున్న 53వ అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో మన తెలుగు వాళ్లు సత్తా చాటుతుండడంతో.. 15 సంవత్సరాల క్రితం వజ్రోత్సవాల్లో చిరు స్పీచ్ తాలుకు వీడియోను వైరల్ చేస్తున్నారు మూవీ లవర్స్..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus