సాయిధరమ్ తేజ్ దాదాపు ఆరు ఫ్లాపు సినిమాల తర్వాత నటించిన సినిమా “చిత్రలహరి”. కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మించగా “హలో” ఫేమ్ కళ్యాణి ప్రియదర్శిని కథానాయికగా నటించిన ఈ చిత్రం సాయిధరమ్ కెరీర్ కి చాలా కీలకం. మరి ఈ సినిమా హిట్టై తేజ్ బాబు కెరీర్ ని కష్టాల నుంచి బయటపడేసిందా? లేదా? అనేది రివ్యూ చదివి తెలుసుకోండి..!!
కథ: విజయ్ కృష్ణ (సాయిధరమ్ తేజ్) చిన్నప్పుడే తల్లిని కోల్పోయి.. తండ్రి పెంపకంలో పెరిగిన కుర్రాడు. దురదృష్టమో, దరిద్రమో ఏది కావాలనుకుంటాడో అది దక్కకుండాపోతుంది. చదివిన చదువుకు తగిన ఉద్యోగం రాదు.. ప్రేమించిన అమ్మాయి సొంతమవ్వదు. చివరికి ఎంతో కష్టపడి తయారు చేసిన ప్రొజెక్ట్ కూడా రిజెక్ట్ అవుతుంది. ఇలా.. జీవితంలో అన్నీ ఫెయిల్యూర్స్ తో నిరాశానిస్పృహలతో సాగే ఓ ఆశావాది జీవితమే “చిత్రలహరి”. చివరికి విజయ్ కి విజయం సొంతమైందా లేదా? అనేది తెలియాలంటే సినిమా చూడాలండోయ్.
నటీనటుల పనితీరు: కాటిక చీకటిలో వెలుతురు కోసం వెతుక్కునే ఆశావాదిగా సాయిధరమ్ తేజ్ నటన బాగుంది. కాకపోతే.. సాయిధరమ్ తేజ్ లుక్ మారుద్దామనే ప్రయత్నంలో పెంచిన గెడ్డం తేజ్ కి అంతగా సూటవ్వలేదు. కానీ.. క్యారెక్టర్ కు సరిపోయింది. కొన్ని సన్నివేశాల్లో ఎమోషన్స్ ను సరిగా ఎలివేట్ చేయలేకపోయాడు తేజ్.కళ్యాణి ప్రియదర్శిని పాత్రకి నవతరం అమ్మాయిలు బాగా కనెక్ట్ అవుతారు. ప్రతి విషయంలో సొంత నిర్ణయం కంటే స్నేహితులు లేదా సన్నిహితుల డెసిషన్ మీద ఆధారపడే యువతిగా కళ్యాణి ఆకట్టుకుంది. తేజ్ తో కెమిస్ట్రీ మాత్రం అంతగా పండలేదు.
నివేదా పేతురాజ్ పోషించిన స్వేచ్ఛ పాత్ర రియాలిటీకి దగ్గరగా ఉంది. సమాజంలో సగానికి పైగా అమ్మాయిలు అలాగే ఉంటున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే సాయిధరమ్ తేజ్ తర్వాత సినిమాలో ఆకట్టుకున్న పాత్ర నివేదాది.మన జీవితంలోనూ ఇలాంటి ఒక తండ్రి ఉంటే బాగుండు అనిపించేంతలా పోసాని పాత్ర ఉంది. ఆయన సంభాషణలు కూడా మానసకు హత్తుకొనేలా ఉన్నాయి. సునీల్. వెన్నెల కిషోర్ కామెడీ అక్కడక్కడా నవ్వించింది.
సాంకేతికవర్గం పనితీరు: కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ బాగుంది. కాకపోతే.. ఆ ఫ్రెమింగ్స్ & లైటింగ్ ఆయన పాత్ర సినిమాలను గుర్తుకు తెస్తాయి. ఆ నియోన్ లైటింగ్ & కలర్ గ్రేడింగ్ విషయంలో కాస్త మార్పు చూపిస్తే బెటర్.శ్రీకర్ ప్రసాద్ ఎడిట్ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండు అనిపించింది. ఫస్టాఫ్ పర్లేదు కానీ సెకండాఫ్ మాత్రం బాగా ల్యాగ్ అయిపోయింది. 130 నిమిషాల సినిమా కూడా ల్యాగ్ అనిపించడం అనేది సినిమాకి నెగిటివ్ పాయింట్ అవుతుంది. నిర్మాణ విలువలు కథలోని కంటెంట్ కంటే ఎక్కువగానే ఉన్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ప్రొడక్షన్ వేల్యూస్ విషయంలో కాంప్రమైజ్ అవ్వమనే విషయాన్ని మరోమారు ప్రూవ్ చేసుకొంది.
దర్శకుడు కిషోర్ తిరుమల ఈ “చిత్రలహరి”ని అన్నీ వర్గాల ప్రేక్షకులు అలరించేలా తెరకెక్కించాలనే ప్రయత్నంలోనే కాస్త తడబడ్డాడు. తన టార్గెట్ యూత్ ఆడియన్స్ కాబట్టి కేవలం వాళ్ళకు నచ్చే విధంగానే కథనాన్ని రాసుకొని ఉంటే బాగుండేది. కానీ.. అందర్నీ సంతృప్తిపరచాలనే ప్రయత్నం కాస్త బెడిసికొట్టింది. సాయిధరమ్ తేజ్ క్యారెక్టర్ & క్యారెక్టరైజేషన్ కాస్త కొత్తగా ఉన్నా.. కథనం మాత్రం నత్త నడకలా సాగింది. ఆ కారణంగా సెకండాఫ్ సహనాన్ని పరీక్షిస్తుంది. దర్శకుడిగా అరకొర మార్కులతో సరిపెట్టుకొన్న కిషోర్ తిరుమల రచయితగా మాత్రం అలరించాడు. ఆల్మోస్ట్ అన్నీ డైలాగ్స్ ఆలోచింపజేసేలా ఉన్నాయి. కాసిన్ని మనసుకి హత్తుకున్నాయి. హిమజ పాత్రను ఎస్టాబ్లిష్ చేయడం కోసం రాసుకున్న ట్రాక్, ఆమె చేసిన అతి సినిమాకి మైనస్ గా మారాయి.
విశ్లేషణ: వరుస ఫ్లాపులతో కొట్టుమిట్టాడుతున్న తేజ్ కి “చిత్రలహరి” ఒక డీసెంట్ హిట్ అనే చెప్పాలి. కానీ.. కథనం ఇంకాస్త ఆకట్టుకొనే విధంగా సాగి, ఎండింగ్ ఇంకాస్త ఎఫెక్టివ్ గా ఉండి ఉంటే సూపర్ హిట్ అయ్యేది.
రేటింగ్: 2/5